Woman Saving Scheme: 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రతిపాదనల్లో, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మహిళల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. మహిళలకు ప్రయోజనం చేకూర్చే ఆ పథకం పేరు మహిళా సమ్మాన్ బచత్ పత్ర్‌ (Mahila Samman Saving Certificate లేదా MSSC). ఈ స్కీమ్‌ కోసం పోస్టాఫీసులో ఖాతా తెరవవచ్చు. ఇది చిన్న మొత్తాల పొదుపు పథకం.


మహిళల కోసం అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. వాటిలో ఒకటి సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana లేదా SSY) ఒకటి. ఇది కూడా దేశవ్యాప్తంగా మంచి ఆదరణ దక్కించుకున్న పథకం.


మహిళ సమ్మాన్ బచత్ పత్ర యోజన - సుకన్య సమృద్ధి యోజన మధ్య తేడా ఏంటి?, ఈ రెండు పథకాల్లో ఒకదానిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఏ స్కీమ్ ఉత్తమం?, ఏ స్కీమ్‌లో ఎక్కువ వడ్డీ లభిస్తుంది?, దేనివల్ల ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి? ఈ వివరాలన్నీ ఇప్పుడు  తెలుసుకుందాం.


మహిళా సమ్మాన్ బచత్‌ పత్ర యోజన ‍‌(Mahila Samman Bachat Patra Yojana)
మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన అనేది ఒక స్వల్పకాలిక పథకం, దీనిలో మీరు మీ డబ్బును రెండేళ్ల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం 1 ఏప్రిల్ 2023 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో వార్షిక ప్రాతిపదికన 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకం FD లాంటిది. దీనిలో, తక్కువ కాల వ్యవధి పెట్టుబడి మీద మంచి వడ్డీని పొందవచ్చు. దీనితో పాటు, ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి ఎటువంటి వయోపరిమితిని నిర్ణయించలేదు. కాబట్టి, ఏ వయస్సులో ఉన్న బాలికలు లేదా మహిళలైనా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. పథకం మధ్యలో మీకు డబ్బు అవసరమైనతే పాక్షిక ఉపసంహరణకు కూడా అనుమతి ఉంటుంది.


సుకన్య సమృద్ధి యోజన
సుకన్య సమృద్ధి యోజన అనేది దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. దీనిలోనూ ఆడపిల్లల కోసం మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఈ పథకం కింద, సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో జమ చేసిన మొత్తంపై 7.6 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందులో ప్రతి సంవత్సరం కనీసం రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత, ఆ ఖాతా నుంచి పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని ఆమె పొందుతుంది. 21 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాత మొత్తం డబ్బును వెనక్కు తీసుకోవచ్చు.


MSSC - SSY మధ్య వ్యత్యాసం
మహిళా సమ్మాన్ బచత్ పత్ర & సుకన్య సమృద్ధి యోజన - ఈ రెండు పథకాలు మహిళల కోసమే ప్రత్యేకంగా రూపొందించినా, ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మహిళా సమ్మాన్ బచత్ పత్రలో ఏ మహిళ అయినా పెట్టుబడి పెట్టవచ్చు, అయితే, SSYలో బాలికలు మాత్రమే పెట్టుబడి పెట్టే సౌకర్యం ఉంది. మహిళా సమ్మాన్ బచత్ పత్ర అనేది స్వల్పకాలిక పథకం, దీనిలో మీరు ఏకమొత్తంలో మాత్రమే డిపాజిట్‌ చేయాలి. SSY అనేది దీర్ఘకాలిక పథకం, ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి 15 సంవత్సరాల వరకు దఫదఫాలుగా పెట్టుబడి పెడుతూ వెళ్లవచ్చు. మహిళా సమ్మాన్ బచత్ పత్రలో రూ. 2 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేయవచ్చు. SSYలో ఏడాదికి రూ. 1.5 లక్షలకు మించకుండా కొన్నేళ్ల వరకు పెట్టుబడి పెడుతూనే ఉండవచ్చు. 


మీ పాప లేదా మీ ఇంటి మహిళ కోసం కోసం స్వల్పకాలానికి ఒకేసారి పెట్టుబడి పెట్టాలి అనుకుంటే.. MSSC మంచి పథకం. మీ కుమార్తె లేదా చిన్న పాప కోసం దీర్ఘకాలం పాటు చిన్న/పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే సుకన్య సమృద్ధి యోజన ఒక మంచి ఎంపిక.