Important Rule Changes in August: డబ్బుకు సంబంధించి, వచ్చే నెలలో (ఆగస్టు) చాలా మార్పులు జరగబోతున్నాయి. ఆ మార్పులు మీ సేవింగ్స్‌, ఇన్వెస్ట్‌మెంట్స్‌, బెనిఫిట్స్‌ మీద ప్రభావం చూపొచ్చు. స్పెషల్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ITR ఫైలింగ్ నుంచి క్రెడిట్ కార్డ్ రూల్స్‌ వరకు, ఆగస్టులో జరిగే మార్పుల గురించిన ఇన్ఫర్మేషన్‌ ఇది. వీటి గురించి ముందే తెలుసుకుంటే, జేబు మీద పడే భారాన్ని తెలివిగా తప్పించుకోవచ్చు.


క్రెడిట్ కార్డ్ రూల్స్‌
ఫిప్‌కార్ట్‌ -యాక్సిస్‌ బ్యాంక్‌ కో-బ్రాండెడ్‌ క్రెడిట్ కార్డ్‌ను మీరు ఉపయోగిస్తుంటే, మీ కోసం ఒక ఇంపార్టెంట్‌ అప్‌డేట్‌. 12 ఆగస్టు 2023 నుంచి, ఈ కార్డ్‌తో మీరు హోటల్, ఫ్లైట్ పేమెంట్స్‌, మింత్రాలో షాపింగ్‌ చేస్తే వచ్చే క్యాష్ బ్యాక్‌లో బ్యాంకు భారీ కోత పెట్టింది. గతంలో 5 శాతం క్యాష్ బ్యాక్ వచ్చేది, ఆగస్టు 12 నుంచి దానిని 1.5 శాతానికి కట్‌ చేసింది. ఇంకా చాలా రకాల షాపింగుల మీద ఒక్క రూపాయి కూడా క్యాష్‌బ్యాక్‌ జమ చేయదు. ఈ కార్డుతో సంవత్సరానికి రూ.2 లక్షలు ఖర్చు చేస్తే యాన్యువల్‌ ఫీజు ఉండేది కాదు. ఈ బెనిఫిట్‌ కోసం ఇకపై ఏడాదికి రూ.3.5 లక్షలు ఖర్చు చేయాలి.


SBI అమృత్ కలశ్‌ లాస్ట్‌ డేట్‌
SBI ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ అమృత్ కలశ్‌లో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ ఆగస్ట్ 15. ఇది 400 రోజుల టర్మ్ డిపాజిట్ పథకం. వడ్డీ రేటు సాధారణ కస్టమర్లకు 7.1 శాతం & సీనియర్ సిటిజన్లకు 7.6 శాతంగా ఉంటుంది. ఈ స్పెషల్‌ FD కింద ప్రి-మెచ్యూర్‌ విత్‌డ్రాయల్‌, లోన్ సదుపాయాలుకూడా పొందొచ్చు.


ఇండియన్ బ్యాంక్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గడువు
ఇండియన్ బ్యాంక్ తీసుకొచ్చిన ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం "IND SUPER 400 DAYS". ఈ 400 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం కింద రూ.10,000 నుంచి రూ.2 కోట్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీనికి లాస్ట్‌ డేట్‌ ఆగస్టు 31వ తేదీ. 400-రోజుల ప్రత్యేక FD కింద, సాధారణ ప్రజలకు 7.25% వడ్డీ & సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీ ఇస్తోంది.


ఇండియన్ బ్యాంక్ యొక్క 300-రోజుల FDకి కూడా చివరి తేదీ ఆగస్టు 31. ఈ స్కీమ్‌ 5 వేల నుంచి 2 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్‌ కింద, సాధారణ ప్రజలకు 7.05 శాతం & సీనియర్‌ సిటిజన్‌లకు 7.55 శాతం వడ్డీని బ్యాంక్‌ ఇస్తోంది.


IDFC బ్యాంక్ స్పెషల్‌ FD 
IDFC బ్యాంక్, అమృత్ మహోత్సవ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను 375 రోజులు & 444 రోజుల కాల గడువుతో ప్రారంభించింది, దీనిలో పెట్టుబడి పెట్టడానికి ఆగస్టు 15వ తేదీ వరకే అవకాశం ఉంది. 375 రోజుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మీద గరిష్ట వడ్డీ 7.60 శాతం, 444 రోజుల FD మీద గరిష్ట వడ్డీ 7.75 శాతం చొప్పున బ్యాంక్‌ చెల్లిస్తోంది.


ఆదాయ పన్ను రిటర్న్ 
జులై 31వ తేదీ లోపు ఐటీఆర్‌ ఫైల్‌ చేయకుంటే, ఆగస్టు 1 నుంచి జరిమానాతో కలిపి ఫైల్‌ చేయాల్సి వస్తుంది. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని బట్టి, లేట్‌ ఫైన్‌ రూపంలో వెయ్యి నుంచి 5 వేల రూపాయల వరకు కట్టాలి. లేట్‌ ఫైన్‌తో కలిపి ఆలస్యంగా రిటర్న్‌ ఫైల్ చేయడానికి డిసెంబర్ 31వ తేదీ వరకు సమయం ఉంది. 


వంట గ్యాస్‌ రేట్లు
ప్రతి నెల 1వ తేదీన, డొమెస్టిక్‌ & కమర్షియల్‌ వంట గ్యాస్‌ రేట్లను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు మారుస్తాయి. ఆగస్టు 1న కూడా వంట గ్యాస్‌ రేట్లు మారతాయి/స్థిరంగా ఉండొచ్చు.


బ్యాంకు సెలవులు
ఆగస్టులో, కచ్చితంగా బ్యాంక్‌కు వెళ్లి పూర్తి చేయాల్సిన పని ఏదైనా మీరు పెట్టుకుంటే, ఆ నెలలో బ్యాంక్‌ సెలవుల గురించి కూడా మీరు తెలుసుకోవాలి. వచ్చే నెలలో (ఆగస్టులో) బ్యాంకులకు మొత్తం 14 రోజులు హాలిడేస్‌ ఉన్నాయి. అయితే, ప్రాంతాన్ని బట్టి ఈ సెలవు రోజులు మారతాయి.


మరో ఆసక్తికర కథనం: మన దేశంలో మొదటి బిలియనీర్ ఇతనే - వజ్రాల గనులు, కిలోల కొద్దీ నగలు, 50 రోల్స్‌రాయిస్ కార్లకు ఓనర్‌


Join Us on Telegram: https://t.me/abpdesamofficial