MSSC Scheme: 


మహిళలకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (BOI) గుడ్‌న్యూస్‌ చెప్పింది. మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ స్కీమ్‌ (MSSC)ను డిపాజిట్లు చేసుకుంటున్నామని ప్రకటించింది. దేశంలో ఈ పథకం కింద డిపాజిట్లు సేకరిస్తున్న తొలి బ్యాంకు తమదేనని వెల్లడించింది.


బ్యాంకుల్లో తొలిసారి


దేశంలోని అన్ని శాఖల్లో మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ సేవలు అందిస్తున్నామని బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో రజనీశ్‌ కర్ణాటక తెలిపారు. ఈ పథకాన్ని ఆవిష్కరించిన మొదటి బ్యాంకు తమదేనని పేర్కొన్నారు. ఇకపై తమ బ్యాంకులో అకౌంట్లు తెరవొచ్చని వెల్లడించారు. 2023-24 బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మహిళా సమ్మాన్‌ పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేవలం రెండేళ్ల కాలపరిమితి డిపాజిట్లకు ఎక్కువ వడ్డీచెల్లిస్తామని పేర్కొన్నారు.


ఏంటీ పథకం?


మహిళా సమ్మాన్ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ స్కీమ్‌లో రెండేళ్ల కాలానికి మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. వెయ్యి రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు డిపాజిట్‌ చేయొచ్చు. ఈ డబ్బును ఏకమొత్తంగా జమ చేయాలి. విడతల వారీగా కుదరదు. ఈ స్కీమ్‌ కింద సింగిల్‌ అంకౌంట్‌ మాత్రమే తెరవగలరు. జాయింట్‌ అకౌంట్‌కు వీలు లేదు. అయితే మూడు నెలల వ్యవధిలో ఎన్ని డిపాజిట్లైనా చేయొచ్చు. కానీ పరిమితి రూ.2 లక్షలకు మించొద్దు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్‌ స్కీమ్‌పై 7.5 శాతం వార్షిక వడ్డీని చెల్లిస్తున్నారు. ఈ వడ్డీని మూడు నెలలకు ఒకసారి ఖాతాలో డిపాజిట్‌ చేస్తారు. 


డబ్బు విత్‌డ్రాకు అవకాశం


ఈ పథకంలో పెట్టుబడి పెడితే సంవత్సరానికి 7.5% వడ్డీ వస్తుంది. పోస్టాఫీస్‌కు వెళ్లి ఫామ్‌-1 నింపి అకౌంట్‌ తీయాలి. మెచ్యూరిటీ సమయంలో మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి ఫామ్‌-2 నింపాలి. మెచ్యూరిటీ వ్యవధికి ముందు, అంటే రెండేళ్లు పూర్తి కాకుండానే డబ్బు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఖాతా తెరిచిన ఒక సంవత్సరం తర్వాత కొంత మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చు. అయితే ఖాతాలో జమ చేసిన మొత్తంలో 40 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు.


Also Read: అద్దెకు ఉంటున్నారా! టెనెంట్‌గా ఈ హక్కులు మీకున్నాయని తెలుసా!


టీడీఎస్‌ లేదు


మహిళా సమ్మాన్‌ యోజన మెచ్యూరిటీ వ్యవధి 2 సంవత్సరాలు. కానీ, అనుకోని సందర్భాల్లో ఖాతాను ముందుగానే క్లోజ్‌ చేయవచ్చు. ఉదాహరణకు.. ఖాతాదారు మరణించినప్పుడు లేదా ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు నిర్ధరణ అయినా ఖాతా రద్దు చేసుకోవచ్చు. ఇందుకు అవసరమైన డాక్యుమెంట్లు సబ్మిట్‌ చేయాలి. ఖాతా తెరిచిన 6 నెలల తర్వాత ఎటువంటి కారణం లేకుండా కూడా క్లోజ్‌ చేయవచ్చు. అప్పుడు వడ్డీ రేటు 2 శాతం నుంచి 5.5 శాతం వరకు మాత్రమే లభిస్తుంది. ఈ స్కీమ్‌లో లభించే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు ఏమీ లేదు. అయితే టీడీఎస్‌ కత్తిరించడం లేదు. అంటే మొత్తం వడ్డీ తీసుకున్నాక.. ఆదాయపన్ను శ్లాబులను బట్టి తర్వాత పన్ను చెల్లించాల్సి ఉంటుంది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial  


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.