SBI Asmita Loan And Nari Shakti Debit Card Details: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), మహిళల కోసం ప్రత్యేక లోన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ రుణ పథకం పేరు 'అస్మిత'. నారీమణులు నడిపించే 'సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల' (MSME)కు 'అస్మిత' పథకం కింద రుణాలు మంజూరు చేస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, స్టేట్ బ్యాంక్ ఈ లోన్ స్కీమ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా, మహిళా వ్యాపారులు, చిన్న పారిశ్రామికవేత్తలు తక్కువ వడ్డీ రేట్లకు సులభంగా ఆర్థిక సాయం పొందవచ్చు, వ్యాపారం/పరిశ్రమను విస్తరించుకోవచ్చు.
వాస్తవానికి, బ్యాంక్‌లు ఇచ్చే వ్యాపార రుణాలలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంటున్నాయని ట్రాన్స్‌యూనియన్ CIBIL ఇటీవలే ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. మహిళా రుణాలలో కేవలం 3 శాతం మాత్రమే వ్యాపార ప్రయోజనాల కోసం తీసుకున్నారని, 42 శాతం వ్యక్తిగత రుణాలు & గృహ రుణాలు వంటి వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్నారని ఆ డేటా తేటతెల్లం చేసింది. అదే సమయంలో, 38 శాతం రుణాలను బంగారం కుదువబెట్టి తీసుకున్నారు. కొందరు మహిళలు బంగారం తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో, స్టేట్ బ్యాంక్ 'అస్మిత' పథకాన్ని తీసుకొచ్చింది.
SBI అస్మిత పథకం వివరాలు, ప్రయోజనాలు
తాకట్టు లేని రుణం - అస్మిత స్కీమ్ కింద లోన్ పొందడానికి ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు.
అవసరానికి తగ్గ రుణాలు - వివిధ వ్యాపార అవసరాలకు అనుగుణంగా రుణ మొత్తాలు జారీ.
తక్కువ వడ్డీ రేట్లు - ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, రీపేమెంట్ ఆప్షన్లు.
పేపర్‌లెస్ ప్రక్రియ - పూర్తిగా డిజిటల్ & ఇబ్బంది లేని దరఖాస్తు ప్రక్రియ.
బ్యాంక్ నుంచి మద్దతు - వ్యాపార వృద్ధి & ఆర్థిక నిర్వహణపై బ్యాంక్ నుంచి మార్గదర్శకత్వం.
వ్యవస్థాపక శిక్షణ - వ్యాపార నైపుణ్యాన్ని పెంచుకోవడానికి రుణగ్రహీతలకు అవకాశం.
'నారి శక్తి' ప్లాటినం డెబిట్ కార్డ్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, అస్మిత పథకంతో పాటు, 'నారి శక్తి' రూపే డెబిట్ కార్డ్‌ను కూడా స్టేట్ బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేస్తూ, పూర్తిగా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌తో ఈ డెబిట్ కార్డ్‌లను తయారు చేయడం విశేషం. 'నారి శక్తి' రూపే డెబిట్ కార్డ్‌తో కార్డ్ షాపింగ్, ప్రయాణం, వినోదం, బీమా సహా ప్రత్యేక ప్రయోజనాలు అందుతాయి. ముఖ్యంగా, మహిళల విషయంలో మారుతున్న ఆర్థిక & జీవనశైలి అవసరాలను ఈ కార్డ్ తీరుస్తుంది.
స్టాండ్-అప్ ఇండియా లోన్ స్కీమ్
మహిళలు నిర్వహించే వ్యాపారాలకు మద్దతుగా, స్టేట్ బ్యాంక్ గతంలోనూ చాలా ఆర్థిక పథకాలు లాంచ్ చేసింది. వాటిలో ఒకటి 'స్టాండ్-అప్ ఇండియా పథకం'. ఇది మహిళా వ్యవస్థాపకులకు, ముఖ్యంగా SC, ST, OBC నేపథ్యాల నుంచి వచ్చిన వారికి రుణం అందించే ప్రత్యేక కార్యక్రమం. ఈ పథకం కింద, అర్హత కలిగిన దరఖాస్తుదారులు రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రుణాలు పొందవచ్చు. రుణ కాలపరిమితి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది, గరిష్టంగా 18 నెలల మారటోరియం వ్యవధి ఉంటుంది. GSTతో పాటు రుణ మొత్తంలో 0.20 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.