New Income Tax Rules From April 2023: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY23) అతి త్వరలో ముగియనుంది. ఏప్రిల్‌ 01వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (FY24) ప్రారంభమవుతుంది. తనతో పాటే కొన్ని మార్పులను తీసుకొస్తోంది కొత్త ఆర్థిక సంవత్సరం. ముఖ్యంగా, ఆదాయపు పన్నుకు సంబంధించిన కొన్ని నియమాలు మారబోతున్నాయి, ఇది తెలుసుకోవడం ముఖ్యం. 2023 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్‌లో(Union Budget 2023) ఈ మార్పులను ప్రతిపాదించారు. 


సాధారణ పన్ను చెల్లింపుదార్ల విషయంలో ఎలాంటి మార్పులు రానున్నాయో తెలుసుకుందాం...


వేతనదార్లకు TDS తగ్గింపు
వచ్చే నెల నుంచి, కొత్త పన్ను విధానంలో జీతపు వ్యక్తులు లబ్ధి పొందనున్నారు. వారికి ఇప్పుడు TDS తగ్గుతుంది. పన్ను చెల్లించదగిన ఆదాయం రూ. 7 లక్షల కంటే తక్కువగా ఉన్న  & కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న పన్ను చెల్లింపుదార్లపై ఎలాంటి TDS విధించరు. ఇందుకోసం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 87A కింద అదనపు మినహాయింపు ఇచ్చారు.


లిస్టెడ్ డిబెంచర్లపై TDS
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 193, నిర్దిష్ట సెక్యూరిటీలకు సంబంధించి చెల్లించే వడ్డీపై TDSను మినహాయిస్తుంది. ఆ సెక్యూరిటీ డీమెటీరియలైజ్డ్ రూపంలో ఉండి, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ అయితే, అటువంటి సందర్భంలో చెల్లించే వడ్డీపై TDS కట్‌ చేయరు. ఇది మినహా మిగిలిన అన్ని చెల్లింపులపై 10 శాతం TDS కట్‌ చేస్తారు.


ఆన్‌లైన్ గేమ్‌పై పన్ను
ఆన్‌లైన్ గేమ్‌ ఆడి డబ్బు గెలిస్తే, అలాంటి లాభాలపై ఏప్రిల్‌ నెల నుంచి భారీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని కొత్త సెక్షన్ 115 BBJ ప్రకారం, గెలుపు రూపంలో వచ్చిన ఆదాయంపై 30% పన్ను విధిస్తారు. ఈ పన్ను TDS రూపంలో తీసివేస్తారు.


తక్కువ పన్ను ప్రయోజనాలు               
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54, 54F కింద లభించే ప్రయోజనాలు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి తగ్గుతాయి. ఏప్రిల్ 01 నుంచి, ఈ సెక్షన్ల కింద మూలధన లాభాన్ని రూ. 10 కోట్ల వరకు మాత్రమే మినహాయిస్తారు. దీని కంటే ఎక్కువ మూలధన లాభంపై ఇండెక్సేషన్ బెనిఫిట్‌తో 20 శాతం చొప్పున పన్ను విధిస్తారు.


మూలధన లాభాలపై అధిక పన్ను          
ఏప్రిల్ 01, 2023 నుంచి..., ఆస్తి అమ్మకం ద్వారా వచ్చే లాభంపై అధిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలు లేదా మరమ్మత్తు ఖర్చులో మార్పులు వస్తాయి. దీంతోపాటు, మార్కెట్-లింక్డ్ డిబెంచర్ల బదిలీ, రిడెంప్షన్ లేదా మెచ్యూరిటీ ద్వారా వచ్చే మూలధన లాభాలకు స్వల్పకాలిక మూలధన లాభాల పన్నును చెల్లించాల్సి ఉంటుంది.


బంగారం విషయంలో మార్పు        
ఏప్రిల్ నెల నుంచి భౌతిక బంగారాన్ని ఎలక్ట్రానిక్ గోల్డ్‌ రిసిప్ట్స్‌గా (EGR), EGRను భౌతిక బంగారంగా మార్చుకుంటే దానిపై ఎటువంటి మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఈ ప్రయోజనాన్ని పొందడానికి, SEBI రిజిస్టర్డ్ వాల్ట్ మేనేజర్ ద్వారా ఈ పనిని చేయాల్సి ఉంటుంది.