Steps To Order A PVC Aadhaar Card Online: ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన వ్యక్తిగత గుర్తింపు పత్రం. బ్యాంక్‌ పని అయినా, స్థిరాస్తి రిజిస్ట్రేషన్ అయినా, స్కూల్‌/కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలన్నా, ఆఖరుకు ఎక్కడికైనా వెళ్లడానికి టిక్కెట్లు బుక్‌ చేసుకోవాలన్నా ఆధార్ ఉండాల్సిందే, ఇది లేకుంటే పని జరగదు. ముఖ్యంగా, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డును 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (UIDAI) జారీ చేస్తుంది. అత్యంత కీలకమైన ఆధార్‌ కార్డ్‌లో ఉన్న అతి పెద్ద లోపం దాని పరిమాణం. ఇది జేబులో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకువెళ్లడానికి అనుకూలంగా ఉండదు. ఈ సమస్యకు పరిష్కారంగా, పాలీ వినైల్ క్లోరైడ్‌ (PVC) కార్డ్‌ రూపంలో ఆధార్‌ను ఉడాయ్‌ అందిస్తోంది.


PVC ఆధార్ కార్డ్ మన్నికైనది & సురక్షితమైనది


ఇప్పటి వరకు, ఆధార్‌ కార్డ్‌ను మందపాటు పేపర్‌పై ప్రింట్‌ రూపంలో ఇచ్చేవాళ్లు. దీనిని లామినేషన్ చేసినప్పటికీ కొన్నాళ్లకు పాడైపోతుంది. పాలీ వినైల్ క్లోరైడ్‌ (PVC) ఆధార్ కార్డ్‌లో ఈ ఇబ్బందులు ఉండవు. ఇది జీవితకాలం పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది. PVC ఆధార్‌ కార్డ్‌లోని అత్యంత సానుకూలత దాని సైజ్‌. ఏటీఎం కార్డ్‌ లాగా కనిపించే PVC ఆధార్‌ కార్డ్‌ను మీ జేబులో లేదా పర్స్‌లో పెట్టుకోవడం, ఎక్కడికైనా తీసుకెళ్లడం చాలా సులభం. సింథటిక్ ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఈ కార్డ్ పరిమాణం 86 మి.మీ. X 54 మి.మీ. ఇది, పేపర్‌ ఆధార్‌ కార్డ్‌ కంటే మన్నికైనది & బలంగా ఉంటుంది. అంతేకాదు.. హోలోగ్రామ్, గిలోచ్ ప్యాటర్న్, QR కోడ్ వంటి అన్ని భద్రత నమూనాలతో ఈ కార్డ్‌ ఉంటుంది.


PVC ఆధార్‌ కార్డ్‌ను ఆన్‌లైన్‌లో ఎలా ఆర్డర్ చేయాలి? (How to order PVC Aadhaar card online?)


-- మీరు ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని PVC ఆధార్ కార్డ్‌ను ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. 


-- PVC ఆధార్‌ కార్డ్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసేందుకు UIDAI అధికారిక వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.in/ లోకి వెళ్లాలి.


-- మీరు ఈ సైట్‌లోకి వెళ్ళిన తర్వాత, మీకు హోమ్‌ పేజీలోనే కాస్త కింద, "ఆర్డర్ ఆధార్ PVC కార్డ్" ఆప్షన్‌ కనిపిస్తుంది.


-- దీనిపై క్లిక్ చేసిన తర్వాత, కనిపించే బాక్స్‌లో మీ 12 అంకెల ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్‌ చేయాలి.


-- ఆధార్‌ నంబర్‌, క్యాప్చా ఎంటర్‌ చేసిన తర్వాత "సెండ్‌ OTP" మీద క్లిక్‌ చేయండి. 


-- ధృవీకరణ కోసం మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు OTP వస్తుంది, దానిని నమోదు చేసిన తర్వాత పేమెంట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది.


-- ఇక్కడ GST, పోస్టల్‌ చార్జీలతో కలిపి రూ. 50 చెల్లించాలి.


-- చెల్లింపు పూర్తయిన తర్వాత మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఒక రిఫరెన్స్ నంబర్‌తో మెసేజ్‌ వస్తుంది.


-- మీ PVC ఆధార్ కార్డ్ సిద్ధమైన తర్వాత, పోస్ట్ ద్వారా ,ఆధార్‌లో ఉన్న మీ ఇంటి చిరునామాకు వస్తుంది.


PVC ఆధార్ కార్డ్ కోసం పేమెంట్‌ చేసే సమయంలో లేదా పేమెంట్‌ పూర్తయిన తర్వాత మీకు ఏదైనా సందేహం లేదా సమస్య ఉంటే, UIDAI టోల్ ఫ్రీ నంబర్ 1947కు ఫోన్‌ చేసి గానీ లేదా help@uidai.gov.in కు ఇ-మెయిల్‌ పంపి గానీ సాయం పొందవచ్చు.


మరో ఆసక్తికర కథనం: పెళ్లయిన కుమార్తెకు తండ్రి ఆస్తిపై హక్కు ఉంటుందా, ఆస్తిని సమానంగా పంచి ఇవ్వాల్సిందేనా?