PAN- Aadhaar Linking Process: భారతదేశ పౌరులు తమ పాన్‌ - ఆధార్‌ నంబర్‌ అనుసంధానించడానికి 2023 మార్చి 31వ తేదీని గడువుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఆధార్‌ నంబర్‌తో పాన్ లింక్ చేయని వ్యక్తులు ఈ చివరి తేదీ లోగా రెండింటి అనుసంధానాన్ని పూర్తి చేయాలి. లేకపోతే, పాన్ కార్డ్‌ నిరుపయోగంగా మారే అవకాశం ఉంది. పాన్ కార్డ్‌ ద్వారా జరగాల్సిన పనులు ఏవీ జరగవు, ఆగిపోతాయి. 


పాన్ కార్డును ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. 


ఆదాయపు పన్ను చట్టం - 1961 ప్రకారం మినహాయింపు పొందిన కేటగిరీలోకి రాని పాన్ కార్డ్‌హోల్డర్లు అందరూ  తమ పాన్‌ను ఆధార్‌ నంబర్‌తో 31.03.2023 లోపు లింక్ చేయడం తప్పనిసరి అని ఆదాయపు పన్ను విభాగం (Income Tax Department) కూడా పన్ను చెల్లింపుదార్లకు తెలియజేసింది.  ఆదాయపు పన్ను చట్టం - 1961 ప్రకారం మినహాయింపు పొందిన కేటగిరీలోకి వచ్చే పాన్ కార్డ్‌హోల్డర్లు తమ పాన్‌ను ఆధార్‌ నంబర్‌తో లింక్‌ చేయాల్సిన అవసరం లేదు, ఆ వర్గాలకు మినహాయింపు ఇచ్చారు. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాల్సిన అవసరం లేని వ్యక్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.


వీరికి పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి కాదు (PAN Aadhaar link is not compulsory)
2017 మే నెలలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, పాన్ - ఆధార్ లింక్ చేయాల్సిన అవసరం నుంచి కొన్ని వర్గాలకు మినహాయింపు ఇచ్చారు. ఈ వర్గాలలోకి వచ్చే పౌరులు ఎవరంటే..


అసోం, మేఘాలయ, జమ్ము & కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు
ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం నాన్ రెసిడెంట్
గత సంవత్సరం నాటికి 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులు
భారతదేశ పౌరులు కాని వ్యక్తులు


ఒక్క SMS ద్వారా పాన్ - ఆధార్‌ లింక్ చేయవచ్చు
మీరు ఇప్పటి వరకు మీ పాన్‌ ఆధార్‌ నంబర్‌తో లింక్ చేయనట్లయితే, ఇప్పటికైనా లింక్‌ చేయండి. దీనివల్ల కొన్ని ఇబ్బందులు మీకు తప్పుతాయి. పాన్‌ - ఆధార్‌ నంబర్‌ లింక్‌ చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ స్టెప్స్‌ను అనుసరించడం ద్వారా ఈ ప్రక్రియను మీరు సులభంగా పూర్తి చేయవచ్చు.


ఆన్‌లైన్ ప్రక్రియలో.. ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ incometaxindiaefiling.gov.in ని సందర్శించండి. ఈ వెబ్‌సైట్‌ హోమ్‌ పేజీలోనే పాన్‌-ఆధార్‌ లింక్‌ కోసం ఒక ఆప్షన్‌ కనిపిస్తుంది. దాని ద్వారా మీ పాన్‌ను ఆధార్‌ నంబర్‌తో లింక్ చేయవచ్చు.
SMS ద్వారా కూడా మీరు మీ పాన్ - ఆధార్‌ నంబర్‌ను అనుసంధానించవచ్చు. ఇందుకోసం.. మీ మొబైల్‌ నంబర్‌ నుంచి UIDPAN < SPACE > < 12 ఆధార్ నంబర్‌ > < SPACE > < 10 డిజిట్స్‌ PAN> ఫార్మాట్‌లో 567678 కు లేదా 56161 కు SMS పంపాలి.
ఆఫ్‌లైన్ ప్రక్రియలోనూ మీరు ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. మీ పాన్‌ను ఆధార్‌ నంబర్‌తో లింక్ చేయడానికి మీరు మీ సమీపంలోని పాన్ సేవ కేంద్రాన్ని లేదా ఆధార్ సేవ కేంద్రాన్ని సందర్శించవచ్చు. అక్కడి వాళ్లు మీ రెండు కార్డ్‌ నంబర్లను అనుసంధానిస్తారు.