Year Ender 2025: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) తో అనుబంధం ఉన్న పెట్టుబడిదారులకు 2025 ఏడాది అనేక విధాలుగా ప్రత్యేకంగా నిలిచింది. పదవీ విరమణ ప్రణాళికపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తద్వారా ప్రజలు తమ ఫ్యూచర్ కోసం మరింత నమ్మకమైన, మెరుగైన ఎంపికను ఎంచుకోవచ్చు.
ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం, పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ PFRDA NPS లో అనేక ముఖ్యమైన మార్పులు చేశాయి. ఈ పథకాన్ని మరింత సురక్షితంగా, సరళంగా మార్చడమే వీటి లక్ష్యం అని స్పష్టం చేసింది. ఈ సంవత్సరం జరిగిన కొన్ని ముఖ్యమైన మార్పుల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
1. NPS లో 100% ఈక్విటీ పెట్టుబడికి ఛాన్స్
ప్రైవేట్ రంగ ఉద్యోగులు, పెట్టుబడిదారుల కోసం అక్టోబర్ 1, 2025 నుండి NPS లో కొత్త డిపాజిట్లను 100 శాతం ఈక్విటీలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అంతకుముందు ఈ పరిమితి 75 శాతంగా ఉండేది.
100% ఈక్విటీలో పెట్టుబడి దీర్ఘకాలంలో అధిక రాబడిని కోరుకునే వారు, దాని కోసం అధిక రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న పెట్టుబడిదారులకు ఈ నిర్ణయం మంచిది.
2. పదవీ విరమణ విత్‌డ్రా నియమాలలో మార్పు
ఇప్పుడు NPS నుండి పదవీ విరమణ సమయంలో మీ మనీ ఉపసంహరించుకునే నియమాలు గతంలో కంటే సులభతరం అయ్యాయి. గతంలో మొత్తంలో కనీసం 40 శాతం యాన్యుటీలో పెట్టుబడి పెట్టడం తప్పనిసరి. కొత్త నిబంధనల ప్రకారం, అనేక సందర్భాల్లో ఇది 20 శాతానికి తగ్గించారు.
దీని అర్థం ఇప్పుడు పెట్టుబడిదారులు తమ డిపాజిట్ చేసిన మొత్తంలో 80 శాతం వరకు ఒకేసారి లేదా వాయిదాల వారీగా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇది ఆ ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత డబ్బు ప్రణాళికను సులభతరం చేస్తుంది.
3. కేంద్ర ఉద్యోగులకు కొత్త పెట్టుబడి ఎంపికలు
ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల కోసం NPS లో పెట్టుబడికి కొత్త ఎంపికలను చేర్చింది. ఇప్పుడు ఉద్యోగులు LC75 మరియు బ్యాలెన్స్‌డ్ లైఫ్ సైకిల్ ఫండ్ లో కూడా పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పించింది. ఈ పథకంలో వయస్సుతో పాటు ఈక్విటీ రిస్క్ తగ్గుతుందని ఉద్యోగులు భావిస్తున్నారు. దీనివల్ల పదవీ విరమణ సమయానికి ఈ పెట్టుబడి మరింత సురక్షితంగా మారుతుంది.
4. గిగ్ వర్కర్లను NPS తో అనుసంధానించే చొరవ
వివిధ కంపెనీలలో పనిచేసే గిగ్ వర్కర్లను NPS తో అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. తద్వారా అసంఘటిత రంగంలో పనిచేసే వారికి కూడా పదవీ విరమణ సమయంలో ఆర్థిక భద్రత లభిస్తుంది.
5. నిష్క్రమణ సమయంలో ఎక్కువ సౌలభ్యం
కొత్త నిబంధనల ప్రకారం, NPS నుండి వైదొలగే సమయంలో ఇప్పుడు 80% వరకు మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో పెట్టుబడిదారులకు 100 శాతం మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. ఇది పదవీ విరమణ సమయంలో డబ్బు వినియోగం విషయంలో ఎక్కువ స్వేచ్ఛను ఇచ్చింది.