Income Tax: కొత్త ఆర్థిక సంవత్సరంతో (FY24) పాటే ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ సీజన్‌ కూడా ప్రారంభమైంది. ఆదాయపు పన్ను రిటర్న్  (ITR Filing) ఫైల్ చేయడానికి ప్రస్తుతం కొత్త పన్ను విధానం, పాత పన్ను విధానం రెండూ అందుబాటులో ఉన్నాయి. కొత్త విధానాన్ని ఎక్కువ మంది ప్రజలు ఎంచుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. అందుకే, కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్‌గా మార్చింది. అయితే, పాత పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశం పన్ను చెల్లింపుదార్లకు అందుబాటులో ఉంది.


డిఫాల్ట్‌గా మార్చడం అంటే?
ముందుగా, కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్‌గా మార్చడం చేయడం అంటే ఏమిటో తెలుసుకుందాం. మీ ప్రాధాన్య పన్ను విధానం గురించి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే మీరు మీ సంస్థ యాజమాన్యానికి తెలియజేయాలి. లేకపోతే, కొత్త పన్ను విధానం మీకు ఆటోమేటిక్‌గా అప్లై అవుతుంది. ఇంకా సరళంగా చెప్పాలంటే... మీరు జీతం పొందే వ్యక్తి అయితే, మీ మౌనాన్ని కొత్త ఆదాయ పన్ను విధానానికి అంగీకారంగా ఆదాయపు పన్ను విభాగం భావిస్తుంది.


వాస్తవానికి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) కొన్నాళ్ల క్రితం అన్ని కంపెనీల యాజమాన్యాలకు ఒక సూచన చేసింది. తమ ఉద్యోగులు కొత్త లేదా పాత పన్ను విధానంలో దేనిలో కొనసాగాలనుకుంటున్నారో ముందుగానే అడగాలని ఆయా యజమాన్యాలకు సూచించింది. ఎంచుకునే పన్ను విధానాన్ని బట్టి ఆదాయ మూలం వద్ద పన్నును (TDS) మినహాయిస్తారు. ఈ నేపథ్యంలో, పన్ను చెల్లింపు ఎంపికను ఒకసారి ఎంచుకున్న తర్వాత, మళ్లీ దానిని మార్చుకునే అవకాశం ఉందా అన్న ప్రశ్న పన్ను చెల్లింపుదార్ల నుంచి వ్యక్తమవుతోంది. దీనికి సమాధానం అవును అయితే, ఎన్నిసార్లు ఇలా మార్చుకోవచ్చు అనే మరో ప్రశ్న తలెత్తుతోంది.


మీది వ్యాపార ఆదాయం అయితే, మీకున్న అవకాశం ఇది
డిఫాల్ట్ ఆప్షన్ తర్వాత కూడా పన్ను విధానాన్ని మార్చుకునే సదుపాయాన్ని 'వ్యాపార ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదార్లకు' ఆదాయపు పన్ను విభాగం కల్పించింది. అయితే, రెండు వ్యవస్థల మధ్య మారే సదుపాయం జీతం నుంచి ఆదాయం పొందుతున్న వ్యక్తుల తరహాలో వ్యాపారస్తులకు ఉండదు. వ్యాపార ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదార్లు, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న తర్వాత, పాత విధానానికి తిరిగి వెళ్లడానికి ఒకే ఒక్క అవకాశం లభిస్తుంది. భవిష్యత్తులో వాళ్లు మళ్లీ దానిని మార్చుకోలేరు.


జీతభత్యపుదార్లకు ఈ సౌకర్యం
జీతం పొందే పన్ను చెల్లింపుదార్ల (Salaried Taxpayers) గురించి మాట్లాడుకుంటే, వాళ్లు ఒక ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఏ విధాన్నీ ఎంచుకోకపోతే కొత్త పన్ను విధానం డిఫాల్ట్‌గా అప్లై అవుతుంది. కొత్త సిస్టమ్ స్లాబ్ ప్రకారం కంపెనీ అతని జీతం నుంచి TDS కట్ చేస్తుంది. అయితే, అతను ఆదాయ పన్ను పత్రాలు ఫైల్ చేసేటప్పుడు, కావాలనుకుంటే పాత పన్ను విధానంలోకి మారవచ్చు. చెల్లించాల్సిన పన్ను కంటే TDS ఎక్కువగా కట్‌ అయితే, పన్ను వాపసు కోసం క్లెయిమ్ చేయవచ్చు. ఇలా పన్ను జీతం పొందే పన్ను చెల్లింపుదార్లు రెండు పన్ను విధానాల మధ్య ఎన్నిసార్లయినా మారవచ్చు.