Multibagger share Massive rally in Oil India makes it a multibagger in one year : సాధారణంగా ప్రభుత్వరంగ కంపెనీల షేర్లు ఎక్కువగా పెరగవు! మిగతా వాటితో పోలిస్తే షేర్ల ధరల్లో పెద్దగా మార్పుండదు. ఎక్కువగా గ్రోత్ కనిపించదు. ఆయిల్ ఇండియా (Oil India) మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఏడాదిలోనే 100 శాతానికి పైగా రాబడి ఇవ్వడంతో ఇన్వెస్టర్లు పండగ చేసుకుంటున్నారు. ఈ మల్టీ బ్యాగర్‌ను చూసి మురిసిపోతున్నారు.
ఆయిల్ ఇండియా షేరు (Oil India Share Price) గురువారం రూ.282 వద్ద మొదలైంది. మధ్యాహ్నం రూ.306 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 18 రూపాయిల లాభంతో 298 వద్ద ముగిసింది. మే 30 నుంచి ఈ షేరు ధర తగ్గేదే లే! అన్నట్టుగా పైపైకి వెళ్తోంది. ఆ రోజు రూ.224గా ఉన్న షేరు 8 రోజుల్లోనే రూ.297కు చేరుకుంది. ఇంకా చెప్పాలంటే రూ.305 వద్ద గరిష్ఠ స్థాయిని అందుకుంది. మే 27న కంపెనీ విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలు బాగున్నాయి. ముడి చమురు ధరల వల్ల మార్జిన్ మనీ పెరిగింది. దాంతో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. బ్రోకింగ్ కంపెనీలు రూ.305 టార్గెట్ ఇవ్వగా ఇప్పటికే దానిని అందుకుంది.
'సాధారణంగా మా మార్జిన్లు బాగుంటాయి. ఉక్రెయిన్ యుద్ధం వల్ల లాభదాయకత ఇంకా పెరిగింది. ఎందుకంటే యుద్ధం వల్ల డీజిల్ స్పెడ్ పెరిగింది. మాది సహజంగానే డీజిల్ రిఫైనరీ. హైడ్రోక్రాకర్ సైతం ఉంది. దాంతో డీజిల్ ఉత్పత్తిని మరింత పెంచాం. ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి రెండు నెలల్లో రాబడి మరింత మెరుగ్గా ఉంటుంది' అని ఆయిల్ ఇండియాకు చెందిన నుమలిగఢ్ రిఫైనరీ ఎండీ భాస్కర్ జ్యోతి ధీమా వ్యక్తం చేశారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.