How To Get A Duplicate Aadhaar Card Online: ఆధార్ కార్డు అనేది 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఇది భారతీయ పౌరుల వ్యక్తిగత గుర్తింపు కోసం జారీ చేసిన కీలకమైన రుజువు పత్రం. ప్రభుత్వ ప్రయోజనాలు అందుకోవడం దగ్గర నుంచి బ్యాంక్‌ రుణాలు పొందడం వరకు ఇది కీలకం. ఒకవేళ మీ ఆధార్ కార్డ్‌ కనిపించకుండా పోతే, ఉడాయ్‌ (UIDAI) వెబ్‌సైట్‌ నుంచి గానీ లేదా ఎంఆధార్‌ యాప్‌ (mAadhaar App) ద్వారా గానీ దానిని సులభంగా తిరిగి పొందవచ్చు లేదా డూప్లికేట్‌ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


డూప్లికేట్ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి?
'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (UIDAI) జారీ చేసిన అసలు ఆధార్ కార్డుకు ప్రత్యామ్నాయమే ఈ డూప్లికేట్‌ ఆధార్ కార్డ్. అసలు కార్డు పోయినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు డూప్లికేట్‌ కార్డ్‌ను జారీ చేస్తారు. డూప్లికేట్‌ కార్డు అసలు కార్డు మాదిరిగానే ఆధార్ నంబర్ & బయోమెట్రిక్ సమాచారాన్ని కలిగి ఉంటుంది. ప్రభుత్వ పథకాలు & గుర్తింపు ధృవీకరణతో సహా అసలు ఆధార్‌ కార్డ్‌తో పొందే అన్ని సేవలను ప్రజలు డూప్లికేట్‌ కార్డ్‌ను ఉపయోగించి పొందవచ్చు.


డూప్లికేట్‌ ఆధార్ కార్డ్‌ తీసుకోవాల్సిన అవసరం ఉందా?
అసలు కార్డ్‌ పోగొట్టుకున్న వ్యక్తి, ఆన్‌లైన్‌లో లేదా ఆధార్ నమోదు కేంద్రంలో అవసరమైన వివరాలను అందించి డూప్లికేట్‌ ఆధార్ కార్డ్‌ కోసం అప్లై చేయవచ్చు. వాస్తవానికి, ఆధార్ కార్డు పోగొట్టుకోవడం కీలకమైన సేవలు పొందలేకపోవచ్చు.  ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ & టెలికమ్యూనికేషన్‌ వంటి చాలా పనులకు ఇది కావాలి కాబట్టి డూప్లికేట్‌ ఆధార్ కార్డును తీసుకోవడం అవసరం. డూప్లికేట్‌ కార్డ్‌ మీ చేతిలో ఉంటే, మీరు పొందే సర్వీసుల్లో అంతరాయం ఉండదు. ఇది ఆర్థిక లావాదేవీలు & చట్టపరమైన ప్రక్రియలకు కీలకమైన KYC పత్రం కాబట్టి, గుర్తింపు ధృవీకరణ కోసం డూప్లికేట్‌ ఆధార్‌ కార్డ్‌ మీ జేబులో ఉండాల్సిందే.


పోగొట్టుకున్న ఆధార్‌ కార్డ్‌ స్థానంలో డూప్లికేట్‌ తీసుకోకపోతే, మీ ఆధార్ నంబర్‌ను అనధికార పనుల కోసం వినియోగించుకునే ప్రమాదం ఉంది. మీ వ్యక్తిగత & బయోమెట్రిక్ డేటా కూడా ప్రమాదంలో పడుతుంది. ఆర్థికంగా, చట్టపరంగా ఇబ్బందులు రాకూడదనుకుంటే డూప్లికేట్‌ ఆధార్ కార్డును తీసుకోవడం చాలా ముఖ్యం.


డూప్లికేట్‌ ఆధార్ కార్డ్‌ తీసుకోవడానికి అవసరమైన పత్రాలు


మీ గుర్తింపును ధృవీకరించడానికి చెల్లుబాటు అయ్యే ఫోటో ID (ఉదా: పాస్‌పోర్ట్, ఓటరు ID లేదా డ్రైవింగ్ లైసెన్స్)
చిరునామా రుజువు. దీనికోసం యుటిలిటీ బిల్లులు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు లేదా అద్దె ఒప్పందాలు సమర్పించవచ్చు.
దరఖాస్తు చేయడానికి OTP ధృవీకరణ అవసరం కాబట్టి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మీ ఆధార్‌కు లింక్ అయి ఉండాలి. 


డూప్లికేట్‌ ఇ-ఆధార్ కార్డ్‌ను ఆన్‌లైన్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?


మీరు ఇంట్లోంచి కదలకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయానుకుంటే, అవసరమైన సమాచారం, పత్రాలను సమర్పించడానికి UIDAI పోర్టల్‌లోకి వెళ్లాలి.


UIDAI సెల్ఫ్‌ సర్వీస్‌ పోర్టల్‌ను సందర్శించండి.
ఇక్కడ, 'Retrieve EID/Aadhaar Numbe' ఆప్షన్‌ ఎంచుకోండి.
మీ పూర్తి పేరు, రిజిస్టర్డ్‌ ఇ-మెయిల్ అడ్రస్‌ & రిజిస్టర్డ్‌ మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయండి.
సెక్యూరిటీ కోడ్‌ను నింపి "Get One-Time Password"పై క్లిక్ చేయండి.
మీ రిజిస్టర్డ్‌ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, దానిని ఇక్కడ ఎంటర్‌ చేయండి.
వెరిఫికేషన్‌ తర్వాత, మీరు మీ ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ను ఇ-మెయిల్ లేదా మొబైల్ ద్వారా అందుకుంటారు.
ఇప్పుడు, UIDAI పోర్టల్‌కి తిరిగి వెళ్లి “Download Aadhaar” పై క్లిక్ చేయండి.
మీ ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ నంబర్, పేరు, పిన్ కోడ్ & క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
"Get One-Time Password" పై క్లిక్ చేసి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇ-మెయిల్‌కు వచ్చిన OTPని ఇక్కడ ఎంటర్‌ చేయండి.
OTP ధృవీకరణ పూర్తయిన తర్వాత, మీరు మీ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


మరో ఆసక్తికర కథనం: ఓ మెట్టు దిగి వచ్చిన పసిడి రేటు - మీ ఏరియాలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ