Shilchar Technologies May Annouce Dividend And Bonus Shares: షిల్చార్ టెక్నాలజీస్ లిమిటెడ్ తన షేర్‌హోల్డర్ల కోసం చాలా లాభాలు తెచ్చి పెట్టింది. గత ఐదేళ్లుగా, మార్కెట్‌ పరిస్థితులకు పెద్దగా ప్రభావితం కాకుండా ఈ స్టాక్‌ సూపర్‌ ర్యాలీ చేస్తూనే ఉంది. ఇప్పుడు, డివిడెండ్ & బోనస్ రెండింటినీ బహుమతిగా ఇవ్వబోతోంది. ట్రాన్స్‌ఫార్మర్ తయారీ కంపెనీ, వచ్చే వారం జరగనున్న సమావేశంలో బోనస్ & డివిడెండ్‌ను ప్రకటించవచ్చు. షిల్చార్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏప్రిల్ 21, 2025న (సోమవారం) సమావేశం అవుతుందని గత బుధవారం (ఏప్రిల్ 16, 2025) నాడు మార్కెట్ ముగిసిన తర్వాత ఈ కంపెనీ వెల్లడించింది. 

సోమవారం నాడు జరిగే బోర్డ్‌ డైరెక్టర్ల సమావేశంలో, మార్చి 31, 2025తో ముగిసిన త్రైమాసికం (Q4 FY25)తో పాటు 2024-25 ఆర్థిక సంవత్సరం (FY25) ఆర్థిక ఫలితాలను చర్చించి ఆమోదించనున్నారు. అదే సమావేశంలో బోనస్ & డివిడెండ్‌ అంశాలు కూడా ముఖ్యమైన ఎజెండాగా ఉంటుందని, ఈక్విటీ వాటాదారులకు బోనస్ షేర్లను జారీ చేసే ప్రతిపాదన ఉందని కంపెనీ తెలిపింది. 2024-45 ఆర్థిక సంవత్సరానికి ఈక్విటీ షేర్లపై మధ్యంతర డివిడెండ్ చెల్లించడానికి సంబంధించిన సిఫార్సులను కూడా ఈ సమావేశంలో పరిగణించవచ్చని ఫైలింగ్ పేర్కొంది. అలాగే, కంపెనీ 39వ వార్షిక సర్వసభ్య సమావేశం సమయం, తేదీ & అజెండాను నిర్ణయించి, సమావేశం ముసాయిదా నోటీసును కూడా ఆమోదిస్తారు.

ఉచిత షేర్లు, ఉచితంగా డబ్బు!బోనస్‌ షేర్లను డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదిస్తే, నిర్ణయించిన నిష్పత్తి ప్రకారం, అర్హతగల ప్రతి ఒక్క షేర్‌హోల్డర్‌కు ఉచితంగా అదనపు షేర్లు (బోనస్‌ షేర్లు) వస్తాయి. డివిడెండ్‌ను కూడా ఆమోదిస్తే, ఆ డబ్బు షేర్‌హోల్డర్ల ఖాతాల్లో క్రెడిట్‌ అవుతుంది. అయితే, బోనస్‌ & డివిడెండ్‌ ప్రకారం షేర్‌ ధర సర్దుబాటు అవుతుంది. గురువారం (ఏప్రిల్ 17, 2025) నాడు షిల్చార్ టెక్నాలజీస్ లిమిటెడ్ షేర్‌ ధర 3.53% లేదా రూ. 207 పెరిగి రూ. 6,084.45 దగ్గర ముగిసింది.

రూ.లక్ష పెట్టుబడి రూ.ఒకటిన్నర కోట్లుగా మారిందిగత నెల రోజుల్లో, షిల్చార్ టెక్నాలజీస్ షేర్లు 18 శాతానికి పైగా పరుగులు తీశాయి. ఈ స్టాక్ గత మూడు నెలల్లో 26.77 శాతం పెరిగింది. అయితే, గత ఆరు నెలల్లో ప్రాతిపదికన 15 శాతం క్షీణించింది. గత ఏడాది కాలంలో 9 శాతం, రెండేళ్లలో 653 శాతం శాతం, గత ఐదేళ్లలో ఏకంగా 15,100 శాతం అద్భుతమైన రాబడిని ఇచ్చింది. అంటే, ఐదు సంవత్సరాల క్రితం ఈ స్టాక్‌లో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే, ఇప్పటి ధరల ప్రకారం, ఆ పెట్టుబడి రూ. 1.51 కోట్లుగా మారింది, ఇది 15,100 శాతం పెరుగుదలకు సమానం.

షిల్చార్ టెక్నాలజీస్ లిమిటెడ్‌ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ రంగంలో పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్స్, టెలికాం, విద్యుత్ & పంపిణీ రంగాలలో సేవలు అందిస్తుంది. షిల్చార్ టెక్నాలజీస్, ఇటీవల ఫెర్రైట్ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టడం ద్వారా తన వ్యాపారంలో వైవిధ్యం తీసుకువచ్చింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.