EPF Balance Check: దేశవ్యాప్తంగా కోట్లాది మంది తమ జీతంలో కొంత భాగాన్ని ప్రావిడెంట్ ఫండ్‌ రూపంలో జమ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో లేదా పదవీ విరమణ తర్వాత ఈ డబ్బును ఉద్యోగులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాలో జమ అయిన సొమ్ముపై ప్రభుత్వం ఏటా వడ్డీ చెల్లిస్తుంది. మీరు మీ ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని ఒకసారి చూసుకోవాలంటే ఆ పనిని 4 సులభమైన మార్గాల్లో చేయవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

1. మిస్డ్ కాల్ ద్వారా PF బ్యాలెన్స్ తెలుసుకోండిమీరు కేవలం ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ పీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేయవచ్చు. దీని కోసం, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 నంబర్‌కు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలో మీకు సమాచారం వస్తుంది. మీ PF ఖాతాలో జమ అయిన మొత్తం గురించి సమాచారం అందులో తెలుస్తుంది. మిస్డ్ కాల్ ద్వారా PF ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే, మీ యూనివర్సల్ అకౌంట్‌ నంబర్ (UAN) తప్పనిసరిగా యాక్టివ్‌గా ఉండాలని గుర్తుంచుకోండి. UANతో మొబైల్ నంబర్‌ను లింక్‌ చేసి ఉండడం కూడా ఇక్కడ అవసరం.

2. SMS ద్వారా బ్యాలెన్స్ తనిఖీ చేయండి           మిస్డ్ కాల్ కాకుండా, మీరు SMS ద్వారా కూడా PF ఖాతా నిల్వను తనిఖీ చేయవచ్చు. దీని కోసం, మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి EPFOHO UAN అని టైప్ చేసి 7738299899 నంబర్‌కు పంపాలి. మీ ఖాతాలో జమ అయిన మొత్తం గురించి కొన్ని నిమిషాల్లో మీకు తిరిగి సమాచారం అందుతుంది.

3. ఉమాంగ్ యాప్ ద్వారా నగదు నిల్వ చేసుకోవచ్చు         ఒకవేళ మీ ఫోన్‌ నుంచి మిస్డ్‌ కాల్‌ లేదా SMS వెళ్లని పరిస్థితుల్లో, ఉమాంగ్‌ యాప్‌ ద్వారా కూడా మీ PF ఖాతా బ్యాలెన్స్‌ను చెక్‌ చేసుకోవచ్చు. దీని కోసం, ముందుగా మీ స్మార్ట్‌ ఫోన్‌లోకి Umang యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి. ఆ తర్వాత, మీ మొబైల్ నంబర్, OTP నమోదు చేయడం ద్వారా రిజిస్టర్‌ చేసుకోండి. ఇప్పుడు, యాప్‌ ఓపెన్‌ చేసి సర్వీసెస్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. EPFO ఆప్షన్‌కు​వెళితే పాస్‌బుక్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. అక్కడ UAN, OTPని నమోదు చేయండి. దీని తర్వాత, మీరు మీ ఖాతాలో జమ చేసిన మొత్తం డబ్బు గురించి సమాచారాన్ని పొందుతారు.

4. EPFO వెబ్‌సైట్ ద్వారా సమాచారం పొందండిPF బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే EPFO అధికారిక వెబ్‌సైట్ www.epfindia.gov.in  ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఈ సైట్‌లో, అవర్‌ సర్వీసెస్‌ జాబితాను ఎంచుకోండి. ఇక్కడ, ఫర్‌ ఎంప్లాయీస్‌ ఆప్షన్‌ను ఎంచుకోండి. దీని తర్వాత, మెంబర్ పాస్‌బుక్‌ను ఎంచుకోండి. ఇక్కడ, మీ UAN & పాస్‌వర్డ్‌ నమోదు చేయాలి. మీరు వివరాలను విజయవంతంగా నమోదు చేస్తే, మీ PF ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తం గురించిన సమాచారం మీకు కనిపిస్తుంది.