RBI On Loan Foreclosure Charges Or Preclosure Penalties: చాలా మంది ప్రజలు వివిధ అవసరాల కోసం బ్యాంక్‌ నుంచి రుణాలు తీసుకుంటారు, EMIల రూపంలో తిరిగి చెల్లిస్తుంటారు. రుణం రకాన్ని బట్టి EMIల సంఖ్య ఆధారపడి ఉంటుంది. కొంతమంది, ఎక్కువ ఆర్థిక భారం పడకుండా, అన్ని EMIలు కట్టి రుణం తీరుస్తారు. మరికొంతమంది, డబ్బు చేతిలోకి రాగానే, కాల పరిమితికి ముందే బ్యాంక్‌ లోన్‌ క్లియర్‌ చేస్తారు. ఇలా ముందుగా చెల్లిండాన్నే లోన్‌ ఫోర్స్‌క్లోజర్‌ లేదా ప్రిక్లోజర్‌ అంటారు. లోన్‌ తీసుకున్న కస్టమర్‌, EMIలను పూర్తిగా చెల్లించడం బ్యాంక్‌లు లేదా ఆర్థిక సంస్థలకు (రుణదాతలు) ప్రయోజనం, వాటికి పూర్తి స్థాయిలో వడ్డీ ఆదాయం వస్తుంది. కస్టమర్‌ తన లోన్‌ ముందుగానే క్లోజ్‌ చేస్తే రుణదాతలు కొంత వడ్డీ రాబడిని కోల్పోతాయి. ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, కస్టమర్‌ నుంచి, ముందస్తు రుణం చెల్లింపుపై (Loan Foreclosure Or Preclosure) ఛార్జీ లేదా జరిమానా (Charge Or Penalty) వసూలు చేస్తున్నాయి. అంటే, ముందుగా రుణం తీర్చే రుణగ్రహీతల నుంచి రుణదాతలు అదనంగా వసూలు చేస్తున్నాయి, ఇకపై ఈ దందా ఆగిపోనుంది. 

ముసాయిదా పత్రం విడుదలబ్యాంకులు & ఇతర రుణదాతలు ఫ్లోటింగ్ రేట్‌ రుణాల ముందస్తు చెల్లింపుపై జరిమానా లేదా ఛార్జీ విధించకూడదని ప్రతిపాదిస్తూ, బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India ) ఒక ముసాయిదా పత్రాన్ని విడుదల చేసింది. ఈ ప్రతిపాదన వ్యక్తులకు ఇచ్చే రుణాలతో పాటు సూక్ష్మ & చిన్న తరహా సంస్థలకు (MSEలు) ఇచ్చే లోన్‌లకు కూడా వర్తిస్తుంది. RBI, ఈ ప్రతిపాదనకు సంబంధించి మార్చి 21, 2025 నాటికి సూచనలను కోరింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రతిపాదనపై మీరు ఏవైనా సూచనలు, సలహాలు ఇవ్వాలన్నా & అభ్యంతరాలు వ్యక్తం చేయాలన్నా మార్చి 21వ తేదీ లోపు ఆ పని చేయవచ్చు.

రుణదాతలకు మొట్టికాయలు వేసిన ఆర్‌బీఐ ఆర్‌బీఐ నియంత్రణలో ఉన్న సంస్థలు (Regulated Rntities -REs), రుణగ్రహీతలతో చేసుకుంటున్న లోన్‌ ఒప్పందాల్లో ఆఫర్‌లను పరిమితం చేశాయని కేంద్ర బ్యాంక్‌ తన ముసాయిదా పత్రంలో వెల్లడించింది. తక్కువ వడ్డీ రేటు ఆఫర్‌ చేస్తున్న వేరే రుణదాతకు మారకుండా లేదా మెరుగైన సేవలను అందించగల వేరే రుణదాతకు మారకుండా ఆ లోన్‌ నిబంధనలు కస్టమర్‌ను అడ్డుకుంటున్నాయని ముసాయిదా పత్రంలో పేర్కొంది. బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు ఎటువంటి లాక్-ఇన్ వ్యవధి లేకుండా రుణాన్ని ముందస్తుగా చెల్లించడానికి లేదా ముందస్తుగా ముగించడానికి అనుమతించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ తన ముసాయిదా పత్రంలో స్పష్టం చేసింది. బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ ఎటువంటి ప్రిక్లోజర్‌ పెనాల్టీ లేదా ఫోర్‌క్లోజర్ ఛార్జీలను వసూలు చేయలేదని పేర్కొంది. 

ప్రస్తుత నిబంధనల ప్రకారం, వ్యాపారం కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం వ్యక్తిగత రుణగ్రహీతలకు మంజూరు చేసిన ఫ్లోటింగ్ రేట్ టర్మ్ లోన్‌లపై ప్రీక్లోజర్‌ ఛార్జీలు విధించడానికి నిర్దిష్ట నియంత్రిత సంస్థలకు (REs) అనుమతి లేదు. "టైర్-1 & టైర్-2 సహకార బ్యాంకులు, ప్రారంభ దశ NBFCలు కాకుండా ఇతర నియంత్రిత సంస్థలు.. వ్యక్తులు & MSME రుణగ్రహీతలు వ్యాపార ప్రయోజనాల కోసం పొందిన ఫ్లోటింగ్ రేటు రుణాల ముందస్తు చెల్లింపుపై ఎటువంటి ఛార్జీలు/జరిమానాలు విధించలేవు" అని RBI ముసాయిదా పత్రం పేర్కొంది. మధ్య తరహా సంస్థల (medium enterprises) విషయంలో, రుణగ్రహీతకు మంజూరు చేసిన రూ. 7.50 కోట్ల వరకు రుణాలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది.

మరో ఆసక్తికర కథనం: పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - లాస్ట్‌ డేట్‌ ఇదీ