Post Office Time Deposit Scheme: ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా చాలా రకాల పెట్టుబడి + పొదుపు పథకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కేంద్ర ప్రభుత్వం భరోసా ఉంటుంది. కాబట్టి, వీటిలో మీ పెట్టుబడి నూటికి నూరు శాతం సురక్షితం. పోస్టాఫీస్ పథకాల్లో డిపాజిట్ చేసిన మొత్తంపై మంచి వడ్డీ రాబడితో పాటు ఆదాయ పన్నును ఆదా చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ మీరు టాక్స్ పేయర్ అయితే, పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడితో ఇన్‌కమ్ టాక్స్ బెనిఫిట్ పొందొచ్చు.
ఇప్పుడు మనం చెప్పుకునే పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (POTD) స్కీమ్ ఇన్‌కమ్ టాక్స్ బర్డెన్ తగ్గిస్తుంది, 7.5 శాతం వడ్డీ ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది. ఈ పథకం మెచ్యూరిటీ పిరియడ్ 5 సంవత్సరాలు. దీంతో పాటు.. ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాల కాల పరిమితి ఆప్షన్లతోనూ టర్మ్ డిపాజిట్స్ అందుబాటులో ఉన్నాయి.
ఏ టైమ్ డిపాజిట్‌పై ఎంత వడ్డీ?
వివిధ కాల పరిమితుల ప్రకారం, ఈ టర్మ్ డిపాజిట్ మీద 6.8 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఒక సంవత్సర కాల డిపాజిట్ మీద 6.8 శాతం వడ్డీ, రెండు సంవత్సరాల డిపాజిట్ మీద 7 శాతం వడ్డీ, మూడు సంవత్సరాల డిపాజిట్ మీద కూడా 7 శాతం వడ్డీ లభిస్తుంది. ఐదేళ్ల కాలానికి మీరు డిపాజిట్ చేస్తే 7.5 శాతం వడ్డీని పోస్టాఫీసు చెల్లిస్తుంది. షార్ట్‌టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు బెస్ట్ ఆప్షన్‌గా ఎక్స్‌పర్ట్స్ వీటిని సజెస్ట్ చేస్తున్నారు.
పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లలో నాలుగు ఆప్షన్లు (1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు) అందుబాటులో ఉన్నా, వాటన్నింటి పైనా ఆదాయ పన్ను మినహాయింపు దక్కదు. వీటిలో... 5 సంవత్సరాల టర్మ్ డిపాజిట్ మీద మాత్రమే ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 80C కింద టాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ సమయంలో దీనిని మాత్రమే మీరు క్లెయిమ్ చేసుకోగలరు.
ఎంత టాక్స్ ఆదా అవుతుంది?
ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 80C కింద ఒకటిన్నర లక్షల రూపాయల వరకు ఆదాయ పన్నును మీరు ఆదా చేసుకోవచ్చు. చాలా రకాల గర్నమెంట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌కు కూడా ఈ సెక్షన్ వర్తిస్తుంది.
ప్రిమెచ్యూర్ క్లోజర్ రూల్
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్‌ను మెచ్యూరిటీకి ముందే క్లోజ్ చేసి ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చు. డిపాజిట్ చేసిన తేదీ నుంచి ఆరు నెలల లోపు వరకు లాక్-ఇన్ పిరియడ్. అంటే, తొలి ఆరు నెలల్లో ఒక్క రూపాయి విత్‌డ్రాకు కూడా అనుమతించరు. డిపాజిట్ చేసిన ఆరు నెలల తర్వాత - ఒక సంవత్సరం లోపు ఖాతాను మూసిస్తే, పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌కు వర్తించే వడ్డీ రేటును ఆ డిపాజిట్‌కు అప్లై చేసి, వడ్డీతో కలిపి మీ డబ్బు తిరిగిస్తారు. 1 సంవత్సరం తర్వాత క్లోజ్ చేస్తే వడ్డీ రేటులో కొంత శాతాన్ని కోత పెడతారు.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇవాళ్టి రేట్లివి