Tax Saving Scheme:
ప్రజల్లో సుదీర్ఘ కాలం పొదుపును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రకటించింది. పన్ను మినహాయింపులు కల్పించి మరింత ఆకర్షణీయంగా మార్చింది. కొందరు ఈ విషయం తెలియక మదుపు చేయరు. ఫలితంగా పన్ను ప్రయోజనాలను కోల్పోతారు. ఈ నేపథ్యంలో సెక్షన్ 80సీ మినహాయింపు అందించే పోస్టాఫీసు పథకాలు మీకోసం!
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
ప్రజలు సుదీర్ఘ కాలం మదుపు చేసేందుకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మంచి ఆప్షన్. తగినంత డబ్బును ఆదా చేసుకొనేందుకు ఈ పథకం వీలు కల్పిస్తుంది. మెచ్యూరిటీ తీరాక పెద్ద మొత్తంలో సంపద అందిస్తుంది. ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీరేటు 7.1 శాతంగా ఉంది. పైగా మూడు రకాలుగా పన్ను ప్రయోజనాలు కల్పిస్తోంది. నెలవారీ కంట్రిబ్యూషన్ రూ.1.5 లక్షల వరకు మినహాయింపు ఉంది. అలాగే వడ్డీ, మెచ్యూరిటీ తీరాక అందే మొత్తంపై పన్నులేమీ ఉండవు.
సుకన్య సమృద్ధి యోజన (SSY)
ఆడపిల్లల విద్య, పెళ్లిళ్ల కోసం ప్రవేశపెట్టిన పథకం సుకన్య సమృద్ధి యోజన. ప్రతి ఇంట్లో పదేళ్లలోపు ఇద్దరు అమ్మాయిల పేరుతో ఈ ఖాతాలు తెరవొచ్చు. కనీసం 15 ఏళ్లు ఇందులో మదుపు చేయాలి. ప్రస్తుతం ప్రభుత్వం 7.6 శాతం వడ్డీ అందిస్తోంది. ఏడాదికి కనీసం రూ.250, గరిష్ఠంగా రూ.150,000 వరకు పొదుపు చేయొచ్చు. సెక్షన్ 80సీ ప్రకారం ఏటా రూ.150000 వరకు మినహాయింపు పొందొచ్చు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)
వృద్ధుల ఆర్థిక భద్రత కోసం ప్రవేశపెట్టిన పథకం ఇది. 55-60 మధ్య వయస్కులు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. ఇందులో రూ.1000 నుంచి రూ.15 లక్షల వరకు దాచుకోవచ్చు. ఐదేళ్ల టర్మ్ డిపాజిట్ మెచ్యూరిటీ తీరాక మరో మూడేళ్లకు పొడగించుకోవచ్చు. ప్రభుత్వం ఈ పథకంపై 8 శాతం వడ్డీ అందిస్తోంది. వడ్డీపై పన్ను మినహాయింపేమీ లేదు. అయితే సెక్షన్ 80సీ కింద మినహాయింపు పొందొచ్చు.
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్ (TD)
టైమ్ డిపాజిట్ అకౌంట్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు పెద్ద తేడా ఏం ఉండదు. ప్రతి మూడు నెలలకు ప్రభుత్వం వడ్డీరేట్లను సవరిస్తుంది. టైమ్ డిపాజిట్లను రూ.1000 నుంచి ఆరంభించొచ్చు. గరిష్ఠ పరిమితేమీ లేదు. ఏటా వడ్డీ జమ చేస్తారు. ఐదేళ్ల టైమ్ డిపాజిట్లపై ప్రభుత్వం 7 శాతం వడ్డీ అందిస్తోంది. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC)
ఈ పథకం కనీస పెట్టుబడి రూ.1000. వంద రూపాయలు పెంచుకుంటూ గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. డిపాజిట్ మొదలైన తేదీ నుంచి ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీ తీరుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం 7 శాతం వడ్డీరేటు అందిస్తోంది. ఇందులో డిపాజిట్ చేసే మొత్తానికి సెక్షన్ 80సీ కింద మినహాయింపు పొందొచ్చు.