Small Savings Schemes Death Claim: దేశంలోని సామాన్య ప్రజల కోసం ప్రభుత్వం చాలా రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలను అమలు చేస్తోంది. మీరు కూడా ఇలాంటి పథకాల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, ముందుగా వాటికి సంబంధించిన క్లెయిమ్ రూల్స్ గురించి తెలుసుకోండి. లేదంటే, తర్వాత ఖాతాలో జమ చేసిన డబ్బును తిరిగి విత్‌డ్రా చేసుకునే సమయంలో చాలా ఇబ్బంది పడాల్సి రావచ్చు.
మన దేశంలో కోట్లాది మందికి చిన్న పొదుపు పథకం ఖాతాలు ఉన్నాయి. అయితే, ఆ ఖాతాలు తెరిచేటప్పుడు లేదా ఆ తర్వాత నామినీ పేరును చేర్చడం చాలా మంది మర్చిపోతారు. ఇలాంటి సందర్భంలో, ఒకవేళ ఆ ఖాతాదారు మరణిస్తే, నామినీ పేరు లేని ఖాతా కాబట్టి డెత్ క్లెయిమ్ చేసుకునే ప్రక్రియ క్లిష్టంగా మారుతుంది. అప్పుడు ఆ ఖాతాలోని డబ్బు ఎవరికి చెందుతుంది, అటువంటి ఖాతా నుంచి డెత్ క్లెయిమ్ చేసే విధానం ఏంటి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డెత్ క్లెయిమ్ రూల్ ఏంటి?
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ Senior Citizens Savings Scheme), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (National Savings Certificate) మొదలైన పథకాల కోసం డెత్ క్లెయిమ్‌లను ప్రభుత్వం సులభతరం చేసింది. చిన్న మొత్తాల పొదుపు ఖాతాలో రూ. 5 లక్షల లోపు ఉంటే, నామినీ పేరు ఆ ఖాతాకు జోడించి ఉంటే, నామినీ ID రుజువు మాత్రం ఇస్తే చాలు, ఆ మొత్తం డబ్బు నామినీకి ఇస్తారు. ఒకవేళ ఆ ఖాతాలో రూ. 5 లక్షల కంటే మొత్తం ఉంటే, డెత్ క్లెయిమ్ చేసే సమయంలో ఖాతాదారు మరణ ధృవీకరణ పత్రం, ఖాతా పాస్‌బుక్, రసీదు, అఫిడవిట్ వంటి అన్ని చట్టపరమైన పత్రాలనూ నామినీ సమర్పించాలి.
నామినేషన్ లేకపోతే డెత్ క్లెయిమ్ ఎలా చేయాలి?
స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాదారుడు ఖాతాలో ఏ వ్యక్తిని నామినేట్ చేయకపోతే మరియు మరణించినట్లయితే, డెత్ క్లెయిమ్ ప్రక్రియ కొంచెం కష్టంగా ఉంటుంది. గవర్నమెంట్ సేవింగ్స్ ప్రమోషన్ యాక్ట్ 1873 (Government Savings Promotion Act 1873) ప్రకారం, ఒక ఖాతాలో నామినీ పేరు లేకుండా ఆ ఖాతాదారు మరణించినట్లయితే, ఆ డబ్బును క్లెయిమ్ చేసే హక్కు చట్టబద్ధమైన వారసుడికి ఉంటుంది.
ఖాతాదారుడు మరణించిన 6 నెలల లోపు ఆ డబ్బును క్లెయిమ్ చేయవచ్చు. సమర్పించాలని పత్రాల్లో మొదటిది చట్టబద్ధమైన వారసుడి వారసత్వ ధృవీకరణ పత్రం. దీంతో పాటు ఖాతాదారు మరణ ధృవీకరణ పత్రం, ఖాతా పాస్‌బుక్, రసీదు, అఫిడవిట్ వంటి పత్రాలు అవసరం. ఈ పత్రాలన్నింటినీ అధీకృత అధికారి తనిఖీ చేసి నిర్ధరించుకున్న తర్వాత ఖాతాలోని డబ్బును చట్టబద్ధమైన వారసుడికి ఇస్తారు.
ఏయే పథకాలకు ఈ నిబంధన వర్తిస్తుంది?
పోస్టాఫీసు పొదుపు ఖాతా
జాతీయ పొదుపు నెలవారీ ఆదాయ ఖాతా
నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్
సుకన్య సమృద్ధి యోజన
కిసాన్ వికాస్ పత్ర
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్