Mahila Samman Savings Certificate: ఏప్రిల్ 1, 2023 నుంచి, మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు పథకం 'మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్' (MSSC). ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన, పెట్టుబడి పెట్టబోతున్న వాళ్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ పథకం ద్వారా సంపాదించే వడ్డీపై TDS చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే, ఈ పథకం ద్వారా అందే ప్రతి పైసా పెట్టుబడిదారు చేతికి వస్తుంది. దీనికి బదులుగా, వడ్డీ ఆదాయం ఖాతాదారు ఆదాయానికి యాడ్ అవుతుంది. ఆమె, ఆదాయ పన్ను స్లాబ్ రేట్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) దీనిపై స్పష్టతనిస్తూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.
రూ.40,000 మించకపోతే TDS చెల్లించాల్సిన అవసరం లేదు
CBDT నోటిఫికేషన్‌లో ఉన్న సమాచారం ప్రకారం, మహిళ సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్‌లో పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయం సంవత్సరానికి రూ. 40,000 మించకపోతే, దానిపై TDS చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక మహిళ ఈ పథకంలో రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే, 7.5 శాతం వడ్డీ రేటు ప్రకారం మొదటి ఏడాది రూ. 15,000 వడ్డీ ఆదాయం వస్తుంది. రెండో ఏడాదికి రూ. 32,000 వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ ఆదాయం సంవత్సరానికి రూ. 40,000 పరిమితి కంటే తక్కువగా ఉంది కాబట్టి TDS నియమం వర్తించదు.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల ఆ ఖాతాదారుకు ఎలాంటి ఆదాయ పన్ను ప్రయోజనం ఉండదని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కిందకు వచ్చే పెట్టుబడుల్లోకి దీనిని చేర్చలేరు. కాబట్టి ఆదాయ పన్ను మినహాయింపు రాదు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఈ సంవత్సరం ఫిబ్రవరి 1న సమర్పించిన బడ్జెట్‌లో, మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఏప్రిల్ 1, 2023 నుండి ప్రారంభమైంది. ఈ ప్లాన్ ప్రకారం, రెండేళ్ల కాల పరిమితితో ఈ పథకంలో మహిళలు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకంలో 7.5 శాతం వడ్డీని పొందుతారు. మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం కింద మహిళలు మాత్రమే ఖాతాలను తెరవగలరు. మైనర్ బాలిక పేరిట ఖాతా ప్రారంభించాలంటే సంరక్షకులు ఖాతా తెరవవచ్చు. మహిళ సమ్మాన్ సర్టిఫికెట్ యోజనలో పెట్టుబడి పెట్టడానికి మార్చి 31, 2025 వరకు అవకాశం ఉంది. ఈ పథకంలో ఒక మహిళ లేదా మైనర్ బాలిక కనిష్టంగా రూ. 1,000 నుంచి గరిష్టంగా రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. పథకంలో పెట్టుబడిదార్లకు సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ ఇస్తారు. ప్రతి త్రైమాసికం తర్వాత వడ్డీ మొత్తాన్ని అదే ఖాతాకు బదిలీ చేస్తారు.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం రెండేళ్ల కాల గడువు (మెచ్యూరిటీ) తర్వాత ఫారం-2 దరఖాస్తును పూరించాలి. దీంతో, ఆ డబ్బు మొత్తం ఖాతాదారుకి ఇస్తారు. ఈ పథకం వ్యవధిలో ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత, ఖాతాదారు తన డిపాజిట్ మొత్తంలో 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఖాతాదారు మైనర్ బాలిక అయితే, ఫారం-3ని పూరించి, పథకం ద్వారా వచ్చిన నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: పోయిన ఫోన్‌ను కనిపెట్టే సంచార్ సాథి పోర్టల్‌ను ఉపయోగించడం ఎలా?