Multibagger In Making Down 50 percent Rakesh Jhunjhunwala stock may deliver Up to 140% Return: : ఈక్విటీ మార్కెట్లన్నీ ఊహించని విధంగా పతనం అవుతున్నాయి! లక్షల కోట్ల సంపద చూస్తుండగానే ఆవిరవుతోంది. ఇలాంటి తరుణంలో ఎవరైనా ఏమనుకుంటారు! ఒక్క మల్టీ బ్యాగర్‌ స్టాక్‌ దొరికితే ఎంత బాగుంటుంది అనే కదా!! మీరూ అలాగే అనుకుంటే ఇది మీ కోసమే!


ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా (Rakesh Jhunjhunwala) పెట్టుబడి పెట్టిన ఓ కంపెనీ మల్టీ బ్యాగర్‌ రిటర్న్స్‌ ఇవ్వబోతోందని బ్రోకరేజ్‌ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 52 వారాల గరిష్ఠం నుంచి 52 శాతం పడిపోయిన జుబిలంట్‌ ఇంగ్రెవియా (Jubilant Ingrevia) షేరు ధర మళ్లీ భారీగా పెరగనుందని ఎడిల్‌వేస్‌ సెక్యూరిటీస్‌ నివేదిక తెలిపింది.


జుబిలంట్‌ ఇంగ్రెవియా షేరు ధర బుధవారం రూ.7.65 లాభంతో రూ.448 వద్ద కొనసాగుతోంది. ఉదయం రూ.440 వద్ద ఓపెనైంది. రూ.434 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకుంది. రూ.449 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఈ షేరు ధర 142 శాతం పెరిగి రూ.1006 చేరుతుందని ఎడిల్‌వేస్‌ అంచనా వేసింది. ఏంజిల్‌ వన్‌ సైతం ఈ షేరు విలువ రెట్టింపు అవుతుందని, రూ.837 టార్గెట్‌గా ఇచ్చింది.


స్పెషాలిటీ కెమికల్స్‌, నూట్రిషన్‌, హెల్త్‌ బిజినెస్‌లో జుబిలంట్‌ ఇంగ్రెవియాకు మంచి పేరుంది. లైఫ్‌ సైన్సెస్‌ కెమికల్స్‌ నుంచి 50 శాతం ఆదాయం వస్తుంది. స్పెషాలిటీ కెమికల్స్‌, నూట్రిషన్‌ ద్వారా 32, హెల్త్‌ సొల్యూషన్స్‌ విభాగం నుంచి 18 శాతం రాబడి లభిస్తోంది. పైరిడైన్‌ బీటా, విటమిన్‌ బి3 ఉత్పత్తిలో ఈ కంపెనీ టాప్‌-2లో కొనసాగుతోంది.


జుబిలంట్‌ ఇంగ్రెవియాలో బడా ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా, ఆయన సతీమణి రేఖాకు 4.7 శాతం వాటా ఉంది. మంగళవారం నాటికి ఆ వాటా విలువ రూ.326 కోట్లు కావడం. కంపెనీని విస్తరిస్తుండటంతో రాబోయే 3-4 ఏళ్లలో తమ ఆదాయం రెట్టింపు అవుతుందని యాజమాన్యం బలంగా విశ్వసిస్తోంది. స్పెషాలిటీ కెమికల్స్‌ విభాగంలో వృద్ధి ఉండటంతో ఎబిటా మార్జిన్‌, ఆర్‌వోసీఈ మెరుగవుతుందని నమ్మకంగా ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.