SIP Return: స్టాక్ మార్కెట్ పెట్టుబడి మార్గంలో అడుగు పెట్టే వారి మొదటి అడుగుగా SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్)ను పరిగణిస్తారు. SIP ద్వారా, విడతలవారీగా కొద్ది మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టొచ్చు. షేర్లలో పెట్టుబడితో పోలిస్తే SIPలో పెట్టుబడికి రిస్క్ తక్కువ. దీర్ఘకాలంలో ఇది మంచి రాబడిని ఇస్తుందని రుజువైంది, డబ్బు నష్టపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
అయితే, రిస్క్ తక్కువ ఉన్నంత మాత్రాన మార్కెట్ నిపుణులు SIPని పూర్తిగా నమ్మరు. చాలా సార్లు, ఫండ్ మేనేజర్ల నిర్ణయాలకు ఎదురుదెబ్బ తగలవచ్చు & డబ్బు నష్టపోవచ్చు. సమయం కాని సమయంలో తప్పుడు మార్గంలో చేసిన పెట్టుబడి లాభాలకు బదులుగా భారీ నష్టాలకు దారి తీయవచ్చు. కాబట్టి, ఈక్విటీలో నేరుగా పెట్టుబడి పెట్టడానికి బదులుగా SIP ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం పూర్తిగా సురక్షితమని భావించడం తెలివైన పని కాదు. చరిత్రను తిరగేస్తే, SIP రాబడులు ప్రజల అంచనాలను అందుకోలేని సందర్భాలు కూడా చాలా కనిపిస్తాయి. అందువల్ల, SIP పెట్టుబడి పెడుతున్న కంపెనీల ఫండమెంటల్స్ మీద (వ్యాపారం, లాభనష్టాలు, భవిష్యత్ ప్రణాళికలు వంటివి) నిఘా ఉంచడం ముఖ్యం.
సంచలనం సృష్టించిన ఎస్ నరేన్ ప్రకటనలు
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ ఎస్ నరేన్, SIP రాబడులపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు స్టాక్ మార్కెట్‌లో పెద్ద గందరగోళానికి దారి తీశాయి. సోమవారం (10 ఫిబ్రవరి 2025) స్టాక్ మార్కెట్ నష్టాలకు ఎస్ నరేన్ అభిప్రాయాలే ప్రధాన కారణంగా మారాయి. చెన్నైలో జరిగిన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు & పెట్టుబడిదార్ల సమావేశంలో, ఎస్ నరేన్, SIP రిస్క్‌ల గురించి హెచ్చరించారు. పదేళ్ల SIP వల్ల ఒరిగేది ఏమీ ఉండదని చెప్పారు. SIP ఒక ప్రజాదరణ పొందిన పెట్టుబడి మార్గం అయినప్పటికీ, పెట్టుబడిదార్లు దీని ద్వారా కూడా ఇబ్బందుల్లో పడవచ్చని స్పష్టం చేశారు.
ఈ అమ్మకాల కాలంలో, స్టాక్ మార్కెట్‌లో చవకగా లభించే స్మాల్ క్యాప్ & మిడ్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడుల వల్ల భవిష్యత్తులో ఖరీదైన మూల్యం చెల్లించుకోవలసి రావచ్చని (ఎక్కువ రిస్క్ కావచ్చని) ఎస్ నరేన్ అన్నారు. గతంలో, SIP పెట్టుబడిదారుల డబ్బును హరించిన అనేక ఉదాహరణలను నరేన్ ఉదహరించారు. 1994-2002 & 2006 నుంచి 2013 మధ్య కాలం ఇదే విధంగా గడిచిందని చెప్పారు. మిడ్ క్యాప్‌లో SIP ఎటువంటి రాబడిని ఇవ్వకపోగా, పెట్టుబడిదార్లు డబ్బులు కోల్పోయారని నరేన్ తెలిపారు.
లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడితో తక్కువ రిస్క్
లార్జ్ క్యాప్ స్టాక్స్ ఖరీదైనవిగా కనిపించినప్పటికీ, వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల పెట్టుబడి ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని నరేన్ చెప్పారు. దీర్ఘకాలంలో, వీటిలో డబ్బులు కోల్పోయిన సంఘటనలు చాలా అరుదుగా కనిపిస్తాయని వివరించారు.
ఎస్ నరేన్ వ్యాఖ్యల తర్వాత, సోమవారం, స్టాక్ మార్కెట్‌లో స్మాల్ క్యాప్ & మిడ్ క్యాప్ స్టాక్స్ దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ రెండు సూచీలు దాదాపు 2% పతనమయ్యాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఎల్‌ఐసీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న షేర్లు ఇవీ - మీ దగ్గర కూడా ఇవి ఉన్నాయా?