LIC Jeevan Utsav Policy Details in Telugu: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC), వివిధ వర్గాల ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటి కప్పుడు కొత్త బీమా పాలసీలను తీసుకువస్తూనే ఉంది. ఇటీవలే, LIC జీవన్ ఉత్సవ్ పేరుతో కొత్త ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది వ్యక్తిగత, పొదుపు, పూర్తి జీవిత కాలపు బీమా ప్లాన్. దీనిలో కొత్తగా తీసుకువచ్చిన అంశం... జీవితాంతం హామీతో కూడిన రాబడి (Guaranteed return). ఈ ప్లాన్ నంబర్ 871 (Plan No 871).
పాలసీ తీసుకోవడానికి ఎవరు అర్హులు? (Who is eligible to take the policy?)
8 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఎవరైనా LIC జీవన్ ఉత్సవ్ ప్లాన్‌ను కొనగోలు చేయవచ్చు. ఈ పథకం కింద.. 5-16 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత కొంత వెయిటింగ్ పిరియడ్ ఉంటుంది.
5 సంవత్సరాల ప్రీమియం టెన్యూర్‌ను ఎంచుకుంటే, ఆ తర్వాత మరో 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. 6 సంవత్సరాల కాలాన్ని ఎంచుకుంటే 4 సంవత్సరాల వెయిటింగ్ పిరియడ్ ఉంటుంది. 7 సంవత్సరాల పేమెంట్ ఆప్షన్ తీసుకుంటే వెయిటింగ్ పిరియడ్ మరో 3 సంవత్సరాలు అవుతుంది. 8-16 సంవత్సరాల కాలాన్ని ఎంచుకుంటే ఇంకో 2 ఏళ్లు వెయిట్ చేయాలి.
వెయింటింగ్ పిరియడ్ ముగిసిన నాటి నుంచి మీ పాలసీ మొత్తంలో ఏటా 10% చొప్పున LIC మీకు తిరిగి చెల్లిస్తుంది. అలా.. పాలసీదారు జీవితాంతం డబ్బు వస్తూనే ఉంటుంది. ఈ పథకం కింద, పెట్టుబడిదార్లు కనీసం రూ.5 లక్షల హామీ మొత్తాన్ని (Minimum sum assured) పొందుతారు.
పాలసీ తీసుకున్న తర్వాత... 5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాలి. దీనిని నెలకు ఒకసారి, మూడు నెలలకు, ఆరు నెలలకు, సంవత్సరానికి ఒకసారి చొప్పున చెల్లించవచ్చు. పాలసీ చెల్లింపు కాలంలో పాలసీదారు కట్టే ప్రతి 1000 రూపాయలకు 40 రూపాయల చొప్పున గ్యారెంటీడ్ అడిషన్స్‌ను (Guaranteed additions) LIC కూడా జమ చేస్తుంది.
ఎక్కువ వడ్డీ ప్రయోజనం (High interest benefit)
జీవన్ ఉత్సవ్ పథకం కింద జీవితాంతం ఆదాయం పొందడానికి రెండు ఆప్షన్లు ఉన్నాయి. అవి.. రెగ్యులర్ ఇన్‌కమ్, ఫ్లెక్సీ ఇన్‌కమ్. ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. రెగ్యులర్ ఇన్‌కమ్ ఆప్షన్‌లో ఏటా 10% డబ్బు జీవితాంతం తిరిగి వస్తుంది. ఫ్లెక్సీ ఇన్‌కమ్ ఆప్షన్ ఎంచుకుంటే, ఏటా చెల్లించే డబ్బు ఎల్‌ఐసీ వద్దే ఉంటుంది, దానిపై 5.5 శాతం చక్రవడ్డీ వస్తుంది.
డెత్ బెనిఫిట్స్ (LIC Jeevan Utsav Death Benefit)
పాలసీదారు మరణిస్తే, డెత్ బెనిఫిట్స్‌తో పాటు గ్యారెంటీడ్ అడిషన్స్‌ను ఎల్‌ఐసీ చెల్లిస్తుంది. డెత్ ఇన్సూరెన్స్ అమౌంట్ లేదా వార్షిక ప్రీమియానికి 7 రెట్ల మొత్తం.. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం నామినీకి అందుతుంది.
జీవన్ ఉత్సవ్ పాలసీపై లోన్ ఫెసిలిటీ కూడా లభిస్తుంది. ప్రీమియం చెల్లింపు ప్రారంభమైన తర్వాత రుణం తీసుకోవచ్చు. అప్పుపై చెల్లించే వడ్డీ, రెగ్యులర్ ఆదాయంలో 50% దాటకూడదు.
మరో ఆసక్తికర కథనం: ప్లే స్టోర్ నుంచి 2,500 నకిలీ లోన్ యాప్స్ రద్దు, ఇలాంటి వాటితో జాగ్రత్త