Application Process Begins for PM Internship Schem: ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) రెండో రౌండ్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పథకం కింద, దేశంలోని 730కి పైగా జిల్లాల్లో ఒక లక్ష మందికి పైగా యువతకు పెద్ద కంపెనీలలో ఇంటర్న్‌షిప్ అవకాశం లభిస్తుంది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Corporate Affairs) దీని గురించి పత్రిక ప్రకటన విడుదల చేసింది.
ఈ వయసు యువత అర్హులు
పీఎం ఇంటర్న్‌షిప్ పథకం కింద, పూర్తి సమయపు విద్యా కార్యక్రమం (రెగ్యులర్ కోర్స్‌లు) లేదా ఉద్యోగంలో లేని 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతకు అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా, యువత తమ కెరీర్‌ను ప్రారంభించడానికి గొప్ప అవకాశం పొందుతారు. ఈ ప్రభుత్వ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) 2024-25 కేంద్ర బడ్జెట్‌లో (Union Budget 2024) ప్రకటించారు. ఈ పథకం లక్ష్యం.. నిరుద్యోగ యువత కెరీర్‌కు దిశానిర్దేశం చేయడం & న్యాయమైన ఉపాధి అవకాశాలను కల్పించడం. పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 1 కోటి మందికి పైగా యువత ప్రయోజనం పొందుతారు. పైలట్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 800 కోట్లు.
పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
పీఎం ఇంటర్న్‌షిప్ పథకం లేదా PIMS కింద, యువత దేశంలోని టాప్-500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం pminternship.mca.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి మీ ప్రొఫైల్ సృష్టించండి. ఆ తరువాత, వివిధ రంగాల కంపెనీలలో ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి. అప్లికేషన్ పంపడానికి ఆఖరు తేదీ మార్చి 12, 2025. ఈ పథకం కింద, ఒక్కో అభ్యర్థి గరిష్టంగా మూడు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్న్‌షిప్ కాలంలో ప్రతి నెలా డబ్బు
ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం కింద, 12 నెలల పాటు ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉంటుంది. ఈ సంవత్సర కాలంలో, దేశంలోని పెద్ద కంపెనీల్లో నిజమైన పని అనుభవాలు, వ్యాపార కార్యకలాపాల గురించి నేర్చుకుంటారు. ఇంటర్న్‌షిప్ సమయంలో, ప్రతి నెలా రూ. 5,000 ఆర్థిక సాయం అందుతుంది. ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత ఒకేసారి రూ. 6,000 లభిస్తుంది. 2025 డిసెంబర్ 02 నుంచి ఇంటర్న్‌షిప్ ప్రారంభం అవుతుంది.
ఇంటర్న్‌లకు బీమా కవరేజ్ ప్రయోజనం
ప్రభుత్వం పథకం కింద, ఇంటర్న్‌లు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PM Jeevan Jyoti Bima) & ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PM Surakha Yojana) కింద బీమా కవరేజీని పొందుతారు. ఆయా కంపెనీలు కూడా సొంతంగా ప్రత్యేక ప్రమాద బీమా కవరేజీని అందిస్తాయి.
మరో ఆసక్తిర కథనం: ఈ రేట్ల దగ్గర కొనలేం, నగలను మరిచిపోండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ