PPF vs SSY: ప్రస్తుత కాలంలో ఆర్థిక ద్రవ్యోల్బణం, విద్యా ద్రవ్యోల్బణం మీద చాలామంది ప్రజల్లో అవగాహన పెరిగింది. ద్రవ్యోల్బణం కారణంగా నష్టపోకుండా, పిల్లల పుట్టిన నాటి నుంచే వాళ్ల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, బాలికలు & మహిళలు ఆర్థికంగా బలపడడం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా పొదుపు పథకాలను అమలు చేస్తోంది. ఆ పథకాలలో పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో కార్పస్ క్రియేట్ అవుతుంది. మీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉండి, ఆమె భవిష్యత్ కోసం ఇప్పటి నుంచే మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే, బాగా ప్రజాదరణ పొందిన రెండు పెట్టుబడి పథకాలు ఉన్నాయి. అవి.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY). వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆకర్షణీయమైన రాబడి పొందవచ్చు.
SSY, PPFలో ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు?
10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల కోసం మాత్రమే సుకన్య సమృద్ధి యోజనను (sukanya samriddhi yojana) ప్రత్యేకంగా ప్రారంభించారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, ఆడపిల్లకు 21 ఏళ్లు నిండిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. దీనికి విరుద్ధంగా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (public provident fund) పథకంలో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న బాలికల కోసం కూడా PPF ఖాతా తెరవవచ్చు.
రెండు స్కీమ్‌లలో లాక్-ఇన్ పిరియడ్ ఎంత?
సుకన్య సమృద్ధి యోజన కింద, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న ఆడపిల్లల కోసం ఏదైనా బ్యాంక్ లేదా పోస్టాఫీసులో ఖాతా తెరవవచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు గరిష్ట పరిమితి 21 సంవత్సరాలు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం గురించి చెప్పుకుంటే, దీనిలో మొత్తం పెట్టుబడి కాలం 15 సంవత్సరాలు. ఆడపిల్లకు 18 ఏళ్ల వయస్సు వచ్చేంతవరకే SSY ఖాతాలో పెట్టుబడి పెట్టడం సాధ్యం అవుతుంది, ఆ తర్వాత డబ్బు జమ చేయలేరు. PPF ఖాతాలో పెట్టుబడి వ్యవధిని 15 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ గడువు పూర్తయిన తర్వాత మరో 5 సంవత్సరాల వరకు పొడిగించుకుని, పెట్టుబడిని కొనసాగించవచ్చు.
రెండు పథకాల్లో ఎంత పెట్టుబడి పెట్టవచ్చు?
సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. ఈ రెండు పథకాల కింద పోస్టాఫీసు లేదా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
SSY, PPFలో ఎంత వడ్డీ వస్తుంది?
సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెడితే, ఆ డబ్బుపై 8 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన ఖాతాకు బదిలీ చేస్తారు. పీపీఎఫ్ ఖాతాపై 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. కాబట్టి, మీరు ఈ రెండింటిలో ఏదైనా ఒక స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే, సుకన్య సమృద్ధి యోజన మెరుగైన పథకం అని, ముఖ్యంగా ఆడపిల్లల కోసం మంచి పథకంగా చెప్పుకోవచ్చు.
SSY ఖాతాలో జమ చేసిన డబ్బును ఆడపిల్లకు 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత పాక్షికంగా, 21 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు. PPF ఖాతా విషయానికి వస్తే, పెట్టుబడి పెట్టిన మొత్తంలో ఏడు సంవత్సరం తర్వాత కొంతమొత్తాన్ని విత్‌డ్రా చేయవచ్చు.