Types Of EPFO Pensions: ఈపీఎఫ్‌వో రూల్స్‌ ప్రకారం, ఒక సభ్యుడు EPFOకి 10 సంవత్సరాల పాటు కాంట్రిబ్యూట్‌ చేస్తే, పెన్షన్ పొందడానికి అతను అర్హుడు. సాధారణంగా, ఈపీఎఫ్‌వో సభ్యుడి 58 సంవత్సరాల వయస్సు నుంచి పెన్షన్‌ ప్రారంభమవుతుంది. కానీ, దీనికంటే ముందే కూడా పింఛను అందుకోవచ్చు. అతని కుటుంబ సభ్యులు కూడా పెన్షన్‌ తీసుకోవచ్చు.


EPFO నుంచి అందే పెన్షన్లు 7 రకాలు:


ముందస్తు పింఛను ‍‌(Early Pension)
సాధారణంగా, సభ్యుడి 58 సంవత్సరాల వయస్సు నుంచి ఈపీఎఫ్‌వో పెన్షన్ ఇస్తుంది. కానీ, అర్హుడైన ఒక సభ్యుడు 58 ఏళ్ల వయస్సు లోపులోనే పెన్షన్ తీసుకోవాలనుకుంటే, 50 సంవత్సరాల వయస్సు తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలాంటి కేస్‌ల కోసం EPFO ఒక ప్రొవిజన్‌ కూడా చేర్చింది. ముందస్తు పెన్షన్‌లో, ఈపీఎఫ్‌వో సభ్యులకు ప్రతి సంవత్సరం పెన్షన్ 4 శాతం తగ్గుతుంది. ఉదాహరణకు... ఒక సభ్యుడికి 58 సంవత్సరాల వయస్సులో రూ.10,000 పెన్షన్‌ వస్తుందనుకుందాం. అయితే, అతను 57 సంవత్సరాల వయస్సులోనే దాని కోసం క్లెయిమ్ చేస్తే, వచ్చే మొత్తం 4% తగ్గుతుంది. అంటే రూ. 9,600 పెన్షన్ వస్తుంది. ఒకవేళ అతను 56 సంవత్సరాల వయస్సులో క్లెయిమ్‌ చేస్తే, మొత్తం 8% తగ్గుతుంది రూ.9,200 పెన్షన్‌ వస్తుంది.


పదవీ విరమణ పింఛను ‍‌(Retirement pension)
సభ్యుడికి 58 ఏళ్లు నిండిన తర్వాత ఈపీఎఫ్‌వో ద్వారా వచ్చే పెన్షన్ ఇది. ఈ పెన్షన్ మొత్తం పెన్షన్ ఫండ్‌కు ఆ సభ్యుడు కాంట్రిబ్యూట్‌ చేసినదానిపై ఆధారపడి ఉంటుంది. మీకు కావాలంటే, మీ 58 సంవత్సరాల తర్వాత - 60 సంవత్సరాల వయస్సు వరకు పెన్షన్ కోసం క్లెయిమ్ చేయవచ్చు. అలాంటి సందర్భంలో, ఈపీఎఫ్‌వో సభ్యులకు ప్రతి సంవత్సరం పెన్షన్‌ 4% పెరుగుతుంది.


దివ్యాంగ పింఛను ‍‌(Disabled pension)
ఉద్యోగ సమయంలో ఒక సభ్యుడు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా దివ్యాంగుడు అయినప్పుడు ఈ పెన్షన్ ఇస్తారు. ఇలాంటి కేస్‌లో, కనీసం 10 సంవత్సరాల పాటు పెన్షన్ ఫండ్‌కు కాంట్రిబ్యూట్‌ చేయాలన్న షరతు వర్తించదు. ఒక సబ్‌స్క్రైబర్ రెండేళ్లపాటు EPSకి కంట్రిబ్యూట్ చేసినా కూడా ఈ పెన్షన్‌కు అర్హుడవుతాడు.


వితంతు లేదా పిల్లల పింఛను (Widow pension or Child pension)
ఈపీఎఫ్‌వో చందాదారు మరణించిన తర్వాత, అతని భార్య & 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇద్దరు పిల్లలు పెన్షన్‌కు అర్హులు. మూడో బిడ్డకు కూడా పింఛను వస్తుంది. అయితే, మొదటి బిడ్డకు 25 సంవత్సరాల వయస్సులో పెన్షన్ ఆగిపోయినప్పుడు, మూడో బిడ్డ పెన్షన్ ప్రారంభమవుతుంది. ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్ మరణించిన సందర్భంలో కూడా 10 సంవత్సరాల కాంట్రిబ్యూషన్‌ రూల్‌ వర్తించదు. ఒక చందాదారు ఒక సంవత్సరం పాటు విరాళం అందించినా చాలు.


అనాథ పింఛను (Orphan pension)
ఈపీఎఫ్‌వో చందాదారు భార్య కూడా మరణిస్తే, ఆ దంపతులకు చెందిన ఇద్దరు పిల్లలు ఈ పెన్షన్‌కు అర్హులు. అయితే, ఆ పిల్లలకు 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మాత్రమే ఈ తరహా పింఛను అందుతుంది.


నామినీ పెన్షన్ (Nominee pension)
ఈపీఎఫ్‌వో సభ్యుడికి జీవిత భాగస్వామి లేదా సంతానం లేకపోతే... అతను మరణించిన తర్వాత, అతని నామినీకి ఈ పెన్షన్ వస్తుంది. EPFO సభ్యుడు తన తల్లి, తండ్రి ఇద్దరినీ నామినీలుగా పెడితే, ఇద్దరికీ చెరో సగం పింఛను వస్తుంది. ఒక వ్యక్తిని మాత్రమే నా ఓమినీగా చేస్తే, పింఛను డబ్బు మొత్తం ఆ నామినీకి ఇస్తారు.


తల్లిదండ్రుల పింఛను (Dependent parents pension)
EPFO రూల్‌ ప్రకారం, చందాదారు మరణిస్తే, అతనిపై ఆధారపడిన తండ్రి పెన్షన్‌కు అర్హుడిగా మారతాడు. తండ్రి చనిపోతే, చందాదారు తల్లికి పెన్షన్ వస్తుంది. ఆమెకు జీవితాంతం పెన్షన్ వస్తుంది. ఇందుకోసం ఫామ్‌ 10D నింపాల్సి ఉంటుంది.


మరో ఆసక్తికర కథనం: NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?