Sovereign Gold Bond Scheme 2024 Per Gram Price: బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవాళ్లకు సువర్ణావకాశం ఇది. మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే బంగారం కొనొచ్చు. 2023-24 సిరీస్‌లో చివరి విడత సావరిన్ గోల్డ్ బాండ్లను (SGBs) రిజర్వ్ బ్యాంక్ (RBI) విడుదల చేసింది.
2023-24 సిరీస్‌లో నాలుగో విడత SGB స్కీమ్ కోసం సబ్‌స్క్రిప్షన్ ఈ రోజు (సోమవారం, 12 ఫిబ్రవరి 2024) ప్రారంభమైంది, 16న ముగుస్తుంది. అంటే, కేవలం 5 రోజులే ఈ అవకాశం ఉంది.
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌పై డిస్కౌంట్ (Rs. 50 discount per gram on SGB)
ఒక సావరిన్ గోల్డ్ బాండ్ ఒక గ్రాము బంగారానికి సమానం. 2023-24 సిరీస్ నాలుగో విడతలో, గ్రాము బంగారం (ఒక బాండ్) ధరను రూ. 6,263 గా ఆర్‌బీఐ నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి లేదా డిజిటల్ మోడ్‌లో డబ్బు చెల్లించే వాళ్లకు ఒక్కో గ్రాముకు 50 రూపాయల తగ్గింపు లభిస్తుంది. అప్పుడు, ఒక్కో గోల్డ్ బాండ్‌ను రూ. 6,213 కే కొనొచ్చు.
2023-24 సిరీస్‌లో... 2023 డిసెంబర్ 18-22 తేదీల్లో మూడో విడత సబ్‌స్క్రిప్షన్ ముగిసింది. అప్పుడు, బంగారం ధరను గ్రాముకు (SGB per gram price) రూ. 6,199 గా కేంద్ర బ్యాంక్ నిర్ణయించింది. అదే సిరీస్‌లో మొదటి విడత జూన్ 19-23 తేదీల్లో; రెండో విడత సెప్టెంబర్ 11-15 తేదీల్లో జరిగాయి. మొదటి విడతలో ఒక్కో గ్రాము బంగారాన్ని రూ. 5,926 చొప్పున అమ్మిన కేంద్ర బ్యాంక్, రెండో విడతలో గ్రాముకు ఇష్యూ ప్రైస్‌ను రూ. 5,923 గా నిర్ణయించింది.
బంగారం రేటు ఎప్పటికప్పుడు పెరుగుతోంది కాబట్టి, పసిడిలో పెట్టుబడిని తెలివైన నిర్ణయంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
సావరిన్ గోల్డ్ బాండ్లు ఎందుకు కొనాలి, వడ్డీ వస్తుందా? (Interest rate on Sovereign Gold Bond)
SGBలపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి 2.50% ఫిక్స్‌డ్ రేటుతో (Coupon rate) వడ్డీ చెల్లిస్తారు. బాండ్ ఇష్యూ తేదీ నుంచి వడ్డీని లెక్కించడం ప్రారంభిస్తారు. ఈ వడ్డీని 6 నెలలకు ఒకసారి యాడ్ చేస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్లను ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. కాల పరిమితి ముగిసిన తర్వాత, పసిడికి అప్పటికి ఉన్న మార్కెట్ రేటు + 2.50% వడ్డీ ఆదాయం మొత్తాన్ని కలిపి చెల్లిస్తారు. ఈ మొత్తం డబ్బుపై ఒక్క రూపాయి కూడా ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు.
సావరిన్ గోల్డ్ బాండ్‌ను ఎంత కాలం దాచుకోవాలి? (Tenure of a Sovereign Gold Bond)
సావరిన్ గోల్డ్ బాండ్ కాల పరిమితి 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు ముగియగానే డబ్బు మీ అకౌంట్‌లో జమ అవుతుంది. మీ దగ్గరున్న బాండ్స్ ల్యాప్స్ అవుతాియ. ఒకవేళ ఇంకా ముందుగానే డబ్బు అవసరమైతే, ఈ బాండ్లను 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా రిడీమ్ చేసుకోవచ్చు. బాండ్లను సరెండర్ చేస్తే, ఆ రోజున ఉన్న బంగారం మార్కెట్ రేటు + వడ్డీ ఆదాయాన్ని కలిపి చెల్లిస్తారు. అయితే, 8 సంవత్సరాలకు ముందే రిడీమ్ చేసుకుంటే, ఆ డబ్బుపై ఆదాయ పన్ను చెల్లించాల్సి వస్తుంది. పూర్తిగా 8 సంవత్సరాలు హోల్డ్ చేస్తేనే టాక్స్-ఫ్రీ ఆప్షన్ లభిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: చల్లబడ్డ పసిడి, మండుతున్న వెండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే