Bank Loan Repayment: ఈ రోజుల్లో, చాలా మంది ప్రజలు ఏదైనా ఖరీదైన వస్తువును కొనుగోలు చేసినప్పుడు, ఆ మొత్తం డబ్బును ఒకేసారి చెల్లించకుండా ఈఎంఐ పద్ధతిని ఎంచుకుంటున్నారు. అయితే, EMI చెల్లించేప్పుడు చాలామంది ఒక మిస్టేక్ చేస్తున్నారు. ఆ పొరపాటు ఏంటో తెలుసుకుంటే, భారీ నష్టాన్ని నివారించవచ్చు.
EMI చెల్లింపుల్లో అందరూ చేస్తున్న తప్పు ఏంటి?
మీరు ఏదైనా వస్తువును వాయిదా చెల్లింపుల పద్ధతిలో (EMI Mode) కొనుగోలు చేస్తే, EMI మొత్తం కట్ అయ్యే తేదీ నాటికి మీ ఖాతాలో డబ్బు ఉండేలా జాగ్రత్త పడాలి. మీరు అన్ని EMIలను గడువులోగా చెల్లించి, ఒక్క EMIని కేవలం ఒక్క రోజు ఆలస్యం చేసినా కూడా బ్యాంక్/రుణదాత మీపై కరుణ చూపదు. EMI ఆలస్యమైనందుకు జరిమానా విధిస్తుంది. ఇది ఇక్కడితో ఆగదు, మీ క్రెడిట్ స్కోర్ (Credit Score) కూడా ప్రభావితమవుతుంది. భవిష్యత్తులో, మీరు ఏదైనా రుణం తీసుకోవడానికి బ్యాంక్‌కు వెళ్లినప్పుడు, క్రెడిట్ స్కోర్ ఎఫెక్ట్ అప్పుడు కనిపిస్తుంది. గతంలో మీరు నిర్దిష్ట సమయానికి EMI చెల్లించలేదంటూ, బ్యాంక్‌లు మిమ్మల్ని చిన్నచూపు చూస్తాయి, లోన్ ఇవ్వకపోవచ్చు. కాబట్టి.. మీరు ఎప్పుడు ఏ వస్తువు కొన్నా, మీ జీతం వచ్చే తేదీ తర్వాత EMI కట్ అయ్యే తేదీ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.
ఉదాహరణకు... మీ జీతం 1-5 తేదీల మధ్య వస్తే, 08వ తేదీన మీ EMI కట్ అయ్యేలా చూసుకోవాలి. దీని వల్ల ప్రయోజనం ఏంటంటే, ఏదైనా కారణం వల్ల మీ జీతం రెండు, మూడు రోజులు ఆలస్యమైనా మీ EMI ల్యాప్స్ కాదు. అదే సమయంలో, మీరు జీతం తేదీ నుంచి చాలా ఎక్కువ రోజుల తర్వాత EMI తేదీని నిర్ణయించుకుంటే, ఆ సమయానికి మీ ఖాతాలోని డబ్బు అయిపోవచ్చు. అప్పుడు కూడా మీ EMI మిస్ అయ్యే ప్రమాదం ఉంది.
EMI ల్యాప్స్ అయితే ఏమి జరుగుతుంది?
మీరు EMIని మిస్ చేస్తే ఎంత నష్టం జరుగుతుందో ఒక వాస్తవ ఉదాహరణతో తెలుసుకుందాం. ET బ్యూరో రిపోర్ట్ ప్రకారం, ఇటీవల ఒక వ్యక్తి తన హోమ్ లోన్ EMIని చెల్లించడంలో ఒక రోజు ఆలస్యం చేసాడు. దాని వల్ల, అతని హోమ్ లోన్ & టాప్-అప్ లోన్ చెల్లింపు ప్రభావితమైంది. అతని సిబిల్ స్కోర్ (CIBIL Score) 799 నుంచి 772కు తగ్గింది. అతని ఎక్స్‌పీరియన్ స్కోర్ (Experian Score, ఇది కూడా సిబిల్ స్కోర్ లాంటిదే) కూడా 10 పాయింట్లు తగ్గింది.
వడ్డీ కూడా ప్రభావితం
మీరు మీ EMIని సకాలంలో చెల్లించకపోతే లేట్ ఫీజ్ చెల్లించడం, క్రెడిట్ స్కోర్ ప్రభావితం కావడమే కాదు.. భవిష్యత్‌లో తీసుకోబోయే లోన్ వడ్డీ రేటుపైనా ఆ ఎఫెక్ట్ పడుతుంది. ఉదాహరణకు.. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి హోమ్ లోన్ టాప్-అప్ తీసుకోవాలనుకుంటే, మీ సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే, మీకు 9.10 శాతం వడ్డీ రేటుతో లోన్ దొరుకుతుంది. అయితే, EMI చెల్లింపును ఆలస్యం చేయడం వల్ల మీ సిబిల్ స్కోర్ 750 కంటే తక్కువగా ఉంటే, మీరు అదే హోమ్ లోన్ టాప్-అప్‌ను 9.30 శాతం వడ్డీ రేటుతో తీసుకోవాల్సి వస్తుంది.
మరో ఆసక్తికర కథనం: మళ్లీ పరుగు మొదలు పెట్టిన పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ