Changes In Financial Rules From April 2025: కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 (FY 2025-26) మరికొన్ని రోజుల్లో, అంటే ఏప్రిల్ 01 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కొత్త ఆర్థిక సంవత్సరం దేశ ప్రజల కోసం చాలా శుభ సూచనలు తీసుకువస్తోంది. ముఖ్యంగా, డబ్బు విషయంలో మనం చెప్పుకోవడానికి మంచి సంగతులు ఉన్నాయి. కొత్త సంవత్సరం నుంచి చాలా పన్నులు తగ్గడం, ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెరగడం, రెపో రేట్ తగ్గడం వంటి కారణాలన్నీ కలిసి జనం జేబుల్లో డబ్బులు పెంచుతాయి. తద్వారా, ఖర్చు పెట్టే స్థోమత పెరుగుతుంది.
మీ ఆర్థిక స్థోమతను పెంచే 3 ముఖ్య కారణాలు
1. పన్ను స్లాబ్‌లు, రేట్లలో మార్పులు2025 బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త ఆదాయ పన్ను విధానం 01 ఏప్రిల్ 2025 నుంచి అమలులోకి వస్తుంది. కొత్త విధానాన్ని ఎంచుకునే టాక్స్‌పేయర్లు ₹12 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంకా, మార్జినల్ టాక్స్ రిలీఫ్ కారణంగా, ₹12 లక్షల కంటే కొంచెం ఎక్కువ ఆదాయాలు ఉన్నప్పటికీ 'సున్నా పన్ను' లేదా కనిష్ట పన్ను మాత్రమే వర్తిస్తుంది. అయితే, ఆదాయ పన్ను చట్టం ప్రకారం ప్రత్యేక రేట్లు వర్తించే ఆస్తుల నుంచి వచ్చిన ఆదాయానికి ₹12 లక్షల పన్ను రహిత నియమం వర్తించదు.
ఉద్యోగులకు కొత్త పన్ను విధానంలో ₹75,000 ప్రామాణిక మినహాయింపు కూడా ఉంది, ఈ కారణంగా పన్ను రహిత ఆదాయ పరిమితి ₹12.75 లక్షలు అవుతుంది. జీతం ₹12.75 లక్షల కంటే మించని ఉద్యోగుల నుంచి కంపెనీ యాజమాన్యాలు ముందస్తు పన్ను వసూలు చేయవు. అందువల్ల, ఉద్యోగుల చేతికి వచ్చే జీతం పెరుగుతుంది. ఇప్పటి వరకు అధిక ఆదాయ బ్రాకెట్‌లో ఉన్నవాళ్లు కూడా, ఏప్రిల్ నుంచి కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే దాదాపు ₹1 లక్ష వరకు ఆదా చేసే అవకాశం ఉంది. దీనివల్ల చేతిలో డబ్బు & ఖర్చు పెట్టగల స్థోమత రెండూ పెరుగుతాయి.
2. రెపో రేట్ కోతలుఈ ఏడాది ఫిబ్రవరిలో, రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటును 0.25% తగ్గించింది. రెపో రేటు తగ్గడం వల్ల బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి, తక్కువ రేట్లకు కొత్త లోన్‌లు లభిస్తాయి. రెపో రేటు-లింక్డ్ ఫ్లోటింగ్ రేట్‌తో ఇప్పటికే తీసుకున్న లోన్‌లపై కూడా వడ్డీ రేటు తగ్గుతుంది, తద్వారా EMI తగ్గుతుంది. ఫలితంగా, రుణగ్రహీతలకు డబ్బు ఆదా అవుతుంది. ఫిబ్రవరిలో రెపో రేట్ తగ్గిన తర్వాత, బ్యాంక్‌లు గృహ రుణాలు, వాహన రుణాలు వంటి లోన్‌లపై ఇప్పటికీ వడ్డీ రేట్లను తగ్గించాయి. SBI రీసెర్చ్ ప్రకారం, RBI 2025-26 ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును మరో 0.75% తగ్గివచ్చు.
3. పెరిగిన TDS మినహాయింపు పరిమితులు01 ఏప్రిల్ 2025 నుంచి, అద్దెలు & డిపాజిట్లు వంటి చాలా రకాల లావాదేవీలపై TDS మినహాయింపు పరిమితి పెరుగుతుంది. దీని ప్రకారం, వివిధ డిపాజిట్‌లపై సీనియర్ సిటిజన్లు సంపాదించే వడ్డీ ఆదాయం ₹1 లక్ష వరకు TDS కట్ కాదు, ఇప్పటి వరకు అది ₹50,000గా ఉంది. సాధారణ పౌరులు ₹50,000 వడ్డీ ఆదాయం సంపాదించినా TDS ఉండదు, ఇప్పటి వరకు అది ₹40,000గా ఉంది.
ఏప్రిల్ నుంచి, అద్దె నెలకు లేదా నెలలో కొంతభాగానికి ₹50,000 (₹6 లక్షలు/సంవత్సరానికి) దాటితేనే TDS కట్ అవుతుంది. ప్రస్తుతం ఈ పరిమితి సంవత్సరానికి ₹2.4 లక్షలుగా ఉంది.
ఏప్రిల్ నుంచి, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) కింద చేసిన విదేశీ చెల్లింపులు ₹10 లక్షలు దాటితేనే TDS కట్ అవుతుంది, ఇప్పుడు ఈ పరిమితి ₹7 లక్షలు. విద్యారుణం తీసుకుని విదేశీ విద్యాసంస్థల ఫీజ్‌గా చెల్లిస్తే TCS ఉండదు.
నూతన ఆర్థిక సంవత్సరం నుంచి ఇన్ని రకాల ఆర్థిక భారాలు తగ్గుతాయి కాబట్టి, ప్రజల చేతుల్లో డబ్బు క్రమంగా పెరుగుతుంది. తద్వారా, ఎక్కువ ఖర్చు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది.