Prevent WhatsApp Account Hacking: వాట్సాప్ ద్వారా జరుగుతున్న వివిధ రకాల హ్యాకింగ్ స్కామ్‌ల గురించి మనం తరచూ వింటున్నాం. వాట్సాప్ వినియోగదార్లను లక్ష్యంగా చేసుకునే హ్యాకర్ల సంఖ్య పెరిగింది. కీప్‌నెట్ డేటా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా వాట్సాప్ యూజర్లు సైబర్ నేరగాళ్లకు టార్గెట్‌గా మారారు. హ్యాకర్లు ఫిషింగ్ స్కామ్‌లు, సోషల్ ఇంజినీరింగ్ దాడులు, స్పైవేర్ వంటి వివిధ పద్ధతులను ఉపయోగించి వినియోగదారుల ఖాతాలను అక్రమంగా యాక్సెస్ చేస్తున్నారు. ఆ ఖాతాల నుంచి కీలకమైన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు లేదా ఖాతా హ్యాక్ చైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
మీ వాట్సాప్ ఎప్పటికీ హ్యాక్ కాకుండా అడ్డుకోవడానికి 5 మార్గాలు ఉన్నాయి
2-స్టెప్ వెరిఫికేషన్ సెట్ చేయండి:2-స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయడం వల్ల మీ వాట్సాప్ ఖాతాకు అదనపు భద్రత కవచం ఏర్పడుతుంది. సైబర్ క్రిమినల్‌కు మీ ఫోన్ నంబర్ దొరికినప్పటికీ, మీ ఇ-మెయిల్‌కు వచ్చే వెరిఫికేషన్ కోడ్ లేకుండా ఆ వ్యక్తి మీ ఖాతాలోకి లాగిన్ కాలేడు. మీ రిజిస్ట్రేషన్ కోడ్ లేదా 2-స్టెప్ వెరిఫికేషన్ పిన్‌ను ఎవరికీ చెప్పకూడదు. ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచినంత కాలం మీ ఖాతాను ఎవరూ అనధికారికంగా వినియోగించలేరు & హ్యాకింగ్ ప్రమాదం నుంచి సమర్థవంతంగా రక్షించుకోవచ్చు.
మీ వాట్సాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయండి:మీ డేటా భద్రత కోసం, మీ వాట్సాప్ యాప్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలి. ప్రతీ అప్‌డేట్‌లో సరికొత్త భద్రత కవచాలు, లక్షణాలు లభిస్తాయి. యాప్‌ను అప్‌డేటెడ్‌గా ఉంచడం వల్ల మీ ఖాతాకు అనధికార యాక్సెస్ నుంచి సాధ్యమైనంత రక్షణ లభిస్తుంది.
అనుమానిత లింక్‌లు, సందేశాలపై క్లిక్ చేయకూడదు:మీకు తెలియని వ్యక్తులు పంపే ప్రతి లింక్ లేదా సందేశాన్ని అనుమానించాల్సిందే. అలాంటి అనుమానిత లింక్‌లు లేదా సందేశాలపై క్లిక్ చేయకుండా వాటిని డిలీట్ చేయడం మంచింది. అవి, మీ వ్యక్తిగత వివరాలను దొంగిలించడానికి లేదా మీ పరికరంలో మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి సైబర్ దుండగులు పంపిన మోసపూరిత విషయాలు కావచ్చు. మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే, మీ వాట్సాప్ ఖాతా అంత సురక్షితంగా ఉంటుంది.
లింక్ అయిన డివైజ్‌లను తరచూ చెక్ చేయాలి:మీ వాట్సాప్ ఖాతా సురక్షితంగా ఉండాలంటే, మీ అకౌంట్‌కు లింక్ అయిన డివైజ్‌లను రెగ్యులర్‌గా తనిఖీ చేయాలి. మీ ఖాతాకు లింక్ అయిన అన్ని పరికరాలను చూడటానికి 'WhatsApp Settings'లోకి వెళ్లి 'Linked Devices'ను ఎంచుకోండి. మీకు తెలీని ఏదైనా డివైజ్‌తో మీ వాట్సాప్ ఖాతా లింక్ అయినట్లు అక్కడ కనిపిస్తే, ఆ పరికరంపై నొక్కి "లాగ్ అవుట్" ఎంచుకోండి. ఎప్పటికప్పుడు ఇలా చేయడం వల్ల హ్యాకర్ల బారి నుంచి తప్పించుకోవచ్చు.
మీ పరికరం యాక్సెస్‌ను సురక్షితంగా మార్చండి:మీ ఫోన్‌ను భద్రతను పెంచడానికి 'డివైజ్ కోడ్' సెట్ చేయండి. ఎవరైనా మీ ఫోన్‌ను ఉపయోగించే ఆస్కారం ఉంటే, వాళ్లపై ఓ కన్నేసి ఉంచండి. అలాంటి వ్యక్తులు మీ అనుమతి లేకుండా మీ వాట్సాప్ ఖాతాను ఉపయోగిస్తారు. మీ ఫోన్ లాక్ చేయడం వల్ల అనధికార వినియోగానికి చెక్ చెప్పవచ్చు.
మరో ఆసక్తికర కథనం: పాన్ కార్డ్ 2.0 ఇంకా తీసుకోలేదా?, ఆన్‌లైన్‌లో ఇలా సింపుల్‌గా అప్లై చేయండి