Savings From Every Month Salary: ఆర్థిక భద్రత, భవిష్యత్తు ప్రణాళిక కోసం ప్రతి వ్యక్తి పొదుపును అలవాటుగా మార్చుకోవాలి. మీకు తక్కువ జీతం వస్తున్నా సరే, సరైన ప్రణాళికను మీరు ఫాలో అయితే ప్రతి నెలా మంచి మొత్తాన్ని ఆదా చేయవచ్చు. ఇలా పోగుపడిన డబ్బు అత్యవసర పరిస్థితుల్లో మీకు అండగా నిలబడడమే కాకుండా, మీ దీర్ఘకాలిక కలలను నెరవేర్చడంలోనూ సాయపడతాయి. 


కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే మీరు ప్రతి నెలా మీ జీతం నుంచి డబ్బును ఆదా చేయవచ్చు.


1. బడ్జెట్ తయారు చేసి దానికి కట్టుబడి ఉండండి
ప్రతి నెలా ఖచ్చితమైన బడ్జెట్‌తో పొదుపు ప్రారంభమవుతుంది. ముందుగా, మీ జీతాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను సిద్ధం చేయండి. ఈ బడ్జెట్ మీ ఖర్చులను ఇంటి అద్దె, యుటిలిటీ (కరెంటు, గ్యాస్‌, మొబైల్‌ ఫోన్‌ వంటివి) బిల్లులు, కిరాణా సామాగ్రి, వినోదం వంటి వివిధ వర్గాలుగా విభజిస్తుంది. మీకు స్పష్టమైన బడ్జెట్ ఉన్నప్పుడు, అదనపు ఖర్చు ఎక్కడ జరుగుతుందో మీరు సులభంగా అర్ధమవుతుంది. బడ్జెట్ తయారు చేసిన తర్వాత దానిని ఖచ్చితంగా అనుసరించాలి, అనవసరమైన ఖర్చులను తగ్గించాలి.


2. ముందుగా పొదుపును పక్కన పెట్టండి
ఇది చాలా ముఖ్యమైన సూత్రం. ఖర్చులు పోను మిగిలిన డబ్బును పొదుపు చేయడం కాకుండా, పొదుపు డబ్బును పక్కనపెట్టిన తర్వాత మిగిలిన డబ్బును ఖర్చుల కోసం వినియోగించాలి. ముందుగా, మీ జీతంలో కొంత భాగాన్ని (10% లేదా 20% వంటివి) మీ పొదుపు కోసం కేటాయించండి. అత్యవసర పరిస్థితులు లేదా పెట్టుబడుల కోసం మాత్రమే ఉపయోగించే ప్రత్యేక బ్యాంక్ ఖాతాకు ఆ డబ్బును బదిలీ చేయండి. ఈ విధంగా, సేవింగ్స్‌కు ప్రథమ ప్రాధాన్యత, ఖర్చులకు ద్వితీయ ప్రాధాన్యత ఇవ్వడం క్రమంగా మీకు అలవాటు అవుతుంది.


3. ఆటోమేటిక్ సేవింగ్స్‌
ఆటోమేటిక్‌గా పొదుపు డబ్బు కట్‌ కావడం ఒక మంచి ఆలోచన. ప్రతి నెలా పొదుపు డబ్బును పక్కన పెట్టడం మర్చిపోయే వారికి ఇదొక గొప్ప ఎంపిక. ప్రస్తుతం, అనేక బ్యాంకులు, ఆర్థిక యాప్‌లు ఈ తరహా సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇక్కడ, ప్రతి నెలా నిర్దిష్ట తేదీలో మీ నెల జీతం నుంచి మీ సేవింగ్స్ ఖాతాకు కొంత మొత్తాన్ని నేరుగా బదిలీ చేయవచ్చు. ఈ మనీ ట్రాన్స్‌ఫర్‌లో మీ ప్రమేయం ఉండదు. దీనివల్ల క్రమం తప్పకుండా పొదుపు చేయగలుగుతారు.


4. అనవసర ఖర్చులను తగ్గించుకోండి
ప్రతి నెలా అనవసరమైన ఖర్చులపైనే శ్రద్ధ పెట్టండి, అవసరమైన చోట కోతలు వేసేందుకు ప్రయత్నించండి. ఉదాహరణకు... మీరు బయట చిరుతిళ్లు, భోజనాల సంఖ్యను క్రమంగా తగ్గించండి. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు తెలివిగా వ్యవహరించండి, నిజంగా అవసరమైన వాటిని మాత్రమే కొనండి. వినోదం కోసం ఉచిత లేదా చౌక ఎంపికల కోసం వెతకండి. ఈ మార్గంలోనూ డబ్బు ఆదా అవుతుంది. ఈ చిన్నపాటి మార్పులు మీ బడ్జెట్‌పై సానుకూల ప్రభావం చూపుతాయి.


5. అత్యవసర నిధిని సృష్టించండి
మీ పొదుపులో కొంత భాగాన్ని అత్యవసర నిధి (Emergency Fund) కోసం పక్కన పెట్టడం అవసరం. ఆకస్మిక అనారోగ్యం, ఉద్యోగ నష్టం లేదా ఇతర హఠాత్‌ పరిస్థితుల్లో ఊహించని ఖర్చులను ఎదుర్కోవడానికి అత్యవసర నిధి మీకు సాయపడుతుంది. ఈ ఫండ్‌లో ఎప్పుడు చూసినా 3 నెలల నుంచి 6 నెలల జీతానికి సమానమైన డబ్బు ఉండాలి. డబ్బును తక్షణం, సులభంగా విత్‌డ్రా చేసుకునే ఖాతాలో ఈ ఫండ్‌ను ఉంచండి. గుర్తు పెట్టుకోండి.. సాధారణ ఖర్చుల కోసం ఈ ఖాతా నుంచి విత్‌డ్రా చేయవద్దు.


6. మ్యూచువల్ ఫండ్స్ లేదా SIP
పొదుపు ఖాతాలో డబ్బు మొత్తం ఉంచకుండా, మీ పొదుపులను మ్యూచువల్ ఫండ్స్ లేదా SIP (Systematic Investment Plan)లో పెట్టుబడి పెట్టండి. దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో సంపద కూడబెట్టడానికి SIP చాలా మంచి మార్గం. దీని ద్వారా మీరు ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్లలో నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టొచ్చు. దీని ద్వారా సాధారణ సేవింగ్స్‌ ఖాతాలో వచ్చే వడ్డీ కంటే ఎక్కువ రాబడి సాధ్యమవుతుంది. అదే సమయంలో, మీ డబ్బుపై ద్రవ్యోల్బణం ప్రభావం కూడా తగ్గుతుంది.


7. చిన్న పొదుపుతో ప్రారంభించండి
ఒకేసారి భారీ టార్గెట్‌లు పెట్టుకోకుండా, చిన్న లక్ష్యాలతో పొదుపును ప్రారంభించడం డబ్బు ఆదా చేయడానికి సులభమైన మార్గం. ఒకవేళ మీకు పెద్ద లక్ష్యం ఉంటే, దానిని చిన్న భాగాలుగా విభజించండి. ఉదాహరణకు.. మీరు ఒక సంవత్సరంలో రూ. 1 లక్ష ఆదా చేయాలనుకుంటే, ప్రతి నెలా రూ. 8,333 సేవ్‌ చేసేలా దానిని చిన్న లక్ష్యాలుగా విభజించండి. చిన్న లక్ష్యాలను సాధించడం సులభం. మీరు మీ స్మాల్‌ టార్గెట్‌ను చేరినప్పుడు, సంతృప్తితో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


మరో ఆసక్తికర కథనం: ఏకంగా రూ.1000 తగ్గిన పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ