RBI MPC Meet: 


రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈసారి రెపోరేట్లను పెంచడం లేదని ప్రకటించింది. మరీ అతిగా కఠిన చర్యలు తీసుకుంటే వృద్ధికి ఆటంకాలు వస్తాయని అంచనా వేసింది. కీలక రెపోరేటును 6.5 శాతంగానే ఉంచుతున్నట్టు వివరించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు చేస్తున్న పోరాటం ఆగదని వెల్లడించింది. 2023-23 జీడీపీ వృద్ధిరేటును 6.4 శాతం నుంచి 6.5 శాతానికి పెంచింది.


సోమవారం మొదలైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం గురువారం ముగిసింది. స్థూల ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రెపోరేటును యథాతథంగా ఉంచుతున్నామని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. మరీ కఠినంగా రేట్లను పెంచడం ద్వారా వృద్ధిరేటు మందగిస్తుందని కమిటీ అభిప్రాయపడింది.




ఆర్బీఐ ఇప్పటి వరకు ఆరు సార్లు రెపోరేటును పెంచింది. కొన్ని నెలల వ్యవధిలోనే 250 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. దాంతో 6 శాతంగా ఉన్న హోమ్‌ లోన్‌ వడ్డీరేటు ఇప్పుడు పది శాతానికి పెరిగింది. ఫలితంగా కస్టమర్లు చెల్లించాల్సిన నెలసరి వాయిదాలు పెరిగాయి. వరుస వడ్డీరేట్ల పెంపుతో క్షేత్ర స్థాయిలో అనుకున్న స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదని ఆర్బీఐ భావిస్తోంది.


'సరఫరా పరిస్థితులు మెరుగవ్వడంతో 2023 క్యాలెండర్‌ ఇయర్‌ ఆశాజనకంగా ఉంది. ఆర్థిక కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి. ఫైనాన్షియల్‌ మార్కెట్లు ఆశావహంగా కదులుతున్నాయి. సెంట్రల్‌ బ్యాంకులు సాఫ్ట్‌ ల్యాండింగ్‌ వైపు ఆర్థిక వ్యవస్థలను తీసుకెళ్తున్నాయి. మార్చి నెలలో రేట్ల పెంపు నేపథ్యంలో హఠాత్తుగా మార్పు వచ్చింది. గ్లోబల్‌ బ్యాంకింగ్‌ క్రైసిస్‌ ఏర్పడింది. అభివృద్ధి చెందిన దేశాలు ఇబ్బంది పడుతున్నాయి' అని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు.




రెపోరేట్ల పెంపు ఇక్కడితోనే ఆగిపోదని శక్తికాంత దాస్‌ అంటున్నారు. ఏప్రిల్‌ సమావేశం వరకే పెంపు నిలిపివేశామన్నారు. పరిస్థితులను బట్టి భవిష్యత్తుల్లో వడ్డీరేట్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రూపాయి విలువను జాగ్రత్తగా గమనిస్తున్నామని అన్నారు. ప్రస్తుతానికి నిలకడ వచ్చిందన్నారు. మరీ కఠినంగా వడ్డీరేట్లను పెంచడం వల్ల వృద్ధికి విఘాతం కలుగుతుందని ఆర్బీఐ కమిటీ భావించింది.


2024 ఆర్థిక ఏడాదిలో రియల్‌ జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. మొదటి క్వార్టర్లో 7.8 శాతం, రెండో క్వార్టర్లో 6.2 శాతం, మూడో క్వార్టర్లో 6.1 శాతం, నాలుగో క్వార్టర్లో 5.9 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఇక ద్రవ్యోల్బణం రేటును 5.3 నుంచి 5.2 శాతానికి తగ్గించింది.