HDFC Bank Vs SBI Senior Citizen FD Rates: మన దేశంలోని సాంప్రదాయ పెట్టుబడి మార్గాల్లో బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఒకటి. సీనియర్ సిటిజన్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, దేశంలోని అన్ని బ్యాంకులు ప్రత్యేక ఎఫ్‌డీ పథకాలను ప్రారంభించాయి. సాధారణ పౌరుల కంటే సీనియర్‌ సిటిజన్‌ పథకాలపై ఎక్కువ వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి. దేశంలోని రెండు పెద్ద బ్యాంకులు - HDFC బ్యాంక్, స్టేట్‌ బ్యాంక్‌ కూడా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను అమలు చేస్తున్నాయి. 


సీనియర్ సిటిజన్ల కోసం... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ స్కీమ్‌ను HDFC బ్యాంక్ ప్రారంభించింది. స్టేట్‌ బ్యాంక్‌ కూడా సీనియర్ సిటిజన్ల కోసం వికేర్‌ ఎఫ్‌డీ పథకాన్ని రన్‌ చేస్తోంది. 


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ స్కీమ్‌ (HDFC Bank Senior Citizen Care FD Scheme)
60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి (సీనియర్‌ సిటిజన్లు) కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌ను నడుపుతోంది. ఈ పథకం పేరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ. బ్యాంక్ ఈ పథకాన్ని 2020 నుంచి అమలు చేస్తోంది. ఈ పథకం కింద, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు బ్యాంక్ 0.50 శాతం ఎక్కువ వడ్డీతో పాటు మరో 0.25 శాతం అదనపు వడ్డీ రేటును కూడా అందిస్తోంది. అంటే.. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లకు మొత్తం 0.75 శాతం అదనపు వడ్డీ ప్రయోజనాన్ని బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తోంది. 5 నుంచి 10 సంవత్సరాల్లో మెచ్యూర్‌ అయ్యే ఎఫ్‌డీపై 7.75 శాతం వడ్డీ ఆదాయాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చెల్లిస్తోంది. రూ. 5 కోట్ల లోపు విలువైన ఎఫ్‌డీ స్కీమ్‌లకు ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే గడువును బ్యాంక్‌ 11 మే 2024 వరకు పొడిగించింది.


ఎస్‌బీఐ వికేర్‌ ఎఫ్‌డీ పథకం (SBI WeCare FD Scheme)
ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసమే ఎస్‌బీఐ వికేర్‌ ఎఫ్‌డీ పథకం స్టేట్‌ బ్యాంక్‌ ప్రారంభించింది. ఈ పథకం కింద, సీనియర్‌ సిటిజన్‌ కస్టమర్లకు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కాల పరిమితితో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను బ్యాంక్‌ అందిస్తోంది. ఈ స్కీమ్‌లో సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు (0.50 శాతం) అధిక వడ్డీ రేటు లభిస్తుంది. పదవీ విరమణ చేసిన వాళ్ల కోసం ప్రత్యేకంగా ఈ స్కీమ్‌ను స్టేట్‌ బ్యాంక్‌ డిజైన్‌ చేసింది. రిటైర్మెంట్‌ తర్వాత ఆదాయ భద్రతతో పాటు అధిక వడ్డీ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ప్రత్యేక FDలో కనీసం 5 సంవత్సరాల కాలానికి డిపాజిట్‌ చేయాలి. ఆ డిపాజిట్‌ను 5-10 సంవత్సరాల వరకు కొనసాగింవచ్చు. ఈ కాల వ్యవధిపై 7.50 శాతం వడ్డీని బ్యాంక్‌ చెల్లిస్తోంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ 30 సెప్టెంబర్ 2024. 


స్వయంగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లిగానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా యోనో యాప్‌ ద్వారా ఎస్‌బీఐ వికేర్‌ ఎఫ్‌డీ అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. రూ. 2 కోట్ల వరకు ఈ స్కీమ్‌ కింద డిపాజిట్‌ చేయవచ్చు. కొత్తగా డిపాజిట్‌ చేసే వాళ్లు, ఇప్పటికే ఉన్న డిపాజిట్‌ను రెన్యువల్‌ చేసుకునే వాళ్లు ఈ వికేర్‌ స్కీమ్‌లో జాయిన్‌ కావచ్చు. 5 సంవత్సరాల కంటే ముందే డిపాజిట్‌ను వెనక్కు తీసుకుంటే నష్టపోవాల్సి వస్తుంది.


ఈ రెండు స్పెషల్‌ స్కీమ్‌లను పరిశీలిస్తే... ఎస్‌బీఐ సీనియర్‌ సిటిజన్‌ ఎఫ్‌డీ స్కీమ్‌ కంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పెషల్‌ ఎఫ్‌డీ పథకంపై 0.25 ఎక్కువ రాబడిని పొందొచ్చు.