దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ రంగ సంస్థ అయిన ఎస్బీఐ ఖాతాదారులకు మరో షాక్ ఇచ్చింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఖాతాదారులు అదిరి పడే నిర్ణయం తీసుకుంది. బ్యాంకు లోన్లపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు-ఎంసీఎల్ఆర్ పెంచుతున్నట్లు ప్రకటించింది ఎస్బీఐ యాజమాన్యం. నేటి నుంచే పెంచిన లెండింగ్ రేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది. దీంతో ఎంసీఎల్ఆర్‌పై రుణాలు పొందిన వారు ఇక నుంచి ప్రతి నెలా ఈఎంఐలను అత్యధికంగా చెల్లించాల్సి ఉంటుంది. రిటైల్ లోన్లకు ఏడాది కాల వ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్‌ను అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. హోమ్ లోన్లు వంటి బ్యాంకు లాంగ్ టర్మ్ లోన్లను బ్యాంకు ఈ రేటుకే అనుసంధానిస్తుంది.
లెండింగ్ రేటు 0.20 శాతం పెంపు
లెండింగ్ రేటును ఆర్టీఐ 0.20 శాతం పెంచింది. పెంపు తర్వాత ఎంసీఎల్ఆర్ 7.15 శాతం నుంచి 7.35 శాతానికి పెరిగింది. ఎస్బీఐ ఓవర్ నైట్ నుంచి మూడు నెలల కాల వ్యవధి కల్గిన ఎంసీఎల్ఆర్ 0.20 శాతం పెంచింది. ఎస్బీఐ ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.45 శాతం నుంచి 7.65 శాతానికి పెరిగింది.గత ఏడాది ఎంసీఎల్ఆర్ 7.7 శాతానికి, రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 7.7 శాతం నుంచి 7.9 శాతానికి, మూడేళ్ల కాల వ్యవధి కల్గిన ఎంసీఎల్ఆర్ 7.8 శాతం నుంచి 8 శాతానికి పెరిగినట్లు బ్యాంకు తెలిపింది.
ఆర్బీఐ రెపో రేటుతో పాటు పెంపు
గత నెలలోనే ఎస్బీఐ పలు టెన్యూర్లపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు సాధారణంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేట్లు- ఎంసీఎల్ఆర్ రేట్లను పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తాయి. ఇందులో నిధుల సమీకరణ కోసం పెరుగుతున్న ఖర్చులు, నిర్వహణ ఖర్చులు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటాయి. 2016 నుంచి ఎంసీఎల్ఆర్‌ను అన్ని ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు అనుసరిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేట్లను ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ అనుసంధాన రేటును పునరుద్ధరించింది. అయినా.. ప్రస్తుతం బ్యాంకులు అందిస్తున్న ఇంటి రుణాలు ఫ్లోటింగ్ రేటు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేట్- ఎంసీఎల్ఆర్ కి లేదా ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటుకి లేదా బేస్ రేటుకి లింకై ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆర్బీఐ రెపో రేటు పెంచిన ప్రతి సందర్భంలోనూ ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు పెరుగుతుంది.
ఎస్బీఐలో ఎంసీఎల్ఆర్ రేట్లు ఎలా ఉన్నాయి
ఎస్బీఐ బ్యాంకులో ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 7.35 శాతంగా ఉంది. ఇది ఒకటి, మూడు నెలల వరకు కూడా 7.35 శాతంగానే ఉంది. ఆరు నెలల వరకు అయితే 7.65 శాతంగా వసూలు చేస్తోంది. ఏడాదికి 7.7 శాతం, రెండేళ్లకు 7.9 శాతం, మూడేళ్లకు 8 శాతం ఎంసీఎల్ఆర్ రేటును ఎస్బీఐ వసూలు చేస్తోంది.