Financial Management: పెద్ద మొత్తంలో ఆదాయం లేదా మంచి జీతం సంపాదిస్తున్న చాలా మంది వ్యక్తులను మనం రోజూ చూస్తుంటాం. అయితే, అలాంటి వాళ్లు కూడా ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతుండడం, అప్పులు చేయడం కూడా మనం గమనిస్తాం. అర్థాన్ని అర్ధం చేసుకోలేకపోవడమే వారి అసలైన సమస్య. జీవితంలో విజయం సాధించాలంటే సరైన ఆర్థిక నిర్వహణ చాలా ముఖ్యం. ఇది తెలిసి కూడా, చాలా మంది ప్రజలు తమ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను విస్మరిస్తారు. అలాంటి వాళ్లు ఎంత సంపాదించినప్పటికీ, తరచూ ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతుంటారు.
డబ్బు విషయంలో ఎక్కువ మంది ప్రజలు తరచుగా చేస్తున్న ఐదు తప్పుల గురించి తెలుసుకుంటే, ఆర్థిక సమస్యల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనకు తెలుస్తాయి.
1. బడ్జెట్ తయారు చేయడం లేదు
ఆదాయం ఎక్కువ ఉన్నా లేదా తక్కువ ఉన్నా, చాలా మంది వ్యక్తులు తమ ఆదాయం & ఖర్చులను ట్రాక్ చేయరు లేదా మంత్లీ బడ్జెట్‌ను రూపొందించరు. దీనివల్ల, ఆదాయాన్ని మించి ఖర్చు అవుతున్నా గమనించలేకపోతున్నారు. ఇలాంటి వ్యక్తుల పొదుపు సున్నా నుంచి మైనస్‌లోకి వెళుతుంది. అందుకే బడ్జెట్ వేయడం, దానిని సమీక్షించడం అవసరం. తద్వారా, ఏ ఖర్చులను పూర్తిగా తగ్గించవచ్చు, ఏ ఖర్చుల్లో కోత పెట్టవచ్చన్న విషయం మీకు తెలుస్తుంది.
2. అనవసర రుణాలు తీసుకుంటున్నారు
నేటి కాలంలో క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, ఇతర రుణాలు తీసుకోవడం చాలా సులభంగా మారింది. తత్ఫలితంగా, ప్రజలు తరచుగా అనవసరమైన వాటి కోసం రుణాలు తీసుకుంటున్నారు. ఖరీదైన గాడ్జెట్‌లు, ఫ్యాషన్ వస్తువులు లేదా సెలవుల కోసం డబ్బును లెక్క లేకుండా ఖర్చు చేస్తున్నారు. ఇలా చేయడం మీ ఆర్థిక స్థితికి అత్యంత ప్రమాదకరం. ఈ కారణంగా మీ బడ్జెట్‌కు అవరోధం కలగడమే కాకుండా, అధిక వడ్డీ రేట్లు & అదనపు ఛార్జ్‌ల కారణంగా కూడా మీరు ఇబ్బంది పడవచ్చు.
3. అత్యవసర నిధిని విస్మరిస్తున్నారు
పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్న వ్యక్తులు కూడా ఆర్థికంగా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ఆందోళన చెందుతుంటారు. ఆ పరిస్థితిని ఎదుర్కోవటానికి వారి వద్ద డబ్బు/అత్యవసర నిధి ఉండదు. ఒకవేళ మీరు మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తుంటే, ప్రతి నెలా కొంత డబ్బును అత్యవసర నిధిలో జమ చేయాలి. ఈ డబ్బును అత్యంత కఠిన పరిస్థితుల్లో తప్ప సాధారణ అవసరాల కోసం ఖర్చు చేయకూడదు. ఎప్పుడు చూసినా ఆ ఖాతాలో కనీసం 3 నెలల జీతానికి సరిపడే డబ్బు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే విత్‌డ్రా చేసుకోవచ్చు.
4. స్వల్పకాలిక పెట్టుబడి ఒక పొరపాటు
మీ దగ్గర డబ్బు ఉంటే, స్వల్పకాలానికి మాత్రమే పెట్టుబడి పెట్టకండి. దీర్ఘకాల లక్ష్యం కోసం పెట్టుబడి పెట్టండి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లేదా అధిక రాబడి పథకాలు వంటి శీఘ్ర లాభాల కోసం చాలా మంది తమ డబ్బును స్వల్పకాలిక పెట్టుబడులలోకి మళ్లిస్తారు. ఈ రకమైన పెట్టుబడిలో కొన్నిసార్లు లాభం ఉంటుంది, కొన్నిసార్లు భారీ నష్టం కూడా ఉంటుంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలి.
5. బీమా పాలసీని విస్మరించడం
బీమా పాలసీ వేస్ట్ అని చెప్పే చాలా మందిని మీరు చూసి ఉంటారు. అలాంటి వ్యక్తులు బీమాను అనవసర వ్యయంగా భావిస్తుంటారు. అది నిజం కాదు. ఆరోగ్య బీమా, జీవిత బీమా, ఆస్తి బీమా వంటివి మీకు లాభదాయకమైన ఒప్పందాలు. మీరు సంపాదించిన డబ్బును, మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే తప్పనిసరిగా బీమా పాలసీ తీసుకోవాలి. అయితే, బీమా పాలసీ తీసుకునేటప్పుడు లేదా మీ డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటప్పుడు కచ్చితంగా ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి.
మరో ఆసక్తికర కథనం: SIP వర్సెస్ FD - ఎందులో మీరు ఎక్కువ లాభపడతారు?