Perfios - PwC Report: అందేంటో, నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బు సరిగ్గా వారం రోజులు కూడా ఉండదు. మన దేశంలో చాలా మంది పరిస్థితి ఇదే. జీతంలో దాదాపు 60 శాతం డబ్బు నెల మొదటి వారంలో, 90 శాతం డబ్బు రెండో వారంలో మ్యాజిక్ చేసినట్లు మాయమవుతుంది. అకౌంట్ అడుగున మిగిలిన 10 శాతంతో మిగిలిన రెండు వారాల పాటు బతుకు జట్కా బండిని జాగ్రత్తగా నడపాలి. డ్రైవింగ్‌లో తేడా వస్తే బండి చక్రం గోతిలో పడుతుంది, గుండె గతుక్కుంటుంది.
భారతదేశ ఉద్యోగుల జీతంలో చాలా ఖర్చులు ఉంటాయి. ఇంటి అద్దె, కరెంటు బిల్లు, పాలు, పేపర్, మందులు, ఇంటర్నెట్, కూరగాయలు, కిరాణా సరుకులు, క్రెడిట్ కార్డ్ బిల్లులు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ తయారవుతుంది. ఈ ఖర్చులపై ఇటీవల ఓ సంస్థ అధ్యయనం చేసి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. భారతదేశంలో అతి పెద్ద B2B SaaS ఫిన్‌టెక్ కంపెనీ అయిన పెర్ఫియోస్, PwC ఇండియా సహకారంతో అధ్యయనం చేసి, ఫిబ్రవరి 19న నివేదికను విడుదల చేసింది. భారతదేశంలో ప్రజలు తమ ఆదాయంలో ఎంత శాతాన్ని ఎక్కడ ఖర్చు చేస్తున్నారో ఆ నివేదిక మనకు చెబుతుంది. భారతదేశంలో, ప్రజలు తమ జీతంలో 33 శాతం కంటే ఎక్కువ EMIలు చెల్లించడానికి ఖర్చు చేస్తున్నారని రిపోర్ట్‌లో వెల్లడైంది. "హౌ ఇండియా స్పెండ్స్: ఎ డీప్ డైవ్ ఇన్‌టు కన్స్యూమర్ స్పెండింగ్ బిహేవియర్" పేరిట ఆ రిపోర్ట్ రిలీజ్ అయింది.
ఈ అధ్యయనం కోసం 30 లక్షలకు పైగా వినియోగదారులను సర్వే చేశారు. ఇందుకోసం.. మెట్రో నగరాల నుంచి మూడో కేటగిరీ నగరాల వరకు నివసించేవారిని ఎంచుకున్నారు. రూ.20,000 నుంచి రూ.లక్ష వరకు జీతం తీసుకుంటున్నవారిని ప్రశ్నలు అడిగారు.
జీతంలో ఎక్కువ మొత్తం దేని కోసం ఖర్చు చేస్తున్నారు?
1. EMIలు - భారతదేశంలోని ప్రజలు తమ నెలవారీ ఆదాయంలో 33 శాతానికి పైగా మొత్తాన్ని రుణాల EMIలు చెల్లించడానికే ఖర్చు చేస్తున్నారని సర్వే ఫలితాలు చూపించాయి.
2. నిత్యావసరాలు - ఈ జాబితాలో ఇంటి అద్దె, విద్యుత్ బిల్లు మొదలైన వాటితో సహా అవసరమైన ఖర్చులు రెండో స్థానంలో ఉన్నాయి. ప్రజలు తమ ఆదాయంలో 39 శాతం వీటికే ఖర్చు చేస్తున్నారు. 32 శాతం ఆదాయాన్ని ఆహార పదార్థాలు, పెట్రోల్ మొదలైన వాటిపై ఖర్చు చేస్తున్నారు. 29 శాతం జీతం జీవనశైలి, అభిరుచి సంబంధిత ఖర్చులకు వెళుతోంది.
3. లైఫ్ స్టైల్ - ఫ్యాషన్, వ్యక్తిగత సంరక్షణ, షాపింగ్ కోసం ఆదాయంలో 62 శాతం కేటాయిస్తున్నారు.
4. ఆహారం & పానీయాలు - జీతం పెరుగుతున్న కొద్దీ, బయట తినడం లేదా ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేయడం కూడా పెరుగుతున్నాయి. ప్రజలు తమ సంపాదనలో పెద్ద భాగాన్ని వీటికి ఖర్చు చేస్తున్నారు.
5. ఆన్‌లైన్ గేమింగ్ - రూ.20,000 కంటే తక్కువ ఆదాయం ఉన్నవాళ్లు ఆన్‌లైన్ గేమింగ్ కోసం గరిష్టంగా 22 శాతం ఖర్చు చేస్తున్నారని సర్వేలో గమనించారు. ఆదాయం పెరిగే కొద్దీ, ఆన్‌లైన్ గేమింగ్‌పై ఖర్చు చేసే వారి సంఖ్య తగ్గింది. రూ.75,000 కంటే ఎక్కువ సంపాదించే వారిలో 12 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్ గేమింగ్‌పై ఖర్చు చేస్తున్నారు.
6. చెల్లింపు విధానం - సాధారణంగా, ముఖ్యమైన వస్తువులపై ఖర్చు చేయడానికి ECS (ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్)ను ఉపయోగిస్తున్నారు. లైఫ్‌స్టైల్, నిత్యావసర వస్తువుల కోసం UPI ద్వారా చెల్లింపులు చేస్తున్నారు.
మరో ఆసక్తికర కథనం: పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - లాస్ట్ డేట్ ఇదీ