2000 Rupee Notes News Update: చలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లలో 98.18 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని వెల్లడిస్తూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫ్రెష్‌ డేటా విడుదల చేసింది. ఇప్పుడు, ప్రజల వద్ద రూ. 6,471 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ఉన్నాయి. శనివారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో, 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' రూ. 2,000 నోట్ల స్టేటస్‌పై చాలా విషయాలు వెల్లడించింది. 


రిజర్వ్‌ బ్యాంక్‌, దాదాపు రెండేళ్ల క్రితం (2023 మే 19న‌), వ్యవస్థలో చెలామణీ నుంచి రూ. 2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు (Withdrawal of Rs. 2000 notes) ప్రకటించింది. ఇది ఉపసంహరణ మాత్రమే, ఆ పెద్ద నోట్లను కేంద్ర బ్యాంక్‌ రద్దు చేయలేదు. అంటే, రూ. 2000 నోట్లు ఇప్పటికీ చెల్లుబాటు అవుతాయి ‍. రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణ సమయానికి, దేశంలో చెలామణిలో ఉన్న ఆ నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి (28 ఫిబ్రవరి 2025 నాటికి), ఆ విలువ రూ. 6,471 కోట్లకు గణనీయంగా పడిపోయింది. అంటే, పింక్‌ నోట్లను RBI వెనక్కు తీసుకున్నప్పటికీ, రూ. 6,471 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల దగ్గరే ఉన్నాయి.


తిరిగి వచ్చినవి - ప్రజల దగ్గర ఉన్నవి
రిజర్వ్‌ బ్యాంక్‌ తాజా డేటా ప్రకారం, 2023 మే 19 నాటికి చెలామణీలో ఉన్న రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లలో ఇప్పటి వరకు 98.18 శాతం నోట్లు వెనక్కు వచ్చాయి. కేవలం 1.82 శాతం నోట్లు తిరిగి రాలేదు, వాటి విలువ రూ. 6,471 కోట్లు.


మీ దగ్గర రూ.2,000 నోట్లు ఉంటే ఇప్పటికీ మార్చుకునే అవకాశం ఉంది
2023 మే 19న రూ.2 వేల నోట్ల విత్‌డ్రా ప్రకటించిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా, ఆ ఏడాది అక్టోబర్ 07 వరకు వాటిని బ్యాంక్‌ శాఖల్లో మార్చుకునే/ అకౌంట్‌లో డిపాజిట్‌ చేసే వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు ఆ ఛాన్స్‌ లేదు. అయితే, మీ దగ్గర ఇప్పటికీ రూ.2,000 నోట్లు ఉంటే, వాటిని మీరు మార్చుకునేందుకు మరో మార్గం ఉంది. మీ దగ్గర ఉన్న పింక్‌ నోట్లను (రూ.2,000 నోట్లు) రిజర్వ్ బ్యాంక్‌కు చెందిన 19 ఇష్యూ కార్యాలయాల్లో (RBI Issue Offices) జమ చేయవచ్చు. RBI ఇష్యూ కార్యాలయాలు వ్యక్తులు & సంస్థల నుంచి రూ. 2000 నోట్లను వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడానికి అంగీకరిస్తున్నాయి. తెలుగు ప్రజలకు దగ్గరలో, హైదరాబాద్‌లో RBI ఇష్యూ ఆఫీస్‌ ఉంది.


పోస్టాఫీస్‌ నుంచి కూడా ఖాతాలో డిపాజిట్‌ చేయొచ్చు
హైదరాబాద్‌ వెళ్లి RBI ఇష్యూ ఆఫీస్‌లో రూ.2,000 నోట్లను జమ చేయడం వీలుకాదు అనుకుంటే, పోస్టాఫీస్‌ ద్వారా కూడా ఈ పని చేయవచ్చు. ప్రజలు ఏదైనా పోస్టాఫీసు నుంచి 'ఇండియన్ పోస్ట్' ద్వారా రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాలకు రూ. 2000 నోట్లను పంపే సౌకర్యం కూడా చాలా కాలం నుంచి అందుబాటులో ఉంది. ఈ నోట్లను సంబంధిత వ్యక్తి బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తారు. 


2000 రూపాయల నోట్లను ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు?
2,000 రూపాయల నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించుకున్నప్పటికీ, అవి చట్టబద్ధంగా చెలామణిలో (Rs 2,000 notes are legal tender) ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'క్లీన్ నోట్ పాలసీ'లో భాగంగా  రూ. 2,000 నోట్లను ఉపసంహరించుకోవడం జరిగింది. తద్వారా దెబ్బతిన్న, నకిలీ, తక్కువగా ఉపయోగించే నోట్లను చెలామణీ నుంచి తొలగిస్తారు.


మరో ఆసక్తికర కథనం: పసిడి ప్రియులకు ఊరట, దిగొస్తున్న నగల రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ