How To Check EPF Balance Passbook Faster: దేశంలోని కోట్లాది మంది ప్రభుత్వ, ప్రైవేట్ రంగ వేతన జీవులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తీపి కబురు అందించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. ఆర్థిక సంవత్సరం 2025-26 కు గాను పీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీని సభ్యుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ కార్యాలయాలకు ఈపీఎఫ్ఓ కీలక సర్క్యులర్ జారీ చేసింది. దాదాపు 8 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లకు ఈ నిర్ణయంతో నేరుగా లబ్ధి చేకూరనుంది. వరుసగా మూడో ఏడాది కూడా ఈపీఎఫ్ఓ తన ఖాతాదారులకు 8.25 శాతం స్థిరమైన వడ్డీ రేటును కొనసాగిస్తోంది.
సాధారణంగా ప్రతి ఏటా వడ్డీ రేట్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ.. పీఎఫ్ ఖాతాల్లో ఆ సొమ్ము ప్రతిబింబించడానికి నెలల తరబడి సమయం పట్టేది. అయితే ఈ సారి ఆ ఆలస్యానికి ఈపీఎఫ్ఓ శాశ్వత బ్రేక్ వేసింది. గత కొన్ని వారాలుగా ఈపీఎఫ్ఓ తన అంతర్గత డేటాబేస్ కన్సాలిడేషన్, సాఫ్ట్‌వేర్ వ్యవస్థలను భారీగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ నూతన టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ వల్ల గత ఏళ్లతో పోలిస్తే ఈసారి వడ్డీ సొమ్ము అత్యంత వేగంగా, ఎలాంటి సాంకేతిక అడ్డంకులు లేకుండా నేరుగా సభ్యుల పాస్‌బుక్‌లలో డిజిటల్‌గా క్రెడిట్ అవుతుందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. రాబోయే రెండు మూడు వారాల్లోనే ఉద్యోగులు తమ పెరిగిన పీఎఫ్ బ్యాలెన్స్‌ను తనిఖీ చేసుకోవచ్చు.
సాంకేతిక వ్యవస్థను పునరుద్ధరించిన తర్వాత ఈపీఎఫ్ఓ తన అధికారిక వెబ్‌సైట్ నుంచి కొన్ని కీలక సేవలను తొలగించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇకపై కొత్త యూఏఎన్ జనరేట్ చేయడం లేదా పాత దాన్ని యాక్టివేట్ చేసుకునే సదుపాయం వెబ్‌సైట్‌లో లభించదు. కొత్త నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు తమ 'యూనివర్సల్ అకౌంట్ నంబర్' (UAN) ను యాక్టివేట్ చేసుకోవాలన్నా, లేదా కొత్త నంబర్ పొందాలన్నా కేంద్ర ప్రభుత్వ అధికారిక ఉమాంగ్ యాప్‌ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా సైబర్ మోసాలను అరికట్టేందుకు ఈ ప్రక్రియలో ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ విధానాన్ని ఈపీఎఫ్ఓ తప్పనిసరి చేసింది. కాబట్టి పీఎఫ్ ఖాతాదారులు తమ మొబైల్‌లో ఫేస్ రీడింగ్ ద్వారా మాత్రమే ఇకపై ఉమాంగ్ యాప్‌లో యూఏఎన్ సేవలను పూర్తి చేయగలరు. డిజిటల్ సేవల భద్రతను, విశ్వసనీయతను పెంచేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది.
మరోవైపు కొత్తగా అమల్లోకి వచ్చిన ఈపీఎఫ్ స్కీమ్, 2026 లో వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్లపై కేంద్రం కీలక స్పష్టత ఇచ్చింది. చట్టబద్ధమైన గరిష్ట వేతన పరిమితి కంటే అదనంగా ఉద్యోగులు తమ సొంత ఇష్టపూర్వకంగా చేసే అదనపు పీఎఫ్ కాంట్రిబ్యూషన్లకు సమానమైన మొత్తాన్ని యాజమాన్యాలు కూడా జమ చేయాల్సిన అవసరం లేదని చట్టబద్ధంగా తేల్చి చెప్పింది. కంపెనీల పాలసీ లేదా ఎంప్లాయ్‌మెంట్ కాంట్రాక్ట్ ఆధారంగానే అది నిర్ణయించబడుతుందని, ఉద్యోగులు అదనంగా జమ చేసినంత మాత్రాన కంపెనీలు కూడా అంతే సొమ్మును అదనంగా వేయాలని రూల్ ఏమీ లేదని ఈ నూతన మార్పు ద్వారా స్పష్టమైంది. పీఎఫ్ చందాదారులు ఈ మార్పులను గమనించి తమ ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
