Sovereign Gold Bonds: సార్వభౌమ పసిడి బాండ్ల (Sovereign Gold Bonds) విక్రయం కొనసాగుతోంది. 2022-23 రెండో సిరీసు బాండ్ల సబ్‌స్క్రిప్షన్‌కు శుక్రవారమే చివరి తేదీ. ఒక గ్రాము బంగారం ధర రూ.5,197గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే గ్రాముపై రూ.50 వరకు రాయితీ లభిస్తుంది. రూ.5147కే వారు పసిడి బాండ్లు సొంతం చేసుకోవచ్చు. వీటిని కొనుగోలు చేసేముందు పన్ను చిక్కులు తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


రెండున్నర శాతం వడ్డీ


పసిడి బాండ్లపై ప్రభుత్వం 2.5 శాతం వడ్డీ చెల్లిస్తుందని తెలిసిందే. ఏటా రెండుసార్లు వడ్డీ జమ చేస్తుంది. మెచ్యూరిటీ తీరిన తర్వాత బంగారం ధరను బట్టి డబ్బులు ఇస్తారు. అయితే ఈ రాబడిపై ప్రభుత్వం పన్నులు వేసే సంగతి మర్చిపోవద్దు. ఈ బాండ్ల మెచ్యూరిటీ ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తర్వాత ముందుగానే వీటిని రీడీమ్‌ చేసుకొనే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత మూలధన రాబడిపై మాత్రం పన్ను లేదు. బాండ్లను బదిలీ చేస్తే వచ్చే మూలధన రాబడికి ఇండెక్సేషన్‌ ప్రయోజనం ఉంటుంది.


మూలధన రాబడిపై పన్ను


ఒకవేళ వ్యక్తుల ఆదాయం 30 శాతం దాటిపై మొత్తం 2.5 శాతం వడ్డీపై పన్ను తప్పదు. 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఐటీఆర్‌ ఫైలింగ్ చేసేటప్పుడు ఈ ఆదాయం చూపించాలి. టీడీఎస్‌ ఉండదు కాబట్టి అడ్వాన్స్‌ టాక్స్‌ చెల్లించాలి. మెచ్యూరిటీ తీరాక వచ్చే వడ్డీపై ఎలాంటి పన్ను ఉండదని తెలుసుకున్నాం కదా! అయితే ముందుగానే బాండ్ల నుంచి ఎగ్జిట్‌ అయ్యేందుకు రెండు మార్గాలున్నాయి. ఐదేళ్ల తర్వాత రీడీమ్‌ చేసుకోవడం ఒకటి. సెకండరీ మార్కెట్లో విక్రయించడం రెండోది. ప్రభుత్వం విక్రయించే పసిడి బాండ్లన్నీ ఆరు నెలల తర్వాత ప్రత్యేకమైన ఐఎస్‌ఐఎన్‌తో స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు అవుతాయి. ఈ రెండు విధానాల్లోనూ మూలధన రాబడిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.


రాబడిని బట్టి పన్ను రేటు


మూలధన రాబడి రెండు రకాలుగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. మూడేళ్ల లోపైతే షార్ట్‌ టర్మ్‌, మూడేళ్లు దాటితే లాంగ్‌టర్మ్ అంటారు. పసిడి బాండ్లపై షార్ట్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌కు గరిష్ఠ పన్నురేటు వర్తిస్తుంది. లాంగ్‌టర్మ్ అయితే ఇండెక్సేషన్‌ ప్రయోజనం పొందాక ఫ్లాటుగా 10 లేదా 20 శాతం పన్ను చెల్లించాలి. అందుకని సార్వభౌమ పసిడి బాండ్లు కొనుగోలు చేసే ముందు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోండి.


ఎవరు అర్హులు?


కేంద్ర ప్రభుత్వం తరఫున భారతీయ రిజర్వు బ్యాంకు సార్వభౌమ పసిడి బాండ్లను విక్రయిస్తుంది. ఎనిమిదేళ్ల కాల పరిమితితో విడతల వారీగా వీటిని అమ్ముతుంది. మెచ్యూరిటీ తీరాక అప్పటి మార్కెట్‌ ధర చెల్లిస్తుంది. అంతేకాకుండా దానిపై వార్షిక ప్రాతిపదికన 2.5 శాతం వడ్డీని ఇస్తుంది. ప్రతి ఆరు నెలలకు వడ్డీ జమ చేస్తుంది. ఫెమా చట్టం పరిధిలో దేశంలో నివసిస్తున్న భారతీయులంతా సార్వభౌమ పసిడి బాండ్లను కొనుగోలు చేయొచ్చు.


కొనుగోలు ఎలా?


పసిడి బాండ్లను కొనుగోలు చేయడం చాలా సులభం. స్టాక్‌ ఎక్స్‌ఛేంజీలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఆర్బీఐ వెబ్‌సైట్‌, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (SHCIL) ద్వారా ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ప్రతి కేంద్రంలో బాండ్ల అమ్మకం తేదీ, మెచ్యూరిటీ, ఇతర వివరాలు ఉంటాయి.