LIC Jeevan Tarun Policy: తమ పిల్లలకు మంచి విద్యను అందించి, మంచి ఎదుగుదలకు పునాది వేయాలని, వాళ్లు ఉన్నత స్థానాల్లో స్థిరపడితే చూడాలన్నది ప్రతి తల్లిదండ్రుల కోరిక. ఇందు కోసం, పిల్లల చిన్న చిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమ ఖర్చులను, అవసరాలను తగ్గించుకుని ఏదోక రూపంలో పెట్టుబడి పెట్టాలని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. దీనికి తగ్గట్లుగానే, పిల్లల పుట్టుక నుంచే పెట్టుబడి పెట్టదగిన చాలా పథకాలు ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్నాయి. ప్రతి రోజూ చిన్న మొత్తం పొదుపుతో, దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని ఆ పథకాల ద్వారా సృష్టించవచ్చు. పిల్లల ఉన్నత విద్య, పెళ్లి లేదా ఇతర అవసర సమయంలో ఆ మొత్తం మీ చేతిలోకి వచ్చేలా చూసుకోవచ్చు.


దేశంలో అతి పెద్ద జీవిత బీమా సంస్థ అయిన ఎల్‌ఐసీ కూడా, చిన్న పిల్లల భవిష్యత్‌ కోసం ఒక పాలసీని తీసుకువచ్చింది. దాని పేరు ఎల్‌ఐసీ జీవన్ తరుణ్ పాలసీ. పిల్లల కోసం ఈ పాలసీలో తీసుకొచ్చిన ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.


3 నెలల వయస్సు నుంచి పెట్టుబడి ప్రారంభం
జీవన్ తరుణ్ పాలసీలో పెట్టుబడి పెట్టడానికి మీ పిల్లల వయస్సు కనీసం 3 నెలలు - గరిష్టంగా 12 సంవత్సరాలు ఉండాలి. ఇందులో మీ బిడ్డకు 20 ఏళ్లు వయస్సు వచ్చే వరకు ప్రీమియం చెల్లించవచ్చు. అతనికి 25 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు, పాలసీకి చెందిన అన్ని ప్రయోజనాలు పొందుతాడు.


రోజుకు 150 రూపాయల పెట్టుబడి
పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు చేస్తున్న ఖర్చు ఇప్పటికే తలకు మించిన భారంగా తయారైంది. భవిష్యత్తులో అది ఇంకా పెరుగుతుంది. కాబట్టి, విద్యా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో, మీరు, జీవన్ తరుణ్ పాలసీలో ప్రతి రోజూ రూ. 150 మాత్రమే పెట్టుబడి పెట్టండి చాలు. ఏడాదికి (360 రోజుల్లో) అది రూ. 54,000 పెట్టుబడి అవుతుంది. వార్షిక ప్రాతిపదికన ఈ డబ్బును డిపాజిట్ చేయడం ద్వారా, భారీ మొత్తాన్ని మీరు సృష్టించవచ్చు.


25 ఏళ్ల పాటు కవరేజీ
మీ పిల్లల వయస్సు 12 సంవత్సరాలు అయినప్పటికీ, ఈ పాలసీ ద్వారా ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ స్కీమ్‌లో, మీరు 20 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లిస్తే 25 సంవత్సరాల పాటు కవరేజీ పొందుతారు. ఈ పథకంలో, మీరు కనిష్టంగా రూ. 75,000 నుంచి గరిష్టంగా ఎంత మొత్తమైనా బీమా మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు. 12 ఏళ్లు పైబడిన పిల్లలకు పాలసీ వ్యవధి 13 సంవత్సరాలు. ఇందులో, హామీ మొత్తం కనీసం రూ. 5 లక్షల వరకు లభిస్తుంది.


పెట్టుబడి లెక్కలు ఇవి:
మీరు రోజుకు రూ. 150 పెట్టుబడి పెట్టి, రూ. 5 లక్షల హామీ మొత్తానికి పాలసీ తీసుకుంటే... మీ వార్షిక ప్రీమియం రూ. 54,000 అవుతుంది. ఈ లెక్కన, మీ బిడ్డకు 12 సంవత్సరాల వయస్సులో కొనుగోలు చేసిన పథకంపై, అతనికి 23 సంవత్సరాలు వచ్చిన తర్వాత, మొత్తం రూ. 7.47 లక్షలు అందుతాయి. ఇందులో, 8 సంవత్సరాల్లో మీరు పెట్టిన రూ. 4,40,665. అంటే... ఈ పెట్టుబడితో పాటు మరో 3 లక్షలకు పైగా సొమ్మును మీరు తిరిగి పొందుతారు. 


ఈ పాలసీ ప్రీమియంను నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన చెల్లించవచ్చు.