SBI vs LIC Annuity Plan: తెలివైన ప్రతి వ్యక్తి భవిష్యత్‌ అవసరాలను ముందుగానే అంచనా వేస్తాడు. దానికి తగ్గట్లుగా తొలి అడుగు నుంచే జాగ్రత్త పడతాడు. అదే విధంగా, ఉద్యోగం ప్రారంభించిన తొలినాళ్లలోనే రిటైర్మెంట్‌ లైఫ్‌ కోసం ప్లాన్ చేయడం ప్రారంభిస్తాడు. పర్‌ఫెక్ట్‌గా ప్లాన్‌ చేస్తే, పదవీ విరమణ తర్వాత కూడా డబ్బులకు ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. యాన్యుటీ స్కీమ్‌లో (annuity scheme) పెట్టుబడి పెట్టడం ద్వారా వృద్ధాప్య జీవితం కోసం చక్కటి ఆర్థిక ప్రణాళిక రూపొందించవచ్చు. ఒకవేళ మీరు కూడా యాన్యుటీ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే, రెండు పెద్ద సంస్థల్లో ఆ అవకాశాన్ని పరిశీలించవచ్చు. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), రెండోది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).


యాన్యుటీ స్కీమ్‌ అంటే ఏంటి?
యాన్యుటీ స్కీమ్ అంటే, ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని అందుకునే పథకం. ఇది పెన్షన్‌ ప్లాన్‌ వంటిది. ఎల్‌ఐసీ, స్టేట్ బ్యాంక్ రెండూ ప్రభుత్వ రంగ సంస్థలు, ఇవి రెండూ యాన్యుటీ పథకాన్ని అందిస్తున్నాయి. ఈ రెండు స్కీమ్స్‌ పూర్తి వివరాలను అర్ధం చేసుకుంటే, దేనిని ఎంచుకోవాలో ఒక స్పష్టత వస్తుంది.


SBI యాన్యుటీ పథకం వివరాలు:
స్టేట్ బ్యాంక్ యాన్యుటీ స్కీమ్‌లో ఒకేసారి డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. తద్వారా ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెన్షన్‌ లాగా పొందవచ్చు. ఈ పథకంలో 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాల పరిమితి వరకు డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో కనీస పెట్టుబడి మొత్తం రూ. 25,000. గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు, మీకు సాధ్యమైనంత ఎక్కువ డబ్బును ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే, అంత ఎక్కువ డబ్బు నెలనెలా తిరిగి వస్తుంది. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై 75% వరకు లోన్ కూడా తీసుకోవచ్చు. ఈ పథకాన్ని ఒక శాఖ నుంచి మరొక శాఖకు బదిలీ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.


LIC యాన్యుటీ పథకం వివరాలు:
ఎల్ఐసీ కూడా యాన్యుటీ బెనిఫిట్స్‌ అందిస్తోంది. వివిధ రకాల ప్లాన్స్‌ కింద ఈ బెనిఫిట్స్‌ అందిస్తోంది. 


1. ఎల్‌ఐసీ జీవన్ శాంతి ప్లాన్ (LIC Jeevan Shanti Plan): ఈ ప్లాన్‌ కొనుగోలు చేసిన వెంటనే యాన్యుటీ ప్రయోజనాన్ని పొందడం ప్రారంభం అవుతుంది. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేవాళ్లకు మొత్తం 10 ఆప్షన్స్‌ ఉంటాయి. వాటిలో మీరు దేనినైనా ఎంచుకోవచ్చు. అదే విధంగా, మీ అవసరానికి అనుగుణంగా పేమెంట్ ప్లాన్‌ను కూడా ఎంచుకోవచ్చు.


2. ఎల్‌ఐసీ న్యూ జీవన్ నిధి ప్లాన్ ((LIC New Jeevan Nidhi Plan): దీనిలో నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. నిర్ణీత కాల వ్యవధి తర్వాత, మీరు ప్రతి నెలా యాన్యుటీ ప్రయోజనం పొందుతారు.


3. ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్ VII (LIC Jeevan Akshay VII): ఈ పథకంలో, సీనియర్ సిటిజన్లు మొత్తం 10 ఆప్షన్లు పొందుతారు. ఇందులో పెట్టుబడి వల్ల మరణించే వరకు పెన్షన్ ప్రయోజనం పొందడం దీని ప్రత్యేకత. మీరు ఎంచుకున్న ఆప్షన్‌ ఆధారంగా యాన్యుటీ కోసం పెట్టుబడి పెట్టవచ్చు.


మరో ఆసక్తికర కథనం: పుంజుకున్న విదేశీ వాణిజ్యం, రెండు వారాల తర్వాత ఫారెక్స్‌ కళ