Public Provident Fund vs National Pension System: ఉద్యోగం చేసే వాళ్లకు 60 లేదా 62 సంవత్సరాల తర్వాత రిటైర్‌మెంట్ ఉంటుంది. వ్యాపారస్తులైనా ఒక వయస్సు తర్వాత బిజినెస్ నుంచి రిటైర్ అవుతారు. ఈ రిటైర్మెంట్ మీరు ఊహించినదాని కంటే వేగంగా దగ్గరవుతూ ఉంటుంది. ఫ్యూచర్ కోసం ఏ ప్లాన్ లేకపోతే, తరుముకొచ్చే రిటైర్మెంట్ మిమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వదు. ఉద్యోగం/వ్యాపార వివమణ తర్వాతి జీవితం సాఫీగా సాగాలంటే 'ఉత్తమ ఆర్థిక వ్యూహం' ఉండాలి. భవిష్యత్ కోసం ఇప్పటి నుంచి చేసే "పొదుపు" ఉత్తమ ఆర్థిక వ్యూహం అవుతుంది, మీరు తెలివైనవారు అని అది అందరికీ నిరూపిస్తుంది.
రిటైర్మెంట్ తర్వాతి జీవితం కోసం మార్కెట్లో వివిధ రకాల పాలసీలు, పథకాలు, పెట్టుబడి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, భారత ప్రభుత్వం మద్దతు ఉన్న రెండు పథకాలు మాత్రం బాగా పాపులర్ అయ్యాయి. అవి.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (Public Provident Fund - PPF) & నేషనల్ పెన్షన్ సిస్టమ్ (National Pension System - NPS). నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ను 'జాతీయ పింఛను పథకం' అని కూడా పిలుస్తున్నారు. ఈ రెండు స్కీమ్స్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. వీటిలో సారూప్యతలు, భేదాలు ఏంటి, దీర్ఘకాలిక పెట్టుబడికి ఏది బెటర్ ఆప్షన్?.
భద్రత వర్సెస్ వృద్ధి (Safety Vs Growth)
PPF: సేవింగ్స్ అకౌంట్‌పై వడ్డీ తరహాలో కేంద్ర ప్రభుత్వం నుంచి హామీతో కూడిన రాబడి వస్తుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి దీని వడ్డీ రేటును ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ స్కీమ్‌లో మీ డబ్బు క్రమంగా, స్థిరంగా పెరుగుతుంది. కానీ తక్కువ వేగంతో పెరుగుతుంది.
NPS: దీనిలో పెట్టే మీ పెట్టుబడి (investment) స్టాక్ మార్కెట్‌లోకి వెళ్తుంది. కాబట్టి, ఎక్కువ రాబడికి అవకాశం ఉంటుంది, రిస్క్ కూడా అదే స్థాయిలో ఉంటుంది.
డబ్బు ఉపసంహరణ (Withdrawl of Money)
PPF: డబ్బును వెంటనే వెనక్కు తీసుకోవడానికి ఇది అంతగా అనువైనది కాదు. 15 సంవత్సరాల పాటు లాకిన్ పిరియడ్ ఉంటుంది. అయితే, ఖాతా ప్రారంభించిన 5 సంవత్సరాల తర్వాత డబ్బు తీసుకోవడానికి అనుమతి దొరుకుతుంది.
NPS: డబ్బు వెనక్కు తీసుకోవడానికి ఇది అనువైనది. అకౌంట్ స్టార్ట్ చేసిన కొంతకాలం తర్వాత కొంత మొత్తాన్ని సులభంగా తీసుకోవచ్చు. కానీ, పదవీ విరమణ ఆదాయం కోసం పెద్ద భాగం లాక్ అవుతుంది.
ఆదాయ పన్ను ప్రయోజనాలు (Income Tax Benifits)
PPF: ఈ విషయంలో ఇదే విన్నర్. మీ పెట్టుబడి, దానిపై వచ్చే వడ్డీ (interest), చివరిగా వచ్చే మొత్తంపై కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
NPS: మీ పెట్టుబడిపై పన్ను మినహాయింపు దొరుకుతుంది. అయితే, చివరిగా తీసుకునే డబ్బుపై పన్ను చెల్లించాల్సి వస్తుంది.
మెచ్యూరిటీ పిరియడ్ (Maturity Period)
PPF: ఖాతా ప్రారంభించిన 15 సంవత్సరాల తర్వాత మీ డబ్బు మొత్తాన్ని ఒకేసారి వెనక్కు తీసుకోవచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు.
NPS: 60 ఏళ్ల వయస్సు తర్వాత, అంటే పదవీ విరమణ తర్వాత, అప్పటి వరకు జమైన డబ్బులో గరిష్టంగా 60% డబ్బు మాత్రమే చేతికి వస్తుంది. కనీసం 40% డబ్బుతో తప్పనిసరిగా యాన్యుటీ ప్లాన్స్ కొనాలి. యాన్యుటీ ప్లాన్స్ నుంచి పెన్షన్ తరహాలో డబ్బు చేతికి వస్తుంది.
ఎవరు ఏది ఎంచుకోవాలి? (Who Should Choose What?)
PPF: గ్యారెంటీడ్ రిటర్న్ కోరుకునే వాళ్లకు, పన్ను మినహాయింపు ప్రయోజనం పొందాలనుకునే వాళ్లకు, డబ్బును వెనక్కు తీసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనివాళ్లకు, తక్కువ వృద్ధి ఉన్నా పెట్టుబడిలో స్థిరమైన వృద్ధిని కోరుకునేవాళ్లకు ఇది అనుకూలం.
NPS: ఎక్కువ రాబడి కోరుకునేవాళ్లకు, దీర్ఘకాలిక ప్రణాళిక (20+ సంవత్సరాలు) కోసం కొంత రిస్క్ తీసుకోగల ప్రజలు ఈ స్కీమ్‌తో సుఖంగా ఉంటారు. పదవీ విరమణ తర్వాత మొత్తం డబ్బు అవసరం లేదనుకున్న వాళ్లకు కూడా ఇది ఓకే.
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీ డబ్బుకు భద్రత, పన్ను ప్రయోజనాలు, వృద్ధి సామర్థ్యం అన్నీ ఉండాలంటే PPF & NPS రెండింటిలోనూ పెట్టుబడులు పెట్టాలి. మీరు ఎంత త్వరగా పెట్టుబడులు ప్రారంభిస్తే, అంత ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.
మరో ఆసక్తికర కథనం: ఫెడ్ ఇచ్చిన ధైర్యంతో కొత్త గరిష్టాలకు స్టాక్ మార్కెట్లు - రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్