Senior Citizen Savings Scheme: చిన్న మొత్తాల పొదుపు పథకాల (Small Saving Schemes) రూపంలో కేంద్ర ప్రభుత్వం చాలా రకాల స్కీమ్‌లను అమలు చేస్తోంది. ప్రభుత్వ పథకాలు కాబట్టి వీటిలో పెట్టుబడి పెట్టే డబ్బుకు నష్ట భయం ఉండదు, ఇవి సురక్షితమైన పెట్టుబడి మార్గాలు. దీంతో పాటు, చిన్న మొత్తాల పొదుపు పథకాలపై చెల్లించే వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మారుస్తుంటుంది. ఇటీవలే, చాలా పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది.
SCSS డిపాజిట్లపై వడ్డీ పెంపు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెట్టుబడి పథకాల్లో 'సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్' (Senior Citizen Savings Scheme లేదా SCSS) ఒకటి. ఒక ఉద్యోగి లేదా వృత్తి నిపుణుడు రిటైర్ అయిన తర్వాత కూడా, ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా ఆదాయం సంపాదించుకునేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఇది. పొదుపు పథకాలపై వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు సవరిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై చెల్లించే వడ్డీ రేటును కూడా ఇటీవలే పెంచింది. 2023 ఏప్రిల్ నుంచి జూన్ కాలానికి (జూన్ త్రైమాసికం), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటును 8 శాతం నుంచి 8.2 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచింది. అన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాల కంటే ఈ స్కీమ్‌లోనే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. పెంచిన వడ్డీ రేటు, 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
SCSS డిపాజిట్ పరిమితి కూడా పెంపు
2023-24 బడ్జెట్‌లో, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పెట్టుబడి పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంచింది. అంటే, గతంలో కంటే రెట్టింపు మొత్తాన్ని ఇప్పుడు ఈ పథకంలో పెట్టుబడిగా పెట్టువచ్చు. ఇది మరొక చక్కటి అవకాశం.
'సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్' కింద, దేశంలోని ఏ అధీకృత బ్యాంక్‌లోనైనా, పోస్టాఫీసులోనైనా ఖాతా ప్రారంభించవచ్చు. 60 సంవత్సరాలు లేదా ఆపై వయస్సు ఉన్న వారికి మాత్రమే ఇందులో పెట్టుబడికి అవకాశం ఉంటుంది. ఈ పథకం కాల పరిమితి (మెచ్యూరిటీ) ఐదేళ్లు. 8.2 శాతం వార్షిక వడ్డీని ప్రతి 3 నెలలకు (త్రైమాసిక ప్రాతిపదికన) మీ ఖాతాలో జమ చేస్తారు. కాల గడువు పూర్తయ్యాక, వడ్డీతో కలిసి అసలు మొత్తాన్ని మీరు తిరిగి పొందవచ్చు.
5 సంవత్సరాల్లో 25 లక్షలు ఎలా సంపాదించవచ్చు?
'సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్'లో గరిష్ట పెట్టుబడి పరిమితిని రూ. 30 లక్షలకు పెంచారు కాబట్టి, మీరు ఈ పథకంలో రూ. 30 లక్షలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం. పెంచిన వడ్డీ రేటు 8.2 శాతం ప్రకారం... 5 సంవత్సరాల కాల పరిమితి తర్వాత మీ ఖాతాలో మొత్తం రూ. 42 లక్షల 30 వేలు కనిపిస్తాయి. ఇందులో, మీ పెట్టుబడి మొత్తం రూ. 30 లక్షలు పోను, మిగిలిన రూ. 12.30 లక్షలు వడ్డీ రూపంలో వచ్చిన ఆదాయం. అంటే.. ప్రతి 3 నెలలకు 61,500 చొప్పున ఏడాదికి 2 లక్షల 46 వేల రూపాయలు, ఐదేళ్లలో మొత్తం 12 లక్షల 30 వేల రూపాయలు వడ్డీ రూపంలో జమ అయింది.
ఒకవేళ మీరు, మీ జీవిత భాగస్వామి ఇద్దరూ సీనియర్ సిటిజన్స్ అయి ఉండి, ఇద్దరూ ఈ స్కీమ్‌లో చేరారని భావిస్తే... ఐదేళ్లలో ఒక్కొక్కరికి 12 లక్షల 30 వేల రూపాయలు చొప్పున, ఇద్దరికి కలిపి 24 లక్షల 60 వేల రూపాయలు (దాదాపు పాతిక లక్షలు) కేవలం వడ్డీల రూపంలోనే వస్తాయి.