National Pension System: సీనియర్ సిటిజన్లకు ఉద్యోగం/వ్యాపారం/వృత్తి పనుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా క్రమం తప్పకుండా గౌరవనీయమైన ఆదాయం అందిస్తుంది 'నేషనల్ పెన్షన్ సిస్టమ్' (NPS). ఈ స్కీమ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను మాత్రమే కాదు, ఆదాయ పన్నును కూడా ఆదా (Income tax saving option) చేస్తుంది. ఇన్‌కమ్ టాక్స్ ఆదా చేయడానికి NPSలో పెట్టుబడి పెట్టాలని వివిధ బ్యాంకులు తమ ఖాతాదార్లకు సూచిస్తుంటాయి. ఇది, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే వ్యవస్థ కాబట్టి, ఇందులో పెట్టిన పెట్టుబడికి ఎలాంటి రిస్క్ ఉండదు.
జాతీయ పింఛను పథకం (NPS) ప్రయోజనాలేంటి?
18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఏ భారతీయుడు అయినా ఈ పథకం కింద పెట్టుబడి పెట్టవచ్చు. చందాదారుకు 60 సంవత్సరాలు రాగానే, అప్పటి వరకు పెట్టిన మొత్తం పెట్టుబడిలో 60 శాతం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాలి. యాన్యుటీ ప్లాన్ నుంచి ప్రతి నెలా పెన్షన్ రూపంలో డబ్బు తీసుకోవచ్చు. దీంతోపాటు NPS పెట్టుబడులకు ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, సెక్షన్ 80CCD కింద కలిపి రూ.2 లక్షల వరకు టాక్స్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు.
కనీస పెట్టుబడి పరిమితి
నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద టైర్-I, టైర్-II ఖాతాలు తెరిచే వీలుంటుంది. టైర్-1 కింద కనీసం రూ.500 తక్కువ కాకుండా, టైర్-2 కింద కనీసం రూ.1000 తక్కువ కాకుండా ఇన్వెస్ట్ చేయవచ్చు. టైర్-1 అకౌంట్స్‌కు మాత్రమే ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది, టైర్-2లోని పెట్టుబడులకు ఈ వెసులుబాటు ఉండదు.
టైర్-I ఖాతాలో పెట్టిన పెట్టుబడులకు ఆదాయపు పన్ను సెక్షన్ 80CCD (1B) కింద 50 వేల రూపాయల వరకు, 80C కింద 1.5 లక్షల రూపాయల వరకు రాయితీ పొందవచ్చు.
ఆధార్‌తో NPS ఖాతాను ఎలా తెరవాలి?
ముందుగా, NSDL enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html వెబ్‌సైట్‌కి వెళ్లండి.
రిజిస్ట్రేషన్ బటన్ మీద క్లిక్ చేసి, ఆ తర్వాత రిజిస్టర్డ్ విత్ ఆధార్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి. ఆ తర్వాత, మీ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేయడం ద్వారా మొబైల్ నంబర్‌ను వెరిఫై చేయండి.
ఆధార్‌లో ఉన్న మీ సమాచారం ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ అవుతుంది.
ఇప్పుడు, స్కాన్ చేసిన సంతకం, మీ ఫోటోను అప్‌లోడ్ చేయండి.
నగదు చెల్లింపు తర్వాత, మీ NPS ఖాతా ఓపెన్ అవుతుంది.
NPS ఖాతా నుంచి డబ్బు డ్రా చేసే రూల్స్
ఖాతాదారుకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత, అప్పటి వరకు పోగేసిన మొత్తంలో కనీసం 40% యాన్యుటీలో పెట్టుబడి పెట్టాలి. 60% మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ 60% మొత్తాన్ని 75 ఏళ్ల వయస్సు వరకు ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. మొత్తం కార్పస్ 5 లక్షల లోపు ఉంటే, 40% యాన్యుటీ రూల్‌తో సంబంధం లేకుండా మొత్తం డబ్బును వెనక్కు తీసుకోవచ్చు. ఒకవేళ, పెట్టుబడిదారుకు 60 ఏళ్ల వయస్సు రాకుండానే డబ్బులు విత్‌డ్రా చేయాల్సిన పరిస్థితి వస్తే, అందుకు కూడా వెసులుబాటు ఉంది. అయితే, ఖాతాలో ఉన్న కార్పస్‌లో 20% మొత్తాన్ని మాత్రమే విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుంది.
ఖాతాదారుకు 60 ఏళ్ల వయస్సు రాకముందే NPS అకౌంట్ నుంచి డబ్బును వెనక్కు తీసుకోవాలనుకున్న సందర్భంలో, అప్పటి వరకు ఉన్న కార్పస్ 2.5 లక్షల రూపాయలకు మించకపోతే, ఆ మొత్తాన్ని పూర్తిగా విత్‌డ్రా చేసుకోవచ్చు. యాన్యుటీలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇవాళ్టి రేట్లివి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial