Post Office Time Deposit Scheme Details: భారత ప్రభుత్వ మద్దతుతో, తపాలా విభాగం నిర్వహించే టైమ్ డిపాజిట్ పథకం (Post Office TD Scheme) పెట్టుబడిదారులకు సురక్షితమైన & లాభదాయకమైన మార్గంగా మారింది. ఈ పథకం బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit - FD) తరహాలో పని చేస్తుంది. అయితే, బ్యాంక్‌ల కంటే పోస్టాఫీస్‌ టైమ్ డిపాజిట్ పథకంలో వడ్డీ రేట్లు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. 


పోస్టాఫీస్‌  టైమ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడిదారులకు 6.90 శాతం నుంచి 7.50 శాతం వరకు వడ్డీ (Interest Rate Of Post Office Time Deposit) లభిస్తుంది. ఇది, వివిధ బ్యాంక్‌ల ప్రస్తుత FD రేట్ల కంటే ఇది మెరుగ్గా ఉంది. పోస్టాఫీస్‌ టైమ్ డిపాజిట్‌ పథకం భారత ప్రభుత్వ మద్దతుతో నడుస్తుంది కాబట్టి దీనిలో పెట్టుబడి నష్టం ఉండదు, మీ డబ్బు పూర్తి సురక్షితంగా ఉంటుంది.


పోస్టాఫీస్‌ TD పథకం ముఖ్య వివరాలు


పెట్టుబడిదారులు తమ డబ్బును పోస్టాఫీస్‌ టైమ్ డిపాజిట్‌ స్కీమ్‌లో 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల కాల వ్యవధులతో ‍‌(Post Office Time Deposit Tenure) డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం కింద, కనీసం రూ. 1,000తో ఖాతా ప్రారంభించవచ్చు, గరిష్ట డిపాజిట్ మొత్తానికి పరిమితి లేదు. TD ఖాతాపై వచ్చే వడ్డీ 'పెట్టుబడి వ్యవధి'పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, 2 సంవత్సరాల TDపై పోస్టాఫీస్‌ 7.0 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.


రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుంది?


మీరు పోస్టాఫీస్‌ 2 సంవత్సరాల టైమ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లో రూ. 2 లక్షలు జమ చేశారని భావిద్దాం. అకౌంట్‌ మెచ్యూరిటీ సమయంలో మీకు మొత్తం రూ. 2,29,776 చేతికి వస్తాయి. ఇందులో రూ. 29,776 వడ్డీ కలిసి ఉంటుంది. వడ్డీ రేటు ముందుగానే నిర్ణయమవుతుంది కాబట్టి, వడ్డీ రాబడికి గ్యారెంటీ ఉంటుంది & స్థిరమైన మొత్తం అందుతుంది. దీనిలో ఎలాంటి రిస్క్‌ ఉండదు.


TD అకౌంట్‌ను ఎవరు తెరవగలరు?


పోస్టాఫీస్‌ TD పథకం కింద భారతీయ పౌరులు ఎవరైనా ఖాతా తెరవవచ్చు. సింగిల్‌ అకౌంట్‌తో పాటు జాయింట్‌ అకౌంట్‌ కూడా ప్రారంభించవచ్చు. గరిష్టంగా ముగ్గురు కలిసి ఉమ్మడి ఖాతాను ప్రారంభించవచ్చు. ఈ పథకం చిన్న పెట్టుబడిదార్లతో పాటు పెద్ద పెట్టుబడిదారులకు కూడా అనుకూలంగా ఉంటుంది.


పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌ పథకం ప్రయోజనాలు


సురక్షితమైన పెట్టుబడి: పోస్టాఫీసు ఒక ప్రభుత్వ రంగ సంస్థ. కాబట్టి, దీనిలో పెట్టుబడి పెట్టే డబ్బు పూర్తిగా సురక్షితం.


ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు: బ్యాంకులతో పోలిస్తే పోస్టాఫీస్ టైమ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి.


సౌలభ్యం: 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు, కాల పరిమితిని ఎంచుకునే ఎంపికలు ఉన్నాయి.


తక్కువ పెట్టుబడి: మీ చేతిలో కేవలం రూ.1,000 ఉన్నా ఖాతా ప్రారంభించవచ్చు.


పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌ ఖాతాను ఎలా ప్రారంభించాలి?


పోస్టాఫీస్‌ TD ఖాతాను తెరవడానికి, మీరు మీ సమీపంలోని పోస్టాఫీస్‌‌కు వెళ్లాలి. అక్కడ దరఖాస్తు ఫారం నింపి సంబంధిత అధికారికి సమర్పించాలి. దీనికి గుర్తింపు రుజువు, చిరునామా రుజువు & పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరం.


స్పష్టీకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుందని గమనించడం ముఖ్యం. పెట్టుబడిదారుడిగా పెట్టుబడి పెట్టే ముందు ఎప్పుడూ నిపుణుల సలహా తీసుకోండి. ఫలానా చోట డబ్బు పెట్టుబడి పెట్టమని 'abp దేశం' ఎవరికీ ఎప్పుడూ సిఫార్సు చేయదు.