SBI Loan interest rates: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India), తన కోట్లాది మంది కస్టమర్లకు షాక్ ఇస్తూ మరోసారి రుణ రేట్లను (SBI Loan Costly) పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను (MCLR) పెంచడం ద్వారా వడ్డీ రేట్లను పైకి సవరించింది. ఇవాళ్టి నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది.


ఎస్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు తర్వాత.. ఇప్పటికే తీసుకున్న గృహ రుణం, వాహన రుణం, విద్యా రుణం, వ్యక్తిగత రుణం వంటి అన్ని రకాల అప్పుల మీద అధిక వడ్డీ రేటును రుణగ్రహీతలు చెల్లించాల్సి ఉంటుంది. ఇవాళ్టి నుంచి తీసుకునే అప్పులకు కూడా కొత్త వడ్డీ రేట్లు అమలవుతాయి. సాధారణంగా, రుణాలు తీసుకునే అందరూ ఒక సంవత్సర కాల MCLR ఆధారంగా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో, ఎస్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం కోట్లాది వినియోగదారుల జేబుల మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.


10 బేసిస్ పాయింట్లు పెంపు


స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం... బ్యాంక్ ఒక సంవత్సరం కాలానికి MCLRని 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10 శాతం పెంచింది. గతంలో బ్యాంకు 1 సంవత్సరం రుణం మీద 8.30 శాతం వడ్డీ రేటును నిర్ణయించగా, ఇప్పుడు అది 8.40 శాతానికి పెరిగింది. ఈ పెరుగుదల కారణంగా హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ మొదలైన అన్ని రకాల లోన్‌ల మీద మరింత ఎక్కువ EMI చెల్లించాల్సి ఉంటుంది. 


వివిధ కాలావధి ఎస్‌బీఐ రుణాల మీద కొత్త వడ్డీ రేట్లు ఇవి:


ఓవర్ నైట్ (ఒక రోజు రుణాలు) MCLR - 7.85 శాతం
1 నెల కాలావధి MCLR - 8.00 శాతం
3 నెలలకు MCLR - 8.00 శాతం
6 నెలల MCLR - 8.30 శాతం
1 సంవత్సరం MCLR - 8.40 శాతం
2 సంవత్సరాలకు MCLR - 8.50 శాతం
3 సంవత్సరాల MCLR - 8.60 శాతం


MCLR పెరుగుదలతో EMI ఎంత పెరుగుతుంది?


2016 సంవత్సరంలో, రిజర్వ్ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ (MCLR) వ్యవస్థను ప్రారంభించింది. బ్యాంకులు తమ కస్టమర్లకు రుణ వడ్డీ రేటును అందించే కనీస వడ్డీ రేటు ఇది. ఇది వివిధ బ్యాంకులకు, వివిధ రకాలుగా ఉంటుంది. బ్యాంకులు తమ అవసరాలకు అనుగుణంగా MCLR పెంచుతూ, తగ్గిస్తూ ఉంటాయి. దీని ఆధారంగా, వివిధ రుణాల మీద EMI నిర్ణయిస్తారు.


ఈ బ్యాంకులు కూడా ఎంసీఎల్‌ఆర్‌ పెంచాయి


స్టేట్ బ్యాంక్‌తో పాటు, ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank), బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) కూడా తమ కస్టమర్‌లకు షాక్‌ ఇచ్చాయి, తమ MCLR పెంచాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India) కూడా తన MCLRని 35 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త రేట్లు జనవరి 12, 2023 నుంచి అమలులోకి వచ్చాయి.