Income Tax Return Filing 2024: ప్రస్తుతం, 2023-24 ఆర్థిక సంవత్సరం (FY 2024-25) లేదా 2024-25 మదింపు సంవత్సరానికి (AY 2024-25) ఆదాయ పన్ను రిటర్న్‌ల ఫైలింగ్‌ సీజన్‌ కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే ఫామ్‌-16 తీసుకున్నారు, ప్రైవేట్‌ కంపెనీలు కూడా ఇవ్వడం ప్రారంభించాయి. ఆదాయ పన్ను పత్రాల దాఖలుకు చివరి తేదీ 31 జులై 2024. ఒకవేళ ఈ గడువులోగా రిటర్న్‌ దాఖలు చేయలేకపోతే, ఆగస్టు 01 నుంచి ఆలస్య రుసుముతో కలిపి రిటర్న్‌ దాఖలు చేసే వెసులుబాటు ఉంది.


ఫారం-16 మాత్రమే సరిపోదు
ఆదాయ పన్ను పత్రాలు సమర్పించే సమయంలో తెలిసో, తెలీకో ఏ చిన్న పొరపాటు చేసినా ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి నోటీస్‌ (IT Notice) వస్తుంది. కాబట్టి, రిటర్న్‌ ఫైల్‌ చేయడానికి ముందే కొన్ని కీలక పత్రాలను క్షుణ్ణంగా క్రాస్‌ చెక్‌ చేయాలి. 


ఒక వ్యక్తికి అందే జీతభత్యాల సమాచారం మొత్తం ఫామ్‌-16లో ఉంటుంది. అయితే, బ్యాంక్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీ వంటి ఆదాయాల సమాచారం అందులో ఉండదు. జీతం కాకుండా ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయాలు ‍‌(Income from other resources) AIS & TISలో ఉంటాయి. ఒక్కోసారి ఇలాంటి ఆదాయాల గురించి టాక్స్‌పేయర్‌కు తెలీదు, లేదా మర్చిపోవచ్చు. కాబట్టి, ITR ఫైలింగ్‌ సమయంలో ఫామ్‌-16ను మాత్రమే తనిఖీ చేస్తే సరిపోదు;  AIS & TISను కూడా కచ్చితంగా చూడాలి. ఐటీఆర్ ఫైలింగ్‌ సమయంలో పారదర్శకత తీసుకురావడానికి, సెల్ఫ్‌-ఫైలింగ్‌ను సులభంగా మార్చడానికి ఆదాయ పన్ను విభాగం ఈ రెండు డాక్యుమెంట్లను ప్రవేశపెట్టింది. ఫామ్‌-16తో పాటు AIS & TISను కూడా క్రాస్‌ చెక్‌ చేయడం వల్ల ఫైలింగ్‌ సమయంలో పొరపాట్లు చేసే అవకాశాలు దాదాపుగా తగ్గుతాయి. 


AIS, TIS అంటే ఏంటి?
AIS (Annual Information Statement) అంటే వార్షిక సమాచార నివేదిక . ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక పన్ను చెల్లింపుదారు సంపాదించిన మొత్తం ఆదాయ వివరాలు AISలో ఉంటాయి. టాక్స్‌పేయర్‌కు బ్యాంక్‌ సేవింగ్స్ అకౌంట్‌ ఉంటే, మూడు నెలలకు ఒకసారి కొంత డబ్బు వడ్డీ రూపంలో అతని ఖాతాలో (Interest Income from Savings Account) జమ అవుతుంది. బ్యాంక్‌ నేరుగా ఆ డబ్బును బ్యాంక్‌ అకౌంట్‌లో డిపాజిట్‌ చేస్తుంది. ఇది చాలా తక్కువ మొత్తం కాబట్టి ఆ వ్యక్తి తెలియొచ్చు లేదా తెలీకపోవచ్చు. దీంతోపాటు.. రికరింగ్ డిపాజిట్‌ మీద వడ్డీ, ఫిక్స్‌డ్ డిపాజిట్‌ మీద వడ్డీ, సెక్యూరిటీల లావాదేవీలు, డివిడెండ్ రూపంలో అందిన డబ్బు (Income From Dividend), మ్యూచువల్ ఫండ్స్‌ నుంచి వచ్చిన మొత్తం వంటి వివరాలన్నీ AISలో ఉంటాయి. TIS (Taxpayer Information Summary) అంటే పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశం‍. AISలో ఉండే వివరాల సారాంశం TISలో ఉంటుంది. 


AIS, TIS ఎలా చూడాలి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to Download AIS/TIS?) 
ఆదాయ పన్ను ఫైలింగ్ పోర్టల్ (www.incometax.gov.in) ఓపెన్‌ చేయండి.
పాన్ నంబర్ (యూజర్‌ ఐడీ), పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వండి.
అప్పర్‌ మెనులో సర్వీసెస్‌ ట్యాబ్‌కు వెళ్లండి.
డ్రాప్‌డౌన్ మెనూ నుంచి 'Annual Information Statement (AIS)' ఎంచుకోండి.
ప్రొసీడ్ పై క్లిక్ చేయగానే ప్రత్యేక విండో ఓపెన్ అవుతుంది.
కొత్త విండోలో AIS ఆప్షన్‌ ఎంచుకోండి.
ఇక్కడ AIS, TIS రెండింటినీ డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్‌ కనిపిస్తుంది.
AIS, TISను PDF లేదా JSON ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80TTA ప్రకారం.. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వ్యక్తులకు (Individuals), హిందు అవిభాజ్య కుటుంబాలకు (HUFs) ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై రూ. 10,000 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.


సీనియర్‌ సిటిజన్లకు సెక్షన్ 80TTB వర్తిస్తుంది. ఈ సెక్షన్‌ ప్రకారం.. బ్యాంక్‌లు, పోస్టాఫీస్‌ల్లో సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ అకౌంట్‌, ఫిక్స్‌డ్ డిపాజిట్‌, రికరింగ్ డిపాజిట్‌, బాండ్‌లు/NCDలు, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS) కింద చేసే డిపాజిట్‌లు సహా వివిధ రకాల డిపాజిట్‌ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై రూ. 50,000 మినహాయింపు లభిస్తుంది.


మరో ఆసక్తికర కథనం: చాలా వస్తువుల రేట్లు 9 అంకెతో ఎందుకు ముగుస్తాయి, లాజిక్‌ ఏంటి?