LIC IPO Two Important Things Policyholders Need To Check Before Applying For Issue : దేశ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న ఎల్‌ఐసీ ఐపీవోకు ముహూర్తం ఫిక్స్‌ అయింది. 2022, మే 4న ఇష్యూ మొదలవుతోంది. మే9న ముగియనుంది. 16న ఇన్వెస్టర్ల డీమ్యాట్‌ ఖాతాల్లో షేర్లు జమ అవుతాయి. ఆ మరుసటి రోజే మార్కెట్లో లిస్ట్ అవుతాయి.


ఎల్‌ఐసీ రూ.6 లక్షల కోట్ల విలువతో ఐపీవోకు వస్తోంది. ఇందులో 3.5 శాతం వరకే ప్రభుత్వం వాటా విక్రయిస్తోంది. రూ.20,557 కోట్లు విలువైన 22.13 కోట్ల షేర్లను మాత్రమే విక్రయిస్తోంది. షేర్ల ధరను రూ.902-949గా నిర్ణయించింది. ఒక్కో లాట్‌లో 15 షేర్లు ఉంటాయి. ఉద్యోగులకు 15.81 లక్షల షేర్లు, పాలసీ దారులకు 2.21 కోట్ల షేర్లను రిజర్వు చేశారు. రిటైల్‌ షేర్‌ హోల్డర్లు, ఉద్యోగులకు రూ.45, పాలసీహోల్డర్లకు రూ.60 వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నారు.


పాలసీ హోల్డర్లు డిస్కౌంట్‌ పొందేందుకు ఎల్‌సీఐ కొన్ని నిబంధనలు విధించింది. 2022, ఫిబ్రవరి 22లోపే ఎల్‌ఐసీ పాలసీలతో పాన్‌ను అనుసంధానం చేసుకోవాలని చెప్పింది. ఆ తర్వాత చేసిన వాళ్లు రిజర్వు పోర్షన్‌లో షేర్లు పొందేందుకు అర్హులు కారని వెల్లడించింది. 'పాలసీదారుడు సాధ్యమైనంత త్వరగా పాన్‌ వివరాలను పాలసీ రికార్డులతో అనుసంధానం చేసుకోవాలి. సెబీ వద్ద ఎల్‌ఐసీ ఐపీవో ముసాయిదా దాఖలుకు రెండు వారాల ముందు (2022, ఫిబ్రవరి 28)గా పాన్‌ అప్‌డేట్‌ చేసుకోవాలి. లేదంటే వారు రిజర్వు కోటాలో షేర్లు పొందేందుకు అర్హులు కారు' అని డ్రాఫ్ట్‌లో ఎల్‌ఐసీ తెలిపింది.


ఎల్‌ఐసీ పాలసీలతో పాన్‌ను లింక్‌ చేసుకోవడం ఇలా!



  • పేటీఎం మనీ, అప్‌స్టాక్స్‌, జెరోదా వంటి స్టాక్‌ ట్రేడింగ్‌ యాప్స్‌, కంపెనీలు పాలసీలు, పాన్‌ అనుసంధానానికి వీలు కల్పిస్తున్నాయి.

  • మొదట మీరు పాన్‌, పాలసీ కాపీలను సిద్ధంగా ఉంచుకోవాలి.

  • ఎల్‌ఐపీ ఐపీవో బటన్‌పై క్లిక్‌ చేయగానే ప్రొసీడ్‌ ఆప్షన్‌ వస్తుంది.

  • మీ పాన్‌, పుట్టిన రోజు, పాలసీ, మొబైల్‌, ఈమెయిల్‌ ఐడీ వివరాలు ఎంటర్‌ చేయాలి.

  • ఎక్కువ పాలసీలు ఉంటే 'యాడ్‌ పాలసీ' ఆప్షన్‌ క్లిక్‌ చేసి వివరాలు ఎంటర్‌ చేయాలి.

  • ఆ తర్వాత డిక్లరేషన్‌ చెక్‌బాక్స్‌ క్లిక్‌ చేయాలి. క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి.

  • అప్పుడు ఓటీపీ వస్తుంది. దానిని యాప్‌లో ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ నొక్కాలి.

  • దాంతో రిజిస్ట్రేషన్‌ సక్సెస్‌ అని వస్తుంది.


ఎల్‌ఐసీ వద్ద పాన్‌ వివరాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడం ఎలా?


మీ పాలసీ నంబర్‌, పుట్టినరోజు, క్యాప్చా ఎంటర్‌ చేస్తే ఎల్‌ఐసీలో ఈ పాన్‌ వివరాలు అప్‌డేట్‌గా ఉన్నాయో లేవో చూపిస్తుంది.