Personal Loan Approval Tips: చాలాసార్లు ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఇతరుల వద్ద అప్పులు చేస్తుంటాం. అకస్మాత్తుగా డబ్బు అవసరం పడుతుంది. కొన్నిసార్లు వివాహ ఖర్చులు, వైద్య అవసరాలు, పిల్లల స్కూల్, కాలేజీలు ఫీజులు లేదా గృహ అవసరాల కోసం కొందరు అప్పు తీసుకుంటుందారు. మరికొందరు వ్యక్తిగత రుణాలు (Personal Loan) తీసుకుని మనీ అడ్జస్ట్ చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు మీ పర్సనల్ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశముంది. ఇది మీ అవసరాలను తీర్చకపోగా, మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. ఇది భవిష్యత్తులో లోన్స్ తీసుకోవడంలో సమస్యలను కలిగిస్తుంది. మీరు ఈ చిన్న విషయాలను గుర్తుంచుకుంటే, రిజెక్ట్ అవకుండా మీకు పర్సనల్ లోన్ లభిస్తుంది.
1. క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకోవాలి
వ్యక్తిగత రుణం (Personal Loan) అప్లికేషన్ ఆమోదం పొందటానికి, మీ క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. మీకు రుణం ఇవ్వాలా వద్దా అని మీ లోన్ అర్హతను చెక్ చేయడానికి క్రెడిట్ స్కోర్ (Credit Score) ఉపయోగపడుతుంది. మీ క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే, మీకు లోన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకోండి. ఈ స్కోర్ తక్కువగా ఉంటే దానిని కనీసం 700 - 750 లేదా అంతకంటే ఎక్కువ చేయడానికి ప్రయత్నించాలి.
2. ఉద్యోగం, రెగ్యులర్ ఆదాయం
పర్సనల్ లోన్ ఆమోదం పొందడానికి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, స్థిరమైన ఉద్యోగం లేదా రెగ్యులర్ ఆదాయం ఉండాలి. లోన్ ఇచ్చే ముందు మీరు సమయానికి లోన్ ఇన్‌స్టాల్‌మెంట్స్ చెల్లించగలరా లేదా అని బ్యాంక్ చెక్ చేస్తుంది. మీ ఉద్యోగం, ఆదాయం ఎంత స్థిరంగా ఉంటే, మీకు లోన్ వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. మీరు ఉద్యోగం చేస్తుంటే.. 1-2 సంవత్సరాలుగా ఏదైనా కంపెనీలో పని చేస్తుంటే, బ్యాంక్ మీ వ్యక్తిగత రుణం సులభంగా ఆమోదిస్తుంది.
3. మీ వయసు ప్రభావం
లోన్ ఇచ్చే ముందు బ్యాంక్ ఆ కస్టమర్ వయస్సును పరిగణనలోకి తీసుకుంటుంది. మీ ఏజ్ 21 నుండి 60 సంవత్సరాల మధ్య ఉంటే మీకు లోన్ దొరకవచ్చు. యువకులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంక్ ప్రాధాన్యత ఇస్తుంది, ఎందుకంటే వారు ఎక్కువ సంవత్సరాలు వర్క్ చేస్తారు. తీసుకున్న లోన్ తిరిగి చెల్లించే అవకాశాలు అధికం. బ్యాంక్ చాలా చిన్న వయసు, ఎక్కువ వయస్సు ఉన్న ఖాతాదారులకు లోన్స్ ఇవ్వకుండా ఉండటానికి ప్రయత్నిస్తుంది.
4. ఇదివరకే తీసుకున్న లోన్ EMI ల ప్రభావం
పర్సనల్ లోన్ మంజూరు చేయడానికి ముందు మీరు ఇప్పటికే ఎంత లోన్ తీసుకున్నారు. ఆ మొత్తానికి ప్రతి నెలా EMI ఎంత చెల్లిస్తున్నారు అని బ్యాంక్ తనిఖీ చేస్తుంది. మీ ఆదాయంలో సగం కంటే ఎక్కువ లోన్స్ చెల్లించడానికే ఖర్చు అయితే, పర్సనల్ లోన్ తీసుకోవడంలో మీకు సమస్యలు ఎదురవుతాయి. కనుక పాత లోన్స్ EMIలను సకాలంలో చెల్లించడంతో పాటు లోన్ పెండింగ్ మొత్తాన్ని తగ్గించండి. ఇది మీ పర్సనల్ లోన్ అవకాశాన్ని పెంచుతుంది. ఎన్ని ఇబ్బందులున్నా ఇప్పటికే తీసుకున్న లోన్స్ ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే కొత్త లోన్స్ వచ్చే అవకాశం తగ్గడంతో పాటు మీ క్రెడిట్ స్కోరు తగ్గుతుంది. ఇది భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తుంది.