SBI hikes home loan interest rates: భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ఈ మధ్యే వడ్డీరేట్లను సవరించింది. రెపోరేటును 50 బేసిస్ పాయింట్ల మేర పెంచడంతో వడ్డీరేటు 4.90 శాతానికి చేరుకుంది. చాలా బ్యాంకులు ఇప్పటికే వడ్డీరేట్లను పెంచగా తాజాగా ఎస్‌బీఐ (SBI) వీరికి జత కలిసింది. ఇంటి రుణాల కనీస వడ్డీరేటును 7.55 శాతానికి పెంచింది. సిబిల్ స్కోరు తక్కువుంటే వడ్డీరేటు ఇంకా పెరుగుతుంది.
వీరికి వడ్డింపు
తాజా పెంపు వల్ల 800 కన్నా ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న రుణ గ్రహీతలకు ఇంటి రుణాలపై కనీస వడ్డీరేటు 7.55 శాతంగా ఉండనుంది. అంతకన్నా తక్కువ క్రెడిట్ స్కోరుంటే మరో 0.10 శాతం వడ్డీ పెరుగుతుంది. అలాగే ఎక్స్‌టర్నల్ బేసుడ్ లెండింగ్ రేట్ (EBLR)ను 7.55 శాతానికి సవరించింది. అంతకు ముందు ఇది 7.05 శాతమే ఉండేది. అయితే క్రెడిట్ స్కోరును బట్టి రిస్క్ ప్రీమియంను జత చేస్తోంది. 2022, జూన్ 15 నుంచి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ ఆధారిత వడ్దీరేట్ల (MCLR)ను 0.20 శాతం పెంచింది. వార్షిక ఎంసీఎల్‌ఆర్‌ను 7.20 నుంచి 7.40 శాతానికి సవరించింది. దాదాపుగా ఆటో, హోమ్, పర్సనల్ లోన్లన్నీ దీనికే అనుసంధానమై ఉంటాయి.
Also Read: ఎన్‌పీఎస్ కడుతున్నారా! బెనిఫిట్స్‌పై కీలక మార్పులు చేసిన పీఎఫ్ఆర్‌డీఏ!
క్రెడిట్ స్కోరు బాగుందా?
ఒకవేళ కస్టమర్ క్రెడిట్ స్కోరు 800 కన్నా ఎక్కువుంటే సాధారణ ఇంటి రుణాలపై కనీస వడ్డీ 7.55 శాతమే చెల్లించాల్సి ఉంటుంది. వీరికి రిస్క్ ప్రీమియం ఏమీ ఉండదు. సిబిల్ ప్రకారం తక్కువ స్కోరుంటే ఎక్కువ రిస్క్ ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. 750-799 ఉంటే వడ్డీరేటు 7.65 శాతం ఉంటుంది. 10 బేసిస్ పాయింట్ల వరకు రిస్క్ ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. ఇవే రుణాలపై మహిళా రుణ గ్రహీతలకు 0.05 శాతం రాయితీ లభిస్తోంది.
ఎంత రుణంపై ఎంత ఈఎంఐ!
హోమ్ లోన్ రూ.35 లక్షల లోన్‌పై 7.05 వడ్డీ అమలు చేసేటప్పుడు ఈఎంఐ (Home Loan EMI) రూ.27,241గా ఉండేది. ఇప్పుడు 7.55 శాతానికి పెరగడంతో రూ.28,303 కట్టాల్సి ఉంటుంది. అంటే రూ.1062 పెరిగిందన్నమాట. ఒకవేళ మీ క్రెడిట్ స్కోరు 750-799 మధ్య ఉంటే ఈఎంఐ రూ.28518కు పెరుగుతుంది. రూ.70 లక్షల లోన్‌పై పాత ఈఎంఐ రూ.54,481 కాగా కొత్త ఈఎంఐ రూ.56,606 అవుతుంది. రూ.2125 ఎక్కువ కట్టాలి. క్రెడిట్ స్కోరు తక్కువుంటే ఈఎంఐ రూ.57,035 అవుతుంది. వీటన్నిటికీ రుణ వ్యవధి 20 సంవత్సరాలుగా తీసుకున్నారు.
Also Read: సౌందర్యం కోల్పోయిన రెవ్లాన్! దివాలా అంచున అతిపెద్ద కాస్మొటిక్ కంపెనీ!