Mahila Samman Savings Certificate Scheme: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో స్పెషల్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ ప్రారంభించారు. దాని పేరు "మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్". అతి తక్కువ కాలంలోనే ఇది పాపులర్‌ అయింది, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను బీట్ చేస్తోంది. కేవలం 2 నెలల్లోనే 5 లక్షల ఖాతాలు తెరిచారంటే దీనికున్న ప్రజాదరణను అంచనా వేయవచ్చు.


మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది చిన్న మొత్తాల పొదుపు పథకం. ప్రస్తుతానికి పోస్టాఫీసుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది మహిళలమే తీసుకొచ్చిన ప్రత్యేక పథకం. దీనిని లాంచ్‌ చేయడానికి ప్రధాన కారణం.. పెట్టుబడి & ఆర్థిక వ్యవస్థలో స్త్రీ భాగస్వామ్యాన్ని పెంచడం. ఈ పథకం 1 ఏప్రిల్ 2023 నుంచి ప్రారంభమైంది. ఈ స్కీమ్‌ గడువు కేవలం రెండేళ్లు. అకౌంట్‌ ఓపెన్‌ చేయడానికి 2025 మార్చి 31 వరకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పథకం 1.59 లక్షల పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంది.


మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌లో ఖాతా తెరవడానికి, పోస్టాఫీస్‌కు వెళ్లి ఫామ్‌-1 నింపాలి. ఈ అకౌంట్‌లో కనిష్టంగా రూ. 1000 - గరిష్టంగా రూ. 2 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. మైనర్ బాలికల పేరు మీద, ఆమె తల్లిదండ్రులు లేదా గార్డియన్ ఖాతా తెరవవచ్చు. ఇందులో మెచ్యూరిటీ వ్యవధి 2 సంవత్సరాలు. ఉదాహరణకు, మీరు జులై 1, 2023న పెట్టుబడి పెడితే, రెండేళ్ల తర్వాత, జులై 1, 2025 మీరు వడ్డీతో సహా డబ్బును తిరిగి పొందుతారు.


అతిత్వరలో బ్యాంకుల్లో కూడా ప్రారంభం
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ ప్రజాదరణ పీక్స్‌లో కనిపిస్తోంది. రిపోర్ట్‌ ప్రకారం, ఏప్రిల్ 1, 2023 నుంచి మే చివరి వరకు, రెండు నెలల్లో 5 లక్షల మంది మహిళలు ఇందులో చేరారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 3,666 కోట్లు వచ్చాయి. అంటే సగటున ఒక్కో ఖాతాలో రూ. 73 వేలకు పైగా జమ అయ్యాయి. జూన్ నెలాఖరు నాటికి ఈ పథకాన్ని బ్యాంకుల్లో కూడా ప్రారంభం అవుతుందని, వసూళ్లు మరింత వేగంగా పెరుగుతాయని భావిస్తున్నారు.


మహిళా సమ్మాన్ పథకంలో పెట్టుబడిపై వడ్డీ
ఈ పథకంలో పెట్టుబడి పెడితే సంవత్సరానికి 7.5% వడ్డీ వస్తుంది. త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ మారుతుంది. మెచ్యూరిటీ సమయంలో మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి ఫామ్‌-2 నింపాలి. మెచ్యూరిటీ వ్యవధికి ముందు, అంటే రెండేళ్లు పూర్తి కాకుండానే డబ్బు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఖాతా తెరిచిన ఒక సంవత్సరం తర్వాత కొంత మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చు. అయితే ఖాతాలో జమ చేసిన మొత్తంలో 40 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు.


పథకం మెచ్యూరిటీ వ్యవధి 2 సంవత్సరాలు. కానీ, అనుకోని సందర్భాల్లో ఖాతాను ముందుగానే క్లోజ్‌ చేయవచ్చు. ఉదాహరణకు.. ఖాతాదారు మరణించినప్పుడు లేదా ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు నిర్ధరణ అయినా ఖాతా రద్దు చేసుకోవచ్చు. ఇందుకు అవసరమైన డాక్యుమెంట్లు సబ్మిట్‌ చేయాలి. ఖాతా తెరిచిన 6 నెలల తర్వాత ఎటువంటి కారణం లేకుండా కూడా క్లోజ్‌ చేయవచ్చు. అప్పుడు వడ్డీ రేటు 2 శాతం నుంచి 5.5 శాతం వరకు మాత్రమే లభిస్తుంది.


ఆదాయపు పన్ను మినహాయింపు లేదు
సాధారణంగా, చాలా స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌కు పన్ను ప్రయోజనాలు ఉంటాయి. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్‌లో అలాంటి ఉపశమనం ఏదీ లేదు. అయితే, TDS నుంచి మాత్రం మినహాయింపు ఉంది. సంపాదించిన వడ్డీ మీ మొత్తం ఆదాయానికి యాడ్‌ అవుతుంది, స్లాబ్ ప్రకారం టాక్స్‌ కట్టాల్సి ఉంటుంది.


మరో ఆసక్తికర కథనం: