Canadian Salary Real Worth In India: ఉన్నత చదువులు, మంచి ఉద్యోగాలు, మెరుగైన జీవనశైలి కోసం కెనడా వెళ్లే భారతీయుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. ఈ చిన్న దేశం, అగ్రరాజ్యం అమెరికాను ఆనుకుని ఉంటుంది & సరిహద్దులు పంచుకుంటుంది. ప్రతి సంవత్సరం, వేలాది మంది భారతీయులు, ముఖ్యంగా యువత మంచి ఉద్యోగం & మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ కెనడాకు వెళుతున్నారు. ఒక భారతీయ వ్యక్తి కెనడాలో ఉద్యోగం సంపాదించి, ఏడాదికి 30 వేల కెనడియన్ డాలర్ల (అమెరికన్ డాలర్లు కాదు) జీతం తీసుకుంటుంటే, భారతదేశంలో దాని విలువ ఎంత ఉంటుందో తెలుసా?. కెనడియన్ డాలర్లను CAD (Canadian dollar) అని పిలుస్తారు. అమెరికన్ డాలర్లను USD అని పిలుస్తారు.
కరెన్సీ మార్పిడి విలువముందుగా, కెనడియన్ డాలర్ (CAD) - భారత రూపాయి (INR) మధ్య మారకపు రేటు ఎంత అనేది అర్థం చేసుకోవాలి. ఈ రోజు మార్చి 28, 2025 నాటి ప్రస్తుత మారకపు రేటు ప్రకారం, 1 కెనడియన్ డాలర్ దాదాపు 59.71 రూపాయలకు సమానం.
సంవత్సరానికి 30,000 కెనడియన్ డాలర్లు సంపాదిస్తుంటే = 30,000 x 59.71 = 17,91,300 రూపాయలు అవుతుంది. అంటే, దాదాపు రూ. 18 లక్షల జీతం ఆర్జిస్తున్నట్లు. నెలవారీ ప్రాతిపదికన చూస్తే, 17,98,500 ÷ 12 = నెలకు 1,49,275 రూపాయల జీతం తీసుకుంటున్నట్లు లెక్క. ఈ విధంగా, కెనడాలో సంవత్సరానికి 30 వేల డాలర్లు సంపాదించే వ్యక్తి భారతదేశంలో నెలకు దాదాపు లక్షన్నర రూపాయలు సంపాదిస్తున్నాడని అర్ధం. ఇది చాలా మంచి మొత్తం.
కొనుగోలు శక్తికరెన్సీ మార్పిడి విలువ మాత్రమే సంపూర్ణ విలువను చెప్పదు. కెనడా - భారతదేశం మధ్య జీవన వ్యయం & కొనుగోలు శక్తి భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. భారతదేశంలో కంటే కెనడాలో నివసించడం చాలా ఖరీదైన వ్యవహారం. ముఖ్యంగా టొరంటో, వాంకోవర్ వంటి పెద్ద నగరాల్లో ఉండాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది. అక్కడ గృహ నిర్మాణం, రవాణా, ఆరోగ్య సేవలు, విద్యపై చాలా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. కొనుగోలు శక్తి పరంగా చూస్తే, భారతదేశంలో నెలకు దాదాపు 60-70 వేల రూపాయల ఆదాయం కెనడాలో సంవత్సరానికి 30 వేల కెనడియన్ డాలర్లు అందించే జీవనశైలికి సరిపోతుంది. దీని అర్ధం, కెనడాలో ఉండి సంవత్సరానికి దాదాపు రూ. 18 లక్షలు (30000 CAD) లేదా నెలకు రూ. 1.5 లక్షలు సంపాదించినప్పటికీ, కొనుగోలు సామర్థ్యం పరంగా, దాని వాస్తవ విలువ భారతదేశంలో నెలకు దాదాపు రూ. 60-70 వేలకు సమానం.
పన్ను ప్రభావం కెనడాలో ఆదాయ పన్ను (Income tax in Canada) భారతదేశం కంటే ఎక్కువ. కెనడాలో పన్ను నిర్మాణం వల్ల అధిక ఆదాయంపై ఎక్కువ పన్ను చెల్లించాలి. 30,000 CAD వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపు తర్వాత నికర ఆదాయం ఇంకా తక్కువగా ఉంటుంది. భారతదేశం - కెనడా మధ్య పోల్చుకుంటున్నప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఇది.
కెనడాలో ఏయే రంగాలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి?కెనడాలో ఐటీ, ఇంజినీరింగ్, హెల్త్‌కేర్, ఫైనాన్స్ వంటి రంగాలలో భారతీయులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అక్కడి వలస విధానం కూడా నైపుణ్యం కలిగిన కార్మికులకు అనుకూలంగా ఉంటుంది. కెనడాలో భారతీయ నిపుణుల సంఖ్య పెరగడం అక్కడి ఉద్యోగ మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఇటీవలి ఒక నివేదిక ప్రకారం, భారతీయులు ఐటీ, ఇంజినీరింగ్, ఫైనాన్స్, హెల్త్‌కేర్ వంటి రంగాలలో చురుకుగా పని చేస్తున్నారు.
విదేశాల్లో ఉద్యోగానికి వెళ్లే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండివిదేశీ ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నప్పుడు, జీతం మాత్రమే కాకుండా జీవన నాణ్యత, కెరీర్ వృద్ధి, సామాజిక భద్రత, కుటుంబ అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కెనడా దేశం భారతీయులకు, ముఖ్యంగా మెరుగైన విద్య, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు ఉన్న దేశంలో నివసించాలనుకునే వారికి మంచి ఎంపిక కావచ్చు.